
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) వయనాడ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. అనంతరం, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు.
కాగా, కేరళలోని వయనాడ్‌లో సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీ రేపు ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు. వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే, మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం, బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వయనాడ్‌లో జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. కాగా, బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ జరిగిన పరిణామం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు.
ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికిపైగా ప్రజలు మృతిచెందగా.. మరో 200 మంది ఆచూకీ లభించలేదు. ఇక, గురువారంతో వయనాడ్‌లో సహాయక చర్యలు ముగిశాయి. భారత సైన్యం కూడా వయనాడ్ నుంచి వెళ్లిపోయింది. మరోవైపు.. వయనాడ్ విపత్తను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మోదీ.. వయనాడ్‌కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? లేదా? అనే అంశంపై చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment