వసంత వల్లభుని వైభవం
మార్చి 1 నుండి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు
ఏ రోజు ఏ ఉత్సవమంటే..?
మార్చి 1న అంకురార్పణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 2వ తేదీన కళ్యాణోత్సవం, 3న హంసవాహనం, 4వ తేదీ సింహ వాహనం, 5వ తేదీ హనుమంత వాహనం, 6వ తేదీ బ్రహ్మ గరుడసేవ, 7వ తేదీ శేషవాహనం, 8వ తేదీన పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ ఉత్సవాలు, 9వ తేదీన మోహినీ ఉత్సవం, 10వ తేదీన ప్రజా గరుడ సేవ, 11వ తేదీ గజవాహనం, 12న బ్రహ్మ రథోత్సవం, 13వ తేదీన అశ్వ వాహనం, 14వ తేదీన తీర్థవాది(శ్రీవారి చక్రస్నానం), 15వ తేదీన పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి.
- చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి
అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు నిత్య పూజలతో వెలుగొందుతున్నాడు. ఆలయానికి పడమటి వైపున నదీతీరం ఉంది. అక్కడ భృగుమహర్షి తపస్సు చేసి శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారని, ఆ మహర్షి కోరిక మేరకే స్వామివారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని పురాణ వచనం. వీటిని శ్రీవారు వసంత రుతువులో అనుగ్ర హించడం వల్ల ఉత్సవ మూర్తులకు వసంత వల్లభుడని పేరొచ్చింది. వసంత వల్లభుడైన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి యేటా పక్షం రోజుల పాటు ప్రతిరోజు వివిధ అవతారాల్లో తమ భక్తులకు కనువిందు చేస్తారు. వాటినే బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మార్చి 1న అంకురార్పణంతో ప్రారంభమై 15న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి.
ఖాద్రీ క్షేత్రం ప్రత్యేకత: లోక కంటకుడైన హిరణ్యకశిపుడి సంహారానికి శ్రీవారు మహోగ్రరూపంలో స్తంభంనుంచి ఆవిర్భవించారు. సగం మనిషి, సగం సింహరూపం దాల్చిన స్వామివారు తన భక్తుడు ప్రహ్లాదుని స్తోత్రంతో శాంతించి ఖాద్రీ క్షేత్రంలో కొలువుదీరారు. స్వామిపాదం కొండపై మోపడంతో ఖాద్రి అని పిలిచారు. కాలక్రమేణా దీన్ని కదిరిగా పిలుస్తున్నారు. కదిరి నృసింహుని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కల్గిన ఈ దివ్య క్షేత్రం ప్రత్యేకతలను సంతరించుకుంది.
స్వామివారి స్వేద బిందువులు చూడచ్చు!: ఇక్కడ స్వామివారి మూలవిరాట్‌కు ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం స్వామివారి మూలవిరాట్ నుండి స్వేదబిందువులు ఉద్భవిస్తాయి. దీన్ని భక్తులు మహిమాన్వితంగా భావిస్తారు. ఇంకో విశేషమేమంటే ఈ ఆలయంలో స్వామివారు శ్రీలక్ష్మీ సమేతంగా శాంత మూర్తిగా దర్శనమిస్తారు.
ఆలయ చరిత్ర: కదిరి-అనంతపురం రహదారిలోని 16 కిలోమీటర్ల దూరంలోవున్న పాతిరేపల్లి(నేటి పట్నం) రంగనాయకుడికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కన్పించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆయన ఆ విగ్రహాన్ని వెలికితీసి, ప్రతిష్టించి గర్భగుడిని కట్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత క్రీ.శ 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో పూర్తిస్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు.
అతి పెద్ద తేరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనారసింహుడు మార్చి 12న బ్రహ్మ రథోత్సవం సందర్భంగా బ్రహ్మరథంపై దర్శనమిస్తారు. ఆ రోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తారు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం.
కదిరికి ఇలా చేరుకోవచ్చు: ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవాలంటే అనంతపురం ఆర్‌టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10ని,,కు ఓ బస్సు ఉంది. అక్కడి నుండి 90 కి.మీ ఉంది. పుట్టపర్తి నుండి రావాలంటే కేవలం 40 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదా నల్లమాడ మీదుగా చేరుకోవచ్చు. తిరుపతి నుండి వచ్చే భక్తులు మదనపల్లి లేదా రాయచోటి మీదుగా రావచ్చు. పులివెందుల నుండి రావాలనుకుంటే నామాలగుండు మార్గంలో బీ కొత్తపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఈ బ్రహ్మోత్సవ వేడుకలలో రథోత్సవం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారే మిరియాలతో తలకు పట్టు వేసుకుంటారని నానుడి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఇలవేల్పు శ్రీ ఖాద్రి నరసింహస్వామి వారేనని స్థలపురాణం చెబుతోంది.
నా పూర్వజన్మ సుకృతం
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నారసింహుని సేవలో ఉన్నాను. నేనే కాదు.. మా కుటుంబమంతా స్వామి సేవకు అంకితమైపోయాం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి రాలేని భక్తుల కోసం స్వామివారే భక్తుల చెంతకు వెళ్తారు. స్వామికి సేవలందించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
- ఏవీ నరసింహాచార్యులు,
ఆలయ ప్రధాన అర్చకులు