మా సూపర్ హీరో ఎక్కడ? గ్రామస్తులు కన్నీరుమున్నీరు
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. సర్వం కోల్పోయిన అభాగ్య జనం బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంతోమంది బాధితులను రక్షించిన యువకుడు మరిన్ని ప్రయత్నాల్లో ఉండగానే కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. దీంతో మా సూపర్ హీరో, మా రక్షకుడు, మా దేవుడు ఏమయ్యాడు అంటూ స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడటంతో స్థానిక కుర్రాడు ప్రజీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. తనజీపులో రెండుసార్లు ప్రమాదకరమైన కొండ మార్గం గుండా వెళ్లి కొంతమందిని ప్రాణాలతో కాపాడాడు. ఈ క్రమంలోనే మూడో సారి వెళ్లి కనిపించకుండా పోయాడు. మరోవైపు చూరల్‌మల వద్ద పాడైపోయిన అతని జీప్ కనిపించింది. దీంతో మరింత ఆందోళన రేపింది. వరద నీరు , బురద , దొర్లి పడిన భారీ బండరాళ్ల మధ్య ఎక్కడ చిక్కుకుపోయాడో అని బాధపడుతున్నారు. పలుమార్లు తమ కష్టనష్టాల్లో తోడుగా నిలిచి "సూపర్ హీరో"గా పేరుతెచ్చుకున్న తమ ప్రజీష్ క్షేమంగా తిరిగి రావాలంటూ బరువెక్కిన హృదయంతో, కన్నీటితో ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు.
కొండపైకి వెళ్లవద్దని ఎంత హెచ్చరించినా, అక్కడ ఎంతోమంది చిక్కుకుపోయారు, వాళ్లని రక్షించాలన్న ప్రయత్నాల్లో అవన్నీ పట్టించుకోలేదని ప్రజీష్ స్నేహితులు తెలిపారు. ముండక్కై కుగ్రామంలో కొండ చరియలు విరిగిపడటం గురించి విన్న తర్వాత, ప్రజీష్ రెండుసార్లు కొండపైకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చాలా మందిని రక్షించాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లబోతుండగా మరో ఫోన్ కాల్ రావడంతో మళ్లీ కొండపైకి వెళ్లాడు. ఈసారి మాత్రం తిరిగి రాలేదని వాపోతున్నారు.
పెళ్లి, చావైనా మొదటి నుంచి చివరి వరకూ అండగా ఉండేవాడని, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడు, తలలో నాలుకలో ఉండేవాడు, అందరికీ ఇష్టమైన వ్యక్ అంటూ తి మరో గ్రామస్థుడు గుర్తు చేసుకున్నారు. "ప్రజీష్ మా భూమికి సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతడే కనిపించడం లేదు" అని ఒక గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఏ క్షణానఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని వణికిపో తున్నారు.
ఇదీ చదవండి : వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
Comments
Please login to add a commentAdd a comment