శ్రీవారికి చెన్నై గొడుగుల కానుక
సాక్షి, తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ ట్రస్టు సమితి నిర్వాహకులు సోమవారం తొమ్మిది గొడుగులు సమర్పించారు. చెన్నైలోని చెన్నకేశవ ఆలయం నుంచి వారం రోజుల ముందు బయలుదేరిన ఈ గొడుగుల బృందం దారిపొడవునా లక్షలాది మంది భక్తుల పూజలందుకుంటూ కాలినడకన సోమవారం కొండకు చేరుకుంది.
వీరు ఊరేగింపుగా తిరుమల పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. మేళతాళాలతో తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
హిందూ ధర్మార్థ ట్రస్టు చైర్మన్ ఆర్‌ఆర్.గోపాల్‌జీ కొత్త గొడుగులను టీటీడీ ఈవో ముక్కామల గిరిధర్ గోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గోపాలన్‌జీ మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం పదేళ్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో అడుగడుగునా పూజలు అందుకున్న ఈ గొడుగులు స్వామి వారికి అందజేయడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని చెప్పారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న టీటీడీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.