చెన్నయ్: చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో కారు ఛేజింగ్ ఘటనలో మరో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితుల్లో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. చంద్రు అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు అనంతరం సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీలను పరిశీలించి ఫిబ్రవరి 1న చంద్రును అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్తికేయన్ (పల్లికరనై) తెలిపారు.
మరో ఇద్దరు నిందితులను కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. శనివారం అరెస్టైన చంద్రుపై ఇప్పటికే కిడ్నాప్ సహా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేరం సమయంలో ఉపయోగించిన రెండు ఎస్‌యూవీలను ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కారులో ఉన్న కొందరు మహిళలను డీఎంకే జెండా ఉన్న ఎస్‌యూవీలో వచ్చిన వ్యక్తులు వెంబడించి బెదిరిస్తున్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.
ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో 2025 జనవరి 25 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు ఆధారంగా తొలుత సీఎస్‌ఆర్ (కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్) నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం బీఎన్‌ఎస్, తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌గా మార్చారు. అయితే ఘటన పట్ల ప్రభుత్వ తీరుపై అన్నాడీఎంకే, బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే రాజకీయ సంబంధాలను పోలీసులు తోసిపుచ్చారు. టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడానికి నిందితులు పార్టీ జెండాను ఉపయోగించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment