మన్ కీ బాత్
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....
‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.
పాలక్కాడ్‌లో గిరిజనులు
పాలక్కాడ్‌లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.
రంగుల తూనీగ
పాలక్కాడ్‌లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.
సీజన్‌లో 17 వేల గొడుగులు
70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్‌సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్‌లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.
గొడుగుల దానం
చలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్‌లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment