పూటగడవని కుటుంబంలో పుట్టిన అనూషకు ఆర్థిక పరిస్థితులు అవరోధంగా నిలిచాయి. అయితే పతకం సాధించి దేశానికి ఖ్యాతి తీసుకురావాలన్న తపన ఆ అవరోధాలను అధిగమించేలా చేసింది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా మొక్కవోని ఆత్మ సై ్థర్యంతో పతకాలను సాధిస్తూ పవర్ గర్ల్‌గా, వేమన విశ్వవిద్యాలయ మహిళా శక్తిగా ఖ్యాతి గడించి.. ప్రపంచక్రీడాపటంలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనూష.
యోగివేమన విశ్వవిద్యాలయం క్రీడాకారిణి పవర్‌లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తూ తెలుగు మహిళల సత్తా ప్రపంచానికి చాటుతోంది. వైవీయూ అనుబంధంగా గల బద్వేలు పట్టణంలోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న డొంకెన అనూష స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందగల గ్రామం. ఫిబ్రవరి 16 నుంచి 18వ (నేడు) వరకు కేరళలోని కాలికట్‌లో నిర్వహించనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు అనూషను ‘సాక్షి’ పలకరించినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని.. ఆర్థిక చేయూతనిస్తే కామన్వెల్త్‌లో పతకం సాధించి దేశఖ్యాతిని ప్రపంచక్రీడాపటంలో చాటిచెబుతానని ఆమె ఆత్మవిశ్వాసంతో అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నాన్న కల్లుగీత కార్మికుడు. ఎంత కష్టమైనా సరే నన్ను చదివించాలనుకున్నారు. నాకు మాత్రం చదువుతో పాటు ఆటలంటే ఎంతో ఆసక్తి. చిన్నతనం నుంచి రకరకాల ఆటల్లో పాల్గొనేదాన్ని పాఠశాలస్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించాను కూడా.
మగరాయుడిలా వేషాలేంటన్నారు
మా ఊర్లో ఆడపిల్లలంటే చిన్నచూపు. దానికి కారణం నిరక్షరాస్యత అయితే.. రెండో కారణం ఆటలపై అవగాహన లేకపోవడమే. నేను పదోతరగతి చదువుతున్నప్పుడు మైలవరంలో ఓ శిక్షణ శిబిరం జరిగింది. అక్కడకు వెళ్లినప్పుడు నాకు పవర్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. నాకూ శిక్షణ తీసుకోవాలనిపించింది. దీని కోసం ప్యాంట్లు వేసుకోవాల్సి వచ్చేది. మా గ్రామంలో చాలామందికి నచ్చలేదు. నేను అలా వేసుకుని వెళ్లినప్పుడల్లా మగరాయుడిలా ఆ బట్టలేంటి.. వేషాలేంటి.. ఆటలేంటి అని అనేవారు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్లుగా చూసేవారు. దాంతో మానసికంగా కుంగిపోయేదాన్ని. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఎవరేమనుకుంటే నాకేం అనే పరిణతి చాలా రోజులకు వచ్చింది. ఎంతకష్టమైనా సరే ఆట, చదువుని నిర్లక్ష్యం చేయకూడదనుకున్నా.
నా కోసం.. నా తమ్ముడు కూలీపనులకు వెళ్లాడు
పదోతరగతి పరీక్షల కోసమని కొన్నాళ్లు పవర్‌లిఫ్టింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్‌లో చేరాక శిక్షణ మీద దృష్టి పెట్టాను క్రమంగా జిల్లాస్థాయి పోటీలకు వెళ్లాను. పతకాలు వచ్చేవి. శిక్షణ తీసుకోవడం తేలికైంది. కానీ.. ఆ సమయంలో ఆర్థికంగా సమస్యలు తప్పలేదు. పవర్‌లిఫ్టింగ్ కోసం ఫిట్‌గా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.. నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయాలి. ఇంట్లో చూస్తేనేమో నాన్న మా పోషణకు, చదువులకే కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను అడగడం భావ్యం కాదనిపించింది. అందుకే పవర్‌లిఫ్టింగ్ వదిలేసి.. ఓ ప్రైవేట్ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా చేరా. నా మనసు మాత్రం పవర్‌లిఫ్టింగ్‌పై ఉండేది. కొన్నాళ్లకు అమ్మానాన్నలకి విషయం చెప్పా, వాళ్లు అప్పులైనా ఫర్వాలేదు.. నువ్వు అనుకున్నది చెయ్ అంటూ ప్రోత్సహించారు. అయితే కొన్ని రోజులకే నాన్న (శ్రీనివాసరావు) కు పక్షవాతం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా తమ్ముడు వంశీ నా గురించి ఆలోచించి చదువు మానేశాడు. కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. అమ్మ మల్లేశ్వరి కూడా నా కోసం పనులకు వెళ్లేది. అలా కుటుంబసభ్యుల సహకారంతో 2016లో మళ్లీ పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లా.
చదువుకుంటూనే..
తొలుత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ చదివేందుకు వెళ్లినా.. ఇబ్బందుల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో ఎవరో శ్రేయోభిలాషులు చెప్పడంతో వైవీయూలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉచితంగా విద్యనందిస్తారని తెలిసి కృష్ణా జిల్లా నుంచి వైవీయూకు వచ్చాను. వైవీయూ పరిధిలోని బద్వేలులోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో 2016లో డిగ్రీ బీఏ (హెచ్‌ఈపీ)లో చేరిపోయా. కళాశాల యాజమాన్యం ఉచిత విద్యతో పాటు నెలకు రూ.5 వేలు నా భోజన ఖర్చులకు వెచ్చిస్తూ చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారు. దీంతో పాటు మెరుగైన శిక్షణ కోసం చెన్నైలోని అంజుకర్ పవర్‌లిఫ్టింగ్ అకాడమీలో చేరా. కోచ్ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగా. దక్షిణాఫ్రికాలో 2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 18 మంది వెళితే అందులో నేను ఉన్నా. జూనియర్స్ 84 కిలోల విభాగంలో పోటీపడ్డా. స్క్వాట్ విభాగంలో 190 కిలోలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 110 కిలోలు, డెడ్‌లిఫ్ట్ విభాగంలో 182.5 కిలోలు ఎత్తి మొత్తం మీద 482.25 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించా. ఈ పోటీలకు వెళ్లడానికి ముందు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా గురించి తెలిసి చాలా మంది దాతలు ఆర్థికంగా సాయం చేశారు.
పతకం సాధించాలి.. అప్పులూ తీర్చాలి..
ప్రస్తుతానికి నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కామన్వెల్త్‌లో దేశానికి పతకం తీసుకురావడం ఒక లక్ష్యమైతే నాకోసం మా కుటుంబసభ్యులు చేసిన అప్పులు తీర్చడం మరో లక్ష్యంగా భావిస్తున్నా. ప్రపంచ పతకం సాధించిన సమయంలో ప్రభుత్వం రూ.10 లక్షలు, డీఎస్పీ స్థాయి ఉద్యోగం ప్రకటించింది. అయితే అది ఇంకా చేతికి అందలేదు. వస్తే నా కష్టాలు తీరతాయని భావిస్తున్నా.
నాగరాజు, సాక్షి, కడప
వైవీయూ అధికారుల ప్రోత్సాహం
అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న డొంకెన అనూషకు వైవీయూ అధికారులు అండగా నిలిచారు. ఆమె సాధన చేసుకునేందుకు ప్రపంచస్థాయి పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆమెకు ఉచితంగా వసతి కల్పించారు. దీంతో పాటు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణించడంతో పాటు పతకం సాధిస్తే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకంతో పాటు నెలకు రూ.5 వేలు చొప్పున ఉపకార వేతనం ఇచ్చేందుకు వైవీయూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పరీక్షల్లో సైతం 20 శాతం మేర మార్కులు కలిపి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైవీయూ అధికారులు స్పష్టం చేశారు’’ అని అనూష తెలిపారు.
అనూష సాధించిన పతకాలు
►2012లో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం.
►ఎస్‌జీఎఫ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం
►జూనియర్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం
►2014, 15, 16 జూనియర్ నేషనల్స్‌లో వరుసగా స్వర్ణం సాధించి చాంపియన్‌గా గుర్తింపు
►2014 గోవాలో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం.
►2014లో పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం
►2016లో చండీగఢ్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం
►2016లో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్‌లో కాంస్యం.
►2018లో శ్రీకాకుళం రాజాంలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ క్యాంపులో ప్రతిభ.. ప్రథమ స్థానంలో నిలవడంతో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం.
►2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలోని కొచెస్ట్రామ్‌లో నిర్వహించిన ప్రపంచ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం.
Comments
Please login to add a commentAdd a comment