శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం | Srivari prepare everything to Brahmotsavam | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Published Tue, Sep 23 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

2.2 లక్షల మంది వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లు
సుప్రభాతం మినహా అన్ని ఆర్జిత సేవలు...గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు
 

తిరుమల: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 2.20 లక్షల మంది భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో కూర్చుని ఉత్సవమూర్తులను దర్శించేలా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మించారు. ప్రత్యేకించి తూర్పుమాడ వీధిలోని గ్యాలరీల్లో బల్లలు ఏర్పాటు చే శారు. వాహనమండపం కుడివైపున భక్తుల మధ్య తోపులాటకు అవకాశం లేకుండా ఈసారి ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టారు. గరుడ సేవకు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకు.. దాదాపు ఐదు గంటలపాటు గరుడ వాహనసేవ  ఊరేగింపు జరగనుంది. వాహన సేవల్లో హారతులు ఇచ్చేందుకు వచ్చే భక్తులు నిర్ణయించిన సంఖ్యలో మాత్రమే ఆయా కూడళ్లలో ఉండేలా క్యూలు నిర్మించారు.
 
ఆర్జిత సేవలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు


బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రభాతం మినహా మిగిలిన ఆర్జిత సేవలను రద్దు చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌లోని గదులను కూడా రద్దు చేశారు. దాతలు స్వయంగా వస్తేనే వారికి మాత్రమే గదులు కేటాయించనున్నారు. సిఫారసులు అంగీకరించరు. అయితే ఇంటర్నెట్ ఆన్‌లైన్ ద్వారా కేటాయించిన రూ.300 టికెట్ల భక్తులను మాత్రం యథావిధిగా కొనసాగించనున్నారు. అదే సందర్భంలో తిరుమలలో తాత్కాలికంగా కరెంట్ బుకింగ్ కూడా రద్దు చేసి, ఉత్సవాల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

సిఫారసు లేఖలు ఇవ్వొద్దు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆమేరకు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఎలాంటి సిఫారసు లేఖలు ఇవ్వొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఒక వేళ ఇచ్చినా వాటిని స్వీకరించే పరిస్థితులు లేవని ఇక్కడి అధికారులు తెలిపారు. గదుల కేటాయింపు విషయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement