
అమ్మాయి..అందులోనూ కొత్త పెళ్లికూతురు అనగానే పదహారణాల పడచులా, ముట్టుకుంటే మాసిపోయేంత మృదువైన కుసుమంలా సుకుమారంగా అందంగా ఉండాలని అందరూ ఊహించుకుంటారు. ఆమె ఏ రంగంలో ఉన్నా, ఎంత సాధికారత సాధించినా, సిగ్గులమొగ్గవుతూ, తలవంచుకొని తాళి కట్టించుకుంటూ అణకువగా ఉండాలనే పద్ధతికి దాదాపు అందరూ అలవాటు అయిపోయారు. కానీ తన సిక్స్ ప్యాక్ కండలు చూపిస్తూ అందరినీ షాక్‌కి గురి చేసిందో పెళ్లికూతురు. నిజానికి ట్రెడిషనల్ కాంజీవరం చీర, నగల ముస్తాబైంది. దీంతోపాటు తనలోని బాడీ బిల్డర్ (Body Builder) విశ్వరూపాన్ని చూపించిందీ ఫిట్‌నెస్ ఫ్రీక్. బాడీ బిల్డర్, సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్ణాటకకు(Karnataka) చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్ర పురుషోత్తమ్(Chitra Purushotham) ఈమె మామూలు పెళ్లి కూతురిలా ముస్తాబైంది. కానీ అసలు సిసలైన ట్రెడిషనల్ లుక్‌లో కూడా తన అసలు సామర్థ్యమేంటో అతిథులందరి ముందూ ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. అందరి ముందూ అద్భుతమైన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఫోజులిచ్చింది. వధువు తన ఫిట్‌నెస్‌తో సాంప్రదాయ గోడలను బ్రేక్ చేసిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన అందానికి ఫిట్‌నెస్‌తోపాటు ఆత్మవిశ్వాసాన్ని జోడించిన వైనం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా అందంగా ఉంది.. మహారాణిలా ఉంది అంటూ తెగ పొగిడేశారు. సాంప్రదాయం, సాధికారత జమిలిగా ‘ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే!’ అన్న సందేశాన్నిచ్చింది.
దీనిపై కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, తన ఫిట్‌నెస్ కోసం చేసిన కృషి, సాధించిన బాడీపై దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. చాలామంది చిత్రలోని టాలెంట్‌ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు ఉండాలి, ఇలాంటి ధైర్యవంతులైన మహిళలు సమాజానికి స్ఫూర్తి.ఇదే కదా నిజమైన అందం’ అంటూ చిత్రకు మద్దతుగా వ్యాఖ్యానించడం విశేషం.

త్వరలోనే తన ప్రియుడ్ని ప్రేమ వివాహం చేసుకోనుంది చిత్ర. వివాహానికి ముందు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. చిత్ర పురుషోత్తమ్ తన ఫిట్‌నెస్‌తో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తోంది. చిత్ర పసుపు , నీలం రంగు కాంజీవరం చీరను ధరించింది.. బ్లౌజ్ లేకుండానే, కష్టపడి సంపాదించిన బాడీని ప్రదర్శించింది. ఇంకా లేయర్డ్ నెక్లెస్‌లు, కమర్‌బంద్, గాజులు, మాంగ్ టీకా , చెవి పోగులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఇంఒంటినిండా టాటూలు, పొడుగుజడ, జడగంటలు, పూలు ఇలా ఎక్కడా తగ్గకుండా తన గ్లామర్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.

చిత్ర పురుషోత్తం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు మంచి ట్రైనర్ కూడా. వధువుగా చిత్ర వైరల్ కావడం ఇదే తొలిసారి కావచ్చు, కానీ పురుషులకే సొంతం అనుకున్న రంగంలో ప్రతిభ మరోపేరుగా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. మిస్ ఇండియా ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక అండ్ మిస్ బెంగళూరు లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
చిత్ర పురుషోత్తం తాజా ఫోటోషూట్ స్టీరియోటైప్ అంచనాలను బద్దలు కొట్టి మరీ తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడమే కాకుండా, అందం, స్త్రీత్వం సామాజిక ప్రమాణాలను పునర్నిర్వచించింది. అంతేకాదు అంత దృఢమైన దేహాన్ని సాధించడంలోని తన కృషి పట్టుదల,నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. తనలాంటి వారికి ప్రేరణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment