విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!
నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?
అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్‌ఎస్‌ఈ)గా ఎంపిక అయింది.
ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.
నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.
‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.
ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!
నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్‌పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్‌మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.
– జవ్వాది వెంకట అనూష
– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరు
ఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
Published Sat, Dec 28 2024 4:46 AM | Last Updated on Sat, Dec 28 2024 4:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment