Umbrellas
-
‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్
నెన్నెల: తరగతి గదులు కురుస్తుండటంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠాలు విన్న ఘటనపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఠాకూర్ ఇందన్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు గదులున్నా వాటిని ఉపయోగించుకోకుండా కురుస్తున్న గదిలోనే పిల్లలను గొడుగులు పట్టుకుని కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంలో హెచ్ఎం ప్రమేయం ఉందని భావించి చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఆ గదిలో ఎందుకు కూర్చోబెట్టారు? గదులు కురుస్తున్నాయని తెలిసినా విద్యార్థులను అదే గదిలో ఎందుకు కూర్చోబెడుతున్నారని ఉపాధ్యాయులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశ్నించారు. వర్షాలు తగ్గే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పొడిగా ఉన్న ఇతర గదుల్లో కూర్చోబెట్టాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యను ఎందుకు పెద్దగా చేస్తున్నారని టీచర్లను మందలించారు. స్టాఫ్‌రూమ్, ల్యాబ్ రూమ్‌లతోపాటు డైనింగ్ హాల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వార్డెన్ లచ్చన్న విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఐటీడీఏ పీఓకు చెప్పి షోకాజ్ నోటీసు ఇప్పిస్తానన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ యాదయ్య పాఠశాలకు చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. -
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్‌లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
రేపు వరసిద్ధుడి రథోత్సవం
ఐరాల: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరగనున్న రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.ఆ తరువాత గొడుగులు, రథసారథి ,బ్రహ్మకు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
శ్రీవారికి చెన్నై గొడుగుల కానుక
సాక్షి, తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ ట్రస్టు సమితి నిర్వాహకులు సోమవారం తొమ్మిది గొడుగులు సమర్పించారు. చెన్నైలోని చెన్నకేశవ ఆలయం నుంచి వారం రోజుల ముందు బయలుదేరిన ఈ గొడుగుల బృందం దారిపొడవునా లక్షలాది మంది భక్తుల పూజలందుకుంటూ కాలినడకన సోమవారం కొండకు చేరుకుంది. వీరు ఊరేగింపుగా తిరుమల పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. మేళతాళాలతో తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. హిందూ ధర్మార్థ ట్రస్టు చైర్మన్ ఆర్ఆర్.గోపాల్జీ కొత్త గొడుగులను టీటీడీ ఈవో ముక్కామల గిరిధర్ గోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గోపాలన్‌జీ మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం పదేళ్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో అడుగడుగునా పూజలు అందుకున్న ఈ గొడుగులు స్వామి వారికి అందజేయడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని చెప్పారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న టీటీడీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.