‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్‌ సీరియస్‌ | District Collector of Mancharyala visited the school | Sakshi
Sakshi News home page

‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్‌ సీరియస్‌

Published Fri, Jul 26 2024 4:42 AM | Last Updated on Fri, Jul 26 2024 4:42 AM

District Collector of Mancharyala visited the school

కుశ్నపల్లి హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు 

విద్యార్థులకు ఇబ్బంది కలిగించొద్దని టీచర్లకు ఆదేశం  

పాఠశాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ 

నెన్నెల: తరగతి గదులు కురుస్తుండటంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠాలు విన్న ఘటనపై మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సీరియస్‌ అయ్యారు. నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఠాకూర్‌ ఇందన్‌సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 

మరో మూడు గదులున్నా వాటిని ఉపయోగించుకోకుండా కురుస్తున్న గదిలోనే పిల్లలను గొడుగులు పట్టుకుని కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంలో హెచ్‌ఎం ప్రమేయం ఉందని భావించి చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.  

ఆ గదిలో ఎందుకు కూర్చోబెట్టారు? 
గదులు కురుస్తున్నాయని తెలిసినా విద్యార్థులను అదే గదిలో ఎందుకు కూర్చోబెడుతున్నారని ఉపాధ్యాయులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రశ్నించారు. వర్షాలు తగ్గే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పొడిగా ఉన్న ఇతర గదుల్లో కూర్చోబెట్టాలని ఆదేశించారు. 

పాఠశాల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యను ఎందుకు పెద్దగా చేస్తున్నారని టీచర్లను మందలించారు. స్టాఫ్‌రూమ్, ల్యాబ్‌ రూమ్‌లతోపాటు డైనింగ్‌ హాల్‌లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. 

వార్డెన్‌ లచ్చన్న విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఐటీడీఏ పీఓకు చెప్పి షోకాజ్‌ నోటీసు ఇప్పిస్తానన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈఓ యాదయ్య పాఠశాలకు చేరుకుని సమస్యలు 
తెలుసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement