ఎండకు గొడుగు పట్టారు.. | Donates AnUmbrella to Street Vendors Working Under the Scorching Sun | Sakshi
Sakshi News home page

ఎండకు గొడుగు పట్టారు..

Published Tue, Jun 4 2024 3:29 AM | Last Updated on Tue, Jun 4 2024 7:49 AM

Donates AnUmbrella to Street Vendors Working Under the Scorching Sun

మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. 

వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. 

‘సేవ’ అవసరం ఉంది! 
‘‘మా సర్వీస్‌ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. 

మా పేరెంట్స్‌ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్‌ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్‌ వితవుట్‌ ఏ కాజ్‌’ పేరుతో ఎన్‌జీవో ్రపారంభించాం.

 చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్‌ అవేర్‌నెస్, ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్‌ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్‌ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. 

కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. 

ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్‌ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్‌లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్‌ ద హీట్‌’ క్యాంపెయిన్‌ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. 

పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్‌ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్‌ పెట్టుకుని బ్రెడ్‌ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement