సాక్షి, ఢిల్లీ: పలు కొత్త పథకాలతో పాటు కీలక నిర్ణయాలకు ఇవాళ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.
‘‘పీఎం ఈ - బస్ సేవ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 169 నగరాల్లో 10వేల ఈ - బస్ లు ప్రవేశ పెట్టనుంది కేంద్రం. అలాగే.. 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. ఇక పీఎం విశ్వ కర్మ నూతన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. చేతివృత్తుల వారికి రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం 32,500 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న కేంద్రం వీటిలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు - బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది.
మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో.. విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment