అక్టోబర్ 13 నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
17 న రాత్రి 8 గంటలకు స్వామివారి తిరుకల్యాణం
18 న రాత్రి 7 గంటలకు రథోత్సవం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి శనివారం తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను జరుపుతామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 13 నుంచి 20 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
అక్టోబర్ 13న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. 14 న రాత్రి ధ్వజారోహణ, రాత్రి 9 హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేపడతారు. 16 న ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
17 న రాత్రి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. 18 న రాత్రి రథోత్సవాన్ని, 19న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ చేపడతారు. 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment