Srivari Brahmotsava
-
బ్రహ్మోత్సవాలకు వేళాయే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి శనివారం తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను జరుపుతామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 13 నుంచి 20 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.అక్టోబర్ 13న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. 14 న రాత్రి ధ్వజారోహణ, రాత్రి 9 హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేపడతారు. 16 న ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.17 న రాత్రి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. 18 న రాత్రి రథోత్సవాన్ని, 19న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ చేపడతారు. 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు శ్రీవారికి నూతన పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు అంతకుముందు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమోక్తంగా పూజలు, నైవేద్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. -
వసంత వల్లభుని వైభవం
మార్చి 1 నుండి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఏ ఉత్సవమంటే..? మార్చి 1న అంకురార్పణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 2వ తేదీన కళ్యాణోత్సవం, 3న హంసవాహనం, 4వ తేదీ సింహ వాహనం, 5వ తేదీ హనుమంత వాహనం, 6వ తేదీ బ్రహ్మ గరుడసేవ, 7వ తేదీ శేషవాహనం, 8వ తేదీన పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ ఉత్సవాలు, 9వ తేదీన మోహినీ ఉత్సవం, 10వ తేదీన ప్రజా గరుడ సేవ, 11వ తేదీ గజవాహనం, 12న బ్రహ్మ రథోత్సవం, 13వ తేదీన అశ్వ వాహనం, 14వ తేదీన తీర్థవాది(శ్రీవారి చక్రస్నానం), 15వ తేదీన పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. - చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు నిత్య పూజలతో వెలుగొందుతున్నాడు. ఆలయానికి పడమటి వైపున నదీతీరం ఉంది. అక్కడ భృగుమహర్షి తపస్సు చేసి శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారని, ఆ మహర్షి కోరిక మేరకే స్వామివారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని పురాణ వచనం. వీటిని శ్రీవారు వసంత రుతువులో అనుగ్ర హించడం వల్ల ఉత్సవ మూర్తులకు వసంత వల్లభుడని పేరొచ్చింది. వసంత వల్లభుడైన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి యేటా పక్షం రోజుల పాటు ప్రతిరోజు వివిధ అవతారాల్లో తమ భక్తులకు కనువిందు చేస్తారు. వాటినే బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మార్చి 1న అంకురార్పణంతో ప్రారంభమై 15న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. ఖాద్రీ క్షేత్రం ప్రత్యేకత: లోక కంటకుడైన హిరణ్యకశిపుడి సంహారానికి శ్రీవారు మహోగ్రరూపంలో స్తంభంనుంచి ఆవిర్భవించారు. సగం మనిషి, సగం సింహరూపం దాల్చిన స్వామివారు తన భక్తుడు ప్రహ్లాదుని స్తోత్రంతో శాంతించి ఖాద్రీ క్షేత్రంలో కొలువుదీరారు. స్వామిపాదం కొండపై మోపడంతో ఖాద్రి అని పిలిచారు. కాలక్రమేణా దీన్ని కదిరిగా పిలుస్తున్నారు. కదిరి నృసింహుని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కల్గిన ఈ దివ్య క్షేత్రం ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామివారి స్వేద బిందువులు చూడచ్చు!: ఇక్కడ స్వామివారి మూలవిరాట్‌కు ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం స్వామివారి మూలవిరాట్ నుండి స్వేదబిందువులు ఉద్భవిస్తాయి. దీన్ని భక్తులు మహిమాన్వితంగా భావిస్తారు. ఇంకో విశేషమేమంటే ఈ ఆలయంలో స్వామివారు శ్రీలక్ష్మీ సమేతంగా శాంత మూర్తిగా దర్శనమిస్తారు. ఆలయ చరిత్ర: కదిరి-అనంతపురం రహదారిలోని 16 కిలోమీటర్ల దూరంలోవున్న పాతిరేపల్లి(నేటి పట్నం) రంగనాయకుడికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కన్పించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆయన ఆ విగ్రహాన్ని వెలికితీసి, ప్రతిష్టించి గర్భగుడిని కట్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత క్రీ.శ 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో పూర్తిస్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. అతి పెద్ద తేరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనారసింహుడు మార్చి 12న బ్రహ్మ రథోత్సవం సందర్భంగా బ్రహ్మరథంపై దర్శనమిస్తారు. ఆ రోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తారు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం. కదిరికి ఇలా చేరుకోవచ్చు: ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవాలంటే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10ని,,కు ఓ బస్సు ఉంది. అక్కడి నుండి 90 కి.మీ ఉంది. పుట్టపర్తి నుండి రావాలంటే కేవలం 40 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదా నల్లమాడ మీదుగా చేరుకోవచ్చు. తిరుపతి నుండి వచ్చే భక్తులు మదనపల్లి లేదా రాయచోటి మీదుగా రావచ్చు. పులివెందుల నుండి రావాలనుకుంటే నామాలగుండు మార్గంలో బీ కొత్తపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఈ బ్రహ్మోత్సవ వేడుకలలో రథోత్సవం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారే మిరియాలతో తలకు పట్టు వేసుకుంటారని నానుడి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఇలవేల్పు శ్రీ ఖాద్రి నరసింహస్వామి వారేనని స్థలపురాణం చెబుతోంది. నా పూర్వజన్మ సుకృతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి నారసింహుని సేవలో ఉన్నాను. నేనే కాదు.. మా కుటుంబమంతా స్వామి సేవకు అంకితమైపోయాం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి రాలేని భక్తుల కోసం స్వామివారే భక్తుల చెంతకు వెళ్తారు. స్వామికి సేవలందించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. - ఏవీ నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు -
శ్రీవారికి చెన్నై గొడుగుల కానుక
సాక్షి, తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ ట్రస్టు సమితి నిర్వాహకులు సోమవారం తొమ్మిది గొడుగులు సమర్పించారు. చెన్నైలోని చెన్నకేశవ ఆలయం నుంచి వారం రోజుల ముందు బయలుదేరిన ఈ గొడుగుల బృందం దారిపొడవునా లక్షలాది మంది భక్తుల పూజలందుకుంటూ కాలినడకన సోమవారం కొండకు చేరుకుంది. వీరు ఊరేగింపుగా తిరుమల పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. మేళతాళాలతో తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. హిందూ ధర్మార్థ ట్రస్టు చైర్మన్ ఆర్ఆర్.గోపాల్జీ కొత్త గొడుగులను టీటీడీ ఈవో ముక్కామల గిరిధర్ గోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గోపాలన్‌జీ మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం పదేళ్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో అడుగడుగునా పూజలు అందుకున్న ఈ గొడుగులు స్వామి వారికి అందజేయడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని చెప్పారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న టీటీడీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గరుడ సేవ నేడే
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ ఊరేగింపు మంగళవారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే వాహన ఊరేగింపు రాత్రి ఒంటిగంటవరకూ జరగనుంది. ఐదు లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వచ్చే అవకాశముందని టీటీడీ, పోలీసు అధికారులు అంచనావేశారు. కట్టుదిట్టమైన భద్రత గరుడ వాహన సేవలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరుమలలో 3 వేల మందితో భద్రతను పటిష్టం చేశారు. అదనంగా మరో 1500 మందిని విధులకు రప్పించారు. వాహన సేవలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు, విజిలెన్స్ అధికారులు పలుమార్లు చ ర్చించారు. సీసీ కెమెరాలతో జనం కదలికలను పాత అన్నదాన భవనంలో ఏర్పాటు చేసిన సెం ట్రల్ కమాండెంట్ సెంటర్లోని మాస్టర్ కంట్రోల్ రూమ్‌లో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆక్టోపస్ క మాండోలు, ఏఆర్ కమాండో సిబ్బందిని ఆల యం వద్ద మఫ్టీలో అనుక్షణం సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష తిరుమల జేఈవో శ్రీనివాసరాజు టీటీడీలోని ఉన్నతాధికారులతో సమీక్షించారు. గరుడ వాహ న సేవలో బ్యాడ్జిల పంపిణీ నుంచి వాహన సేవ పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన ఏర్పాట్లను చర్చించారు. భద్రతా ఏర్పాట్లపై అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, ఇన్చార్జి సీవీఎస్వో జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి సమీక్షించారు. గరుడ వాహన సేవ సందర్భంగా నాలుగు మాడా వీధుల్లో భక్తుల మ ద్య ఎలాంటి తోపులాట, తొక్కిసలాటలకు అవకా శం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మధ్యాహ్నం నుంచే మాడా వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ఆలయం వద్ద గ్యాలరీల్లో అశేష సంఖ్యలో వేచి ఉండే భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. భక్తుల మధ్య తోపులాటకు అవకాశం లేకుం డా బారికేడ్లను నిర్మించారు. గరుడ సేవ సందర్భంగా తిరుమల, తిరుపతి మధ్య రెండు ఘాట్‌రోడ్లలో మంగళవారం వేకువజాము నుంచి బుధవారం వేకువజాము వరకు ద్విచక్రవాహనాలను అనుమతించరు. పైవేట్ వాహనాలను జీఎన్సీ టోల్గేట్ వద్ద నుంచే క్రమబద్ధీకరిస్తున్నారు. గరుడ వాహన సేవ తిలకించేందుకు వీవీఐపీలు, వీఐపీలు, టీటీడీ ఉద్యోగుల కుటుంబాలు, పోలీసు కుటుంబాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు మొత్తం 3500 మందికి పాసులు, బ్యాడ్జిలు జారీ చేయాలని నిర్ణయించారు. నాలుగు మాడ వీధుల్లో ఆహారం పంపిణీకి చర్యలు గరుడసేవ సందర్భంగా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో సుమారు రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌ కర్యం కల్పించనున్నారు. మాడ వీధుల్లో పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం, ఉప్మా వంటి ఆహార పొట్లాలు, వేడిపాలు, కాఫీ, టీ అందించనున్నారు. భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీటీసీ సంజీవిని, 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి. అనుకోని సంఘటన ఎదురైతే నాలుగు మాడ వీధుల్లోకి ఫైర్‌ఇంజన్ సులభంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
2.2 లక్షల మంది వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లు సుప్రభాతం మినహా అన్ని ఆర్జిత సేవలు...గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు తిరుమల: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 2.20 లక్షల మంది భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో కూర్చుని ఉత్సవమూర్తులను దర్శించేలా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మించారు. ప్రత్యేకించి తూర్పుమాడ వీధిలోని గ్యాలరీల్లో బల్లలు ఏర్పాటు చే శారు. వాహనమండపం కుడివైపున భక్తుల మధ్య తోపులాటకు అవకాశం లేకుండా ఈసారి ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టారు. గరుడ సేవకు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకు.. దాదాపు ఐదు గంటలపాటు గరుడ వాహనసేవ ఊరేగింపు జరగనుంది. వాహన సేవల్లో హారతులు ఇచ్చేందుకు వచ్చే భక్తులు నిర్ణయించిన సంఖ్యలో మాత్రమే ఆయా కూడళ్లలో ఉండేలా క్యూలు నిర్మించారు. ఆర్జిత సేవలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రభాతం మినహా మిగిలిన ఆర్జిత సేవలను రద్దు చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌లోని గదులను కూడా రద్దు చేశారు. దాతలు స్వయంగా వస్తేనే వారికి మాత్రమే గదులు కేటాయించనున్నారు. సిఫారసులు అంగీకరించరు. అయితే ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా కేటాయించిన రూ.300 టికెట్ల భక్తులను మాత్రం యథావిధిగా కొనసాగించనున్నారు. అదే సందర్భంలో తిరుమలలో తాత్కాలికంగా కరెంట్ బుకింగ్ కూడా రద్దు చేసి, ఉత్సవాల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. సిఫారసు లేఖలు ఇవ్వొద్దు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆమేరకు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎంఎల్ఏలు ఎలాంటి సిఫారసు లేఖలు ఇవ్వొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఒక వేళ ఇచ్చినా వాటిని స్వీకరించే పరిస్థితులు లేవని ఇక్కడి అధికారులు తెలిపారు. గదుల కేటాయింపు విషయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.