Mannki baat
-
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్‌లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
నేడు నాకూ ‘పరీక్ష’!
బడ్జెట్ నేపథ్యంలో ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వ్యాఖ్య ♦ ఇందుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని వెల్లడి ♦ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం ♦ సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని సూచన న్యూఢిల్లీ: వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన ‘బడ్జెట్ పరీక్ష’ను ఉదహరించారు. ‘నాకూ రేపు పరీక్ష ఉంది. 125 కోట్ల మంది ప్రజలు నాకు పరీక్ష పెట్టనున్నారు. పరీక్షకు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా’ అని పార్లమెంటులో సోమవారం తన ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌ను ప్రస్తావించారు. ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో బోర్డు పరీక్షల అంశంపై మోదీ ప్రసంగించారు. విద్యార్థులంతా సానుకూల దృక్పథంతోపాటు మనసులో ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయాలన్నారు. అలాగే విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు. ‘‘నేను ఎంత ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నానో మీరు (విద్యార్థులు) చూసే ఉంటారు. రేపు నా పరీక్షలు జరిగితే ఆ తర్వాత మీ పరీక్షలు జరుగుతాయి. మనమంతా పరీక్షల్లో విజయం సాధిస్తే దేశం కూడా విజయం సాధిస్తుంది. జయాపజయాల ఒత్తిడితో నిమిత్తం లేకుండా స్వచ్ఛమైన మనసుతో ముందుకెళ్లండి’’ అని మోదీ తన 35 నిమిషాల ప్రసంగంలో విద్యార్థులకు సూచించారు. కొన్నిసార్లు తాను కూడా ఒత్తిడికి లోనవుతుంటానని...అలాంటప్పుడు తాను మూడు నుంచి ఐదుసార్లు దీర్ఘ శ్వాస తీసుకొని ప్రశాంత మనసుతో పరిస్థితికి తగ్గట్లుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతుంటానన్నారు. సానుకూల దృక్పథంతో ఉంటే అపజయంలోనూ విజయం ఉంటుందని చెప్పారు. విజయం సాధించేందుకు విద్యార్థులంతా చిత్తశుద్ధి, పట్టుదల, అంకితభావాన్ని కనబరచాలన్నారు. విద్యుత్‌ను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రౌలింగ్‌లు ఎన్నో అపజయాల తర్వాతే విజయం సాధించారని మోదీ గుర్తు చేశారు. క్రికెట్, చెస్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్ఆర్ రావు, ఆధ్యాత్మిక గురువు మురారీ బాపులు వారి రంగాల్లో ఒత్తిళ్లకు దూరంగా పరీక్షలను ఎలా ఎదుర్కొన్నారో చెప్పేందుకు వారి జీవితాలే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రముఖుల సందేశాలను శ్రోతలకు వినిపించారు. మార్చి 30 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని మోదీ మార్చి 30 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. బెల్జియంలో మార్చి 30న (భారత్-ఈయూ సదస్సు కోసం), అమెరికాలో (అణ్వస్త్ర భద్రత సదస్సుకు హాజరయ్యేందుకు) మార్చి 31న, సౌదీ అరేబియా (ఆ తర్వాత ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు)లో ఏప్రిల్ 1, 2 తేదీల్లో పర్యటించనున్నారు. కాగా.. ప్రతి వారం 200 గ్రామాలను విద్యుదీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యుత్ శాఖను ఆదేశించారు. రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టండి రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు బరేలీ(యూపీ): రైతు సంక్షేమంకోసం అవసరమైన పథకాలను ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. రైతుల సవాళ్లను వారికి అనువైన అవకాశాలుగా మలచాన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని కోరారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తన కల అని అన్నారు. ఆదివారం బరేలీలో జరిగిన రైతు ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకం అన్నదాతలకు రక్షణ కవచంలాంటిదని అభివర్ణించారు. రైతులకోసం తమ ప్రభుత్వం చేపట్టిన ఇతర సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. వ్యవసాయ ఉత్పతులను మార్కెట్ చేసుకోవడానికోసం ఏప్రిల్‌లో ఈ-ప్లాట్‌ఫామ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని మోదీ వివరించారు. రైతులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సహకరిస్తే వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, అవకాశాలుగా మారుస్తామన్నారు. కొన్ని రాష్ట్రాలు రైతుల సంక్షేమంకోసం కొంతవరకు కృషిచేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు రైతుల విషయంలో ‘ఏదో నడిపిద్దాం’ అనే ధోరణితో ఉన్నాయని, ఎన్నికల సమయంలో చూసుకోవచ్చనే ధోరణితో సాగుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి చోట రైతుల పరిస్థితి దేవుడే దిక్కనేలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దృష్ట్యా వ్యవసాయం, రైతు సంక్షేమంకోసం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్ని రాష్ట్రాలను కోరుతున్నానని అన్నారు.