Kuchipudi dancer
-
Swapna Sundari: నాట్యభూషణం
‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శనకారిణి. యంగ్ కల్చరల్ అంబాసిడర్‌గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త... నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి. ‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట. గీతాదత్ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. బీఏ ఆగిపోయింది! నేను స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్లోనే లండన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ హాల్లో ప్రదర్శన ఇచ్చాను. ప్రైవేట్‌గా బీఏలో చేరాను, కానీ సెకండియర్‌లో మూడు నెలల యూరప్ టూర్‌తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్డీ స్కాలర్స్‌కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్‌తో ఆల్బమ్ చేశాను, తమిళ్ గజల్స్ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి. నాట్యజ్ఞానకేంద్రం దిల్లీలో స్థాపించిన డాన్స్ సెంటర్ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను. కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్‌తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం. కళల కలయిక ‘కూచిపూడి’ భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్’లో రాశాను. తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం. – వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
డాక్టర్ పద్మజారెడ్డి.. సామాజికాంశాలే నా నృత్య కళ
‘‘ఈ అవార్డు నాకు శివుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. నా కృషిని గుర్తించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా గురువు శోభానాయుడు, మా అమ్మనాన్నల ఆశీస్సులతో ఈ అవార్డు నన్ను వరించిందనుకుంటున్నాను. రానున్న రోజుల్లో నృత్యకళలో మరింతగా కృషి చేయడానికి ఈ అవార్డు నాకు ఊపిరి పోసిందనుకోవాలి. ఐదు దశాబ్దాలుగా నృత్యమే ప్రాణంగా జీవిస్తున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కంటున్న నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ అవార్డును మా గురువైన శోభా నాయుడు గారికి అంకితం చేస్తున్నాను’’ అన్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. మంగళవారం ఆమెకు కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. ‘నేనేం చెప్పాలనుకున్నా నా నృత్యకళ ద్వారానే ప్రదర్శించగలను. సామాజిక సమస్యల పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి శాస్త్రీయ నృత్యం ఎంత ప్రభావ వంతమైన సందేశాన్ని ఇవ్వగలదో నా ప్రదర్శన ద్వారా చూపడమే లక్ష్యం. నా నృత్య కృషి గురించి రాసి, ప్రజలలో మరింత గుర్తింపు తెచ్చిన ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు పద్మజారెడ్డి. కాకతీయం తెచ్చిన గుర్తింపు ‘తెలంగాణకు ప్రత్యేకమైన నాట్యకళ ‘కాకతీయం’ను నృత్య దృశ్యకావ్యంగా ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించాను. ఇందుకు నృత్యంలోనే కాకుండా కాకతీయుల నాటి వస్త్రధారణకు తగినట్టుగా డ్రెస్సులు, ఆభరణాల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ తరువాయి భాగం కాకతీయం–2 పేరుతో కిందటి నెలలో ప్రదర్శన ఇచ్చాను. వంద మంది మా అకాడమీ విద్యార్థులతో చేసిన ఈ ప్రదర్శన ఎంతోమందిని ఆకట్టుకుంది. తెలంగాణకు ఓ నృత్యరీతి ఉందని తెలియపరచడానికే నేను కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం ప్రధానంగా గుర్తించందనుకుంటున్నాను. అవగాహనే ప్రధానం కళలు ఉన్నవే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు కళ్లకు కట్టేలా నృత్యకళ ద్వారా చూపడమే నా ధ్యేయం. నా కళ ద్వారా జనాన్ని జాగృతం చేయడం శివాజ్ఞగా భావిస్తాను. సామాజికాంశాలలో బాలికల గురించిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిదిమేసే దారుణ కృత్యాలను నృత్యం ద్వారా చూపగలిగాను. అలాగే, ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలను చూపాను. కుటుంబ ప్రోత్సాహం మా వారు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి నా ఈ కృషిని వెన్నుదన్నుగా నిలిచి అందించిన ప్రోత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. అటు పుట్టిల్లు, ఇటు అత్తింటివైపు వారిలో ఎవరూ నృత్య కళలో లేరు. చిన్ననాటి నుంచి ఇష్టంతో నేర్చుకున్న కళ పెళ్లి తర్వాతా కొనసాగించాను. మా కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఇందులో భాగం కావాలని అడిగారు. కానీ, నా ధ్యాస, శ్వాస నృత్యమే అని తెలిసి కుటుంబం నాకు అన్ని విధాలా మద్దతునిచ్చింది’’ అంటూ ఇన్నేళ్ల తన కృషిని వివరించారు పద్మజారెడ్డి. గత నెల 26న ‘కాకతీయం–2 ప్రదర్శన’ సందర్భంగా ‘సాక్షి’ ఫ్యామిలీలో ప్రచురించిన కథనం... – నిర్మలారెడ్డి -
కాకతీయం.. చారిత్రక నృత్య సౌరభం
ప్రజల్లో చైతన్యం నింపేలా కూచిపూడి నృత్యకళకు ఆధునికతను జోడించారామె. కాలం పరిచయం చేస్తున్న నృత్యరీతులను కళ్లకు అద్దుకున్నారు. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని మన ముందుకు అంచెలంచెలుగా తీసుకువస్తున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి. కాకతీయుల కాలంలో తెలుగు నేలను అసమాన ధైర్య సాహసాలతో, అత్యంత సమర్థ వంతంగా పరిపాలించిన రాణి రుద్రమదేవి మేనమామ జాయపసేనాని. ఆయన రచించిన ‘నృత్యరత్నావళి’ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ‘కాకతీయం’ అనే నృత్య దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించారు పద్మజారెడ్డి. ఆ తరువాయి భాగం నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కాకతీయం–2 పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నృత్య అకాడమీకి వెళ్లినప్పుడు శిష్యబృందంతో సాధన చేస్తూ కనిపించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘శాస్త్రీయ నృత్యరీతులు అనగానే మనకు కూచిపూడి, భరతనాట్యం వంటివి కళ్లముందు నిలుస్తాయి. కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అదే కాకతీయం. కాకతీయుల నృత్యకళ అనగానే మనకు సాధారణంగా పేరిణి నృత్యం గుర్తుకు వస్తుంది. కానీ, జాయపసేనాని రచించిన ‘నృత్యరత్నావళి’లోని నృత్యరీతులను చూస్తే వాటిని పరిచయం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. సముద్రమంతటి ఆ కళను నేను ఏ కొద్దిగానైనా పరిచయం చేయగలిగితే అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏడేళ్ల కృషి కూచిపూడి నృత్యకారిణిగా ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. సత్కారాలు పొందాను. ఒకానొక సందర్భం లో రచయిత పప్పు వేణుగోపాలరావు ఆంగ్లంలోకి అనువదించిన ‘నృత్యరత్నావళి’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇంత మంచి కళారీతిని పరిచయం చేయకుండా ఉండగలమా?! అంతటి సమర్థత నాలో ఉందా?! అనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. విజయదుంధుభి వేళ ఆనందహేల, శృంగార, క్రోధ, కరుణ.. ఇలా నవరసాల కాకతీయ సౌరభాలు ఈ నృత్యరీతుల్లో కనిపిస్తాయి. ఇదొక సవాల్. నేను గతంలో చేసిన నృత్యరీతులన్నీ సవాల్‌గా తీసుకుని చేసినవే. ఈ కళారూపాన్ని కూడా నేటి ప్రజలకు పరిచేయాల్సిందే అనుకున్నాను. దీంట్లో భాగంగా వరంగల్లోతో పాటు ఎన్నో గ్రంథాలయాలు, కాకతీయుల గుడులన్నీ సందర్శించాను. గైడ్స్‌తో మాట్లాడాను. పరిశోధకులను కలిశాను. ఏడేళ్లుగా ‘కాకతీయం’ తప్ప నా మనసులో మరో ఆలోచన లేదు. అంతగా ఈ కళలో మమేకం అయిపోయాను. ఆన్‌లైన్‌లోనూ సాధన పదిహేనేళ్లుగా ప్రణవ్ నృత్య అకాడమీ ద్వారా దాదాపు 700 మంది శిష్యులు నృత్యంలో ప్రావీణ్యం సాధించారు. నా దగ్గరకు వచ్చే శిష్యుల్లో ఆరేళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వారి వరకు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన కాకతీయం పార్ట్ 1 కి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండవభాగాన్ని తీసుకువద్దామని రెండేళ్ల క్రితమే సాధనకు శ్రీకారం చుట్టాను. అయితే, కరోనా కారణంగా నృత్యక్లాసులు ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చురుకుదనం, ఆసక్తితో నేర్చుకున్నారు కాబట్టి ఈ నృత్యరీతుల్లో నిష్ణాతులు అయ్యారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అకాడమీలోనే శిక్షణ జరుగుతోంది. సామాజిక సమస్యలపై అవగాహన శాస్త్రీయ నృత్యం అనగానే పురాణేతిహాస ఘట్టాలే ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ, ఈ నృత్యం ద్వారా సమాజ సమస్యలను అద్దంలా చూపుతూ, వాటికి పరిష్కారం కూడా సూచించే కళారీతులను ప్రదర్శించాను. వాటిలో భ్రూణహత్యలు, ఎయిడ్స్ పై అవగాహన, నమస్తే ఇండియా, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్‌తో పాటు పురాణేతిహాసాలను నృత్యరూపకాల్లో ప్రదర్శించాను. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్రయోగి, భరతనాట్యం అనగానే భరతముని పేరు గుర్తుకు వస్తాయి. అలాగే, కాకతీయం అనగానే జాయప పేరు గుర్తు రావాలన్నదే నా తపన’’ అంటూ శిష్యులవైపు కదిలారు ఈ నృత్యకారిణి. వందమంది శిష్య బృందంతో నృత్యరత్నావళిలోని పిండి, గొండలి, రాసకం, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, చాలన.. నృత్యరీతులను కాయతీయంలో ప్రదర్శిస్తున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కళాహృదయానికి ఈ సందర్భంగా అభివాదం చెబుదాం. నృత్యరూపకంలో... – నిర్మలారెడ్డి -
అలరించిన నాట్యతోరణం
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) సెంటర్లో శనివారం అమ్రిత కల్చరల్ అధ్వర్యంలో దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నాట్య తోరణం పేరిట పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ , విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, విశ్రాంత ఐఎఎస్ అధికారి, డాక్టర్ ఎస్ చెల్లప్ప, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కూచిపూడి, భరతనాట్య , విశారదుడు పసుమర్తి రామలింగశాస్త్రి, ఒడిస్సీ నాట్య విదుషీమణి నయనతార నందకుమార్, సీసీఆర్టీ ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. మురమళ్ల సురేంద్రనాథ్చే కూచిపూడి నృత్య ప్రదర్శన, నిదగ కరునాథ్చే కథక్, అభయాకారం కృష్ణన్ భరతనాట్య ప్రదర్శన, బిజినచే మోహినియట్టం తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందదని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
తండ్రి అడుగుల్లో తనయి.. మొదటి గురువు ఆయనే.. ఆరేళ్లకే
సాక్షి, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆ చిన్నారికి పట్టుమని 11 ఏళ్లు. అయినా కూచిపూడి నాట్యకళాకారిణిగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో ప్రదర్శనలు. గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. చిన్నారి నృత్య, అభినయానికి పలువరి ప్రసంశలు కూడా అందుకుంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి విజయ హరిణి. తండ్రి అడుగుల్లో అడుగులువేసి.... మద్దులూరి సురేష్, అలేఖ్య దంపతులు నెల్లూరు రామలింగాపురం వాసులు. సురేష్ వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రాణించి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి డ్యాన్సును చిన్నప్పటి నుంచి చూసిన హరిణికి డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి తానే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని తనయికి నేర్పాడు. తొలి గురువుగా తాను చేసి ప్రయత్నం ఫలించింది. అతి తక్కువ సమయంలోనే హరిణి నృత్యకళాకారిణిగా ఎదిగింది. తండ్రి తనయుల నృత్య ప్రదర్శన, గిన్నీస్ బుక్‌లో స్థానం నవరసాలను అభినయిస్తూ, కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై నృత్య రూపకాలతో తన ప్రతిభను చాటింది. పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ఎదిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందోనని ఈ తండ్రి కూతుళ్లు తమ నృత్యంతోనే జవాబిచ్చారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని నృత్యం మరింత పెనవేసింది. దీంతో విజయ హరిణి కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తుంది. విజయానికి తొలి అడుగు ఇంటి నుండే ప్రారంభమై దేశవ్యాప్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఆ చిన్నారి ఆకాంక్ష. కాళికామాత అభినయంలో హరిణి హరిణి నృత్య ప్రస్థానం ఇలా... – 2016లో ఆరేళ్ల వయసులో నెల్లూరు టౌన్ హాలులో మొదటి ప్రదర్శనతో నృత్య కిషోర్ అవార్డును అందుకుంది. – 2018లో తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. – 2018లో లేపాక్షిలో జరిగిన ఉత్సవాల్లో తెలుగు బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. – 2019లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో నృత్య తరంగిణి అవార్డును మాజీ గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అందుకుంది. – 2019లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. – 2020లో చెన్నైలో త్యాగయ్య టీవీ ఆధ్వర్యంలో లార్జెస్ట్ కూచిపూడి లెవెన్‌లో తన తండ్రి సురేష్‌తో పాటు పాల్గొని గిన్నీస్బుక్ఆఫ్వరల్డ్ రికార్డులో స్థానం సాధించింది. – ప్రతి ఏడాది షిర్డీలో బాబా ఉత్సవాల్లో బాబా సమాధి వద్ద క్రమం తప్పని నృత్య ప్రదర్శన. హరిణి నృత్య ప్రదర్శన -
Himansee Katragadda: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!
గణపురం కోటగుళ్లు .. గండికోట మాధవరాయ ఓరుగళ్లు రామప్ప.. జాకారం శివయ్య ఏ ఊళ్లో చూసినా ‘కొలువై ఉన్నాడే దేవ దేవుడు... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..’ అంటూ ఆనందపరవశంతో తమ నాట్య ప్రయాణాన్ని వివరిస్తుంది హిమాన్సీ కాట్రగడ్డ. నెమలికి నేర్పిన నడకలివీ .. అంటూ తన పాదాల మువ్వలతో అలరిస్తుంది. తెలంగాణలోని వరంగల్లు వాసి అయిన హిమాన్సీ కూచిపూడి నృత్యకారిణి. తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ, వాటిని వీడియోలుగా రూపుకట్టి ‘టెంపుల్ డ్యాన్స్’ పేరిట అలనాటి వైభవాన్ని మన కళ్లకు కడుతోంది. ఆలయ ప్రాంగణంలో నృత్యాన్ని దృశ్యీకరిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, దేశ వ్యాప్త నృత్య ప్రదర్శనలతో పాటు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోంది హిమాన్సీ. తెలుగులో ఇటీవల సూర్యాస్తమయం, కోలీవుడ్‌లో నవిలా కిన్నరి సినిమాలలో నటించి, నటిగా విమర్శకుల మెప్పు పొందింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కూచిపూడి నృత్యసాధన చేస్తూ దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న హిమాన్సీ ప్రస్తుతం బి.టెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. టెంపుల్ డ్యాన్స్ ఆలోచనను, అందుకు తన కృషిని ఇలా వివరించింది. ‘‘నేను చేసిన ‘టెంపుల్ డ్యాన్స్’ వీడియోలకు కళాతపస్వి విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సప్తపది సినిమా నటీమణి సబిత తమ ప్రశంసలు అందించారు. మా దేవాలయ నృత్యాలను ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలను ఒక్కొక్కటిగా చేరుకోవడం, వాటిని మా నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకురావడం మేం చేయాలనుకున్న పని. నాకు మద్దతుగా మా గురువు సుధీర్ గారు నిలవడంతో నా ఆలోచనను అమలులో పెట్టడం మరింత సులువు అయ్యింది. కట్టిపడేసే మార్మికత చిన్ననాటి నుంచి చారిత్రక రహస్యాల పట్ల అమితమైన ఆసక్తి. వాటి శోధనల్లో ఉన్నానంటే నన్ను నేను మర్చిపోతాను. వరంగల్‌లో కాకతీయ రాజులు కట్టించిన ఎన్నో గుళ్లు, వాటి వైభవం చూస్తూ పెరిగాను. ఆ శిల్పకళలో ఏదో తెలియని మార్మికత కట్టిపడేస్తుంటుంది. ఎక్కడ ఆలయాన్ని సందర్శించినా నా నాట్యకళతో ముడిపెట్టినట్టుగా అనిపించేది. ప్రతీ ఆలయంలో నాట్య మండపాలు ఉన్నాయంటే, నాడు కళలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో దీనిని బట్టే తెలిసిపోతుంది. కళల ద్వారా విద్యను జనాల్లోకి తీసుకువెళ్లేవారు. వీటన్నింటినీ తెలుసుకుంటూ ఏ ఆలయానికి వెళ్లినా వీడియోలు, ఫొటోలు తీస్తుండేదాన్ని. కళ ఎప్పటికీ సజీవం కాకతీయు రాజుల చరిత్ర చదివినప్పుడు, ఆలయ నిర్మాణాల పట్ల వారికున్న దూరదృష్టి నన్ను అమితంగా ఆకర్షించింది. అదే, నన్ను అనేక ఆలయాలను దర్శించేలా చేసింది. మనకు తెలిసినంతవరకు హంపి, ఖజరహో ఆలయాల గురించి, వాటి శిల్ప కళ గురించి గొప్పగా ప్రస్తావిస్తుంటాం. కానీ, ఒక్క తెలంగాణలోనే వెయ్యికి పైగా శివాలయాలున్నాయని, అంతకుమించి శిల్పకళ ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ ఆలయాలు నేడు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకున్నాను. కొన్నింటిని ప్రభుత్వం గుర్తించి, వాటిని బాగు చేసే ప్రయత్నం చేస్తోంది. రేపటి తరాలకు నాటి కళను అందించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమంతో వెలుగులోకి.. ప్రాచీన ఆలయాల గురించి శోధిస్తున్నప్పుడు పుస్తకాల్లో చదివి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాను. అవేవీ దృశ్యరూపంలో లేవని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని మా గురువుగారితో చర్చించి, ‘టెంపుల్ డ్యాన్స్’ పేరుతో వీడియోలు తీస్తూ, మా నాట్యకళాకారులచేత కూడా ప్రదర్శనలు ఇస్తూ, వాటిని సామాజిక మాధ్యమం ద్వారా జనంలోకి తీసుకువస్తున్నాం. ఇటీవల తెలంగాణలోని కోటగుళ్లు, రామప్ప, వారణాసిలో చేసిన నృత్యాలకు మంచి స్పందన వచ్చింది. ఏ ఊళ్లో శిథిలావస్థలో ఉన్న గుడి అయినా, వెలుగులోకి రావాలని, తిరిగి ఆ గుడికి కళాకాంతులు తీసుకురావాలన్నది నా తాపత్రయం. అలా వరంగల్‌లోని అన్ని గుళ్ల వద్ద టెంపుల్ డ్యాన్స్ వీడియోలు చిత్రించాం. మా నాట్య అకాడమీ నుంచి బృందాన్ని తీసుకెళ్లి, తగిన పాటను ఎంపిక చేసుకొని, డ్రెస్సింగ్, వీడియో, ఎడిటింగ్.. అన్ని బాధ్యతలు చూసుకుంటాను. ఇది ఒక తపస్సులాగా చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శ్రీనివాస్‌లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఊరే ముందుకు వచ్చి... తెలంగాణలోని జాకారం ఊళ్లో శివయ్య ఆలయం చూసి ఆశ్చర్యపోయాం. ఆ ఆలయానికి పై కప్పు ఎప్పుడో పడిపోయింది. లోపలంతా చెత్త పేరుకుపోయింది. అద్భుత కళా సంపద గల ఆ ఆలయం గురించి ఆ ఊరి పెద్దలు ఎన్నో విషయాలు వివరించారు. ఆ గుడిని బాగు చేయడానికి గతంలో ఆ ఊరి వారు చందాలు పోగేశారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన మద్ధతు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఆచరణలోకి రాకుండానే ఆగిపోయింది. మేం అక్కడ ప్రస్తుతం ఉన్న సమస్యను రికార్డ్ చేయడంతో పాటు, మా నృత్యరీతులను ప్రదర్శించాం. వాటిని వీడియోగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ గుడిని బాగుచేసే పనులు మళ్లీ మొదలయ్యాయి’’ అని ఆనందంగా వివరించింది హిమాన్సీ. ‘ఆలయంలో ఒక్క దీపమైనా వెలిగించాలని ఎంతోమంది భావిస్తారు. మా నృత్యాల వల్ల ఒక్క ఆలయం బాగు పడినా చాలు’ అంటున్న హిమాన్సీ ఆలోచన జనం గుండెల్లోకి చేరాలని, ప్రాచీన కళావైభవం రేపటి తరాలకు అందాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
పేరు, హోదా.. అమ్మ పెట్టిన భిక్షే
కూచిపూడి నృత్య ప్రపంచంలో నేటితరం మహారాణి ఆమె.. సృజనాత్మక ప్రక్రియల్లో ఆరితేరిన కళాకారిణి. ఆమె నాట్యం ఓ అద్భుతం.. నర్తించే సమయంలో ఆమె పలికించే హావభావాలు అత్యద్భుతం. ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చిన శాస్త్రీయ సంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు ఇకలేరు అనగానే నృత్యం కళావిహీనమైంది. ఆ పాదాల గజ్జెలు మౌనం దాల్చాయి. నృత్య ప్రపంచం కన్నీరుమున్నీరై విలపించింది. సాక్షి, మద్దిలపాలెం/అనకాపల్లి: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభానాయుడు అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశ్వవ్యాప్తంగా తన నాట్యంతో అభిమానులను సంపాదించుకున్న ఆమె అనకాపల్లిలోనే పుట్టారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఆమె తల్లి సరోజనిదేవి, వెంకటనాయుడులకు 1956లో జన్మించారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎదుగుతారని తల్లి చిన్నప్పుడే గుర్తించారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు.. శోభానాయుడు కాళ్లు, చేతుల కదలికలను సరోజనిదేవి గమనించారు. అప్పుడే శోభానాయుడికి నృత్యం నేర్పించాలని భావించారు. ఇందుకోసం ఆమె కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారంట. ఇదే విషయాన్ని శోభానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేరు హోదా అమ్మ పెట్టిన భిక్షే అంటూ వెల్లడించారు. ఆమె మూడో ఏటన ఆ కుటుంబం రాజమండ్రికి వెళ్లిపోయింది. అక్కడ నాల్గో ఏట నుంచే శోభానాయుడికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించేందుకు తల్లి దృష్టి సారించారు. నృత్యంలో ఆమె ఇచ్చిన హావభావాలు, అభినయం చూసి తల్లి.. మరింత బాగా తీర్చిదిద్దాలని చెన్నైలోని చిన వెంపటి సత్యం వద్ద శిక్షణకు పంపించారు. ఆడపిల్లను అంత దూరం పంపించే విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సరోజనిదేవి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమార్తెలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. తల్లి ఇచ్చిన ప్రేరణే శోభానాయుడిని ఈ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా 12 ఏళ్లకే ప్రదర్శనివ్వడం ప్రారంభించిన శోభానాయుడు సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె బహుముఖ ప్రతిభకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న శోభానాయుడు కూచిపూడి కళాప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. విశాఖతో అనుబంధం కళల ఖిల్లాగా భాసిల్లుతున్న విశాఖ నగరంలో ఏ కళా, సాంస్కృతిక ఉత్సవాలు జరిగినా.. ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచేవారు. అగ్రస్థానం ఆమెకే ఇచ్చేవారు. కళాభారతి ఆడిటోరియంలో నగరానికి చెందిన పలు నృత్య కళా అకాడమీలు నిర్వహించే సాంస్కృతిక వేడుకలకు ఆమె హాజరయ్యేవారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వేడుకల్లో భాగంగా శోభానాయుడిని పల్లకీలో తోడ్కొని వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఆమె అనుభవాన్ని రంగరించి ఇదే వేదికపైన నాట్య ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాయినాథ్ నృత్య కళా నిలయం, నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వర్ధమాన నృత్య కళాకారులకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె అభినయాన్ని, అనుభవాలను ఎప్పటికప్పుడు నృత్యకళాకారులకు వినిపించేందుకు ఆయా సంస్థలు చేసిన కృషికి శోభానాయుడు ఎంతో సంబరపడేవారు. కళాభారతి వేదికగా శోభానాయుడు ప్రదర్శించిన ‘సత్యభామా కలాపం’ నృత్యరూపకం అద్వితీయంగా సాగింది. సత్యభామగా శోభానాయుడు ఒదిగిన తీరు.. పలికించిన హావభావాలు, అలకలతో సాగిన ప్రదర్శనతో విశాఖ కళాప్రియుల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరోసారి శోభానాయుడు స్వీయ నృత్య రూపకం ‘నవరస నట భామిని’ ప్రదర్శనలో ఆమె పలికించిన నవరసాలతో.. కళాప్రియులు పులకించిపోయారు. నవరసాల్లో పాత్రలను అవలీలగా ఆమె ఆవిష్కరించిన తీరు ఆహూతులను అబ్బురపరిచింది. మరో ప్రదర్శనలో శివుని భార్య సతీదేవిగా అగ్నికి ఆహుతి అయ్యే సన్నివేశంలో శోభానాయుడు నటన నభూతో న భవిష్యత్‌గా నిలిచిపోయింది. ఆ సన్నివేశంలో సతీదేవి పాత్రలో లీనమై.. చక్కని ప్రదర్శనిచ్చిన ఆమెకు ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులతో నీరాజనం పలికారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 2018లో ఆర్కేబీచ్లో ఏర్పాటు చేసిన శివరాత్రి వేడుకల్లో శోభానాయుడు హాజరయ్యారు. ఆ వేడుకల్లో ఆమె తన నృత్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా ఆమెను కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. మంత్రి ముత్తంశెట్టి సంతాపం మహారాణిపేట(విశాఖ దక్షిణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డ శోభానాయుడు కళామతల్లి ముద్దు బిడ్డ, కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు.. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరయ్యేవారు. కళాసమితి చిన్నారులకు ఆమె అమూల్యమైన సందేశం ఇచ్చి స్ఫూర్తి రగిలించేవారు. అంతరించిపోతున్న కళా నృత్యాలను జీవం పోయడానికి ఆమె పడిన కష్టం, చేసిన కృషి మరువలేనివి. – డాక్టర్ అరుణ్ సాయికుమార్, సాయినాథ్ కళా సమితి వ్యవస్థాపకుడు నాట్యరంగానికి తీరని లోటు అనకాపల్లిలో పుట్టిన శోభానాయుడు మృతి కూచిపూడి నృత్యానికి తీరని లోటు. చినవెంపటి సత్యం వద్ద శిక్షణ తీసుకున్న శోభానాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. కూచిపూడి ఆర్ట్స్ స్కూల్ పేరుతో శోభానాయుడు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించి ఎంతోమందికి శిక్షణ అందించారు. –ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్. కల్యాణి నృత్య సంగీత అకాడమీ, అనకాపల్లి -
ఈ పాదం నటరాజుకే అంకితం
అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. తెలుగువారి నృత్యరీతికి జీవితాన్ని ధారపోసిన ఆమె ప్రయాణం ఇకపై మరోలోకంలో కొనసాగనుంది. శోభానాయుడు అనే అసలు పేరును, కూచిపూడి మహారాణి అనే ముద్దుపేరును కలిగిన ఆ నాట్యశిరోమణి ఒక జీవితకాలంలో పది జీవిత కాలాల కృషిని చేసింది. దేశ విదేశాల్లో రెండువేల మంది విద్యార్థులు ఆమె దారిలో కూచిపూడి నాట్యతారలుగా మెరుస్తున్నారు. ఆమె తయారు చేసిన వందకు పైగా సోలో కొరియోగ్రఫీలు రాబోయే తరాలకు నాట్యగ్రంథంగా మారనున్నాయి. ఆమే సత్యభామ. ఆమే చండాలిక. ఆమే దుర్గ. ఆమే దేవదేవి. ఆమె కోసమే కూచిపూడి రూపుదిద్దుకుంది. కూచిపూడి కోసమే ఆమె జన్మించింది. ఒక నృత్యకారిణి, భారతీయ స్త్రీ సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం... మరెంతో అంకితభావం ఉండాలి. తనకు అవి ఉన్నాయని ఆఖరి శ్వాస వరకూ నిరూపించిన నాట్యవిదుషీమణి శోభానాయుడు. నేడు ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. మువ్వలు మూగపోయాయి. తెలుగు వారి నాట్యం ఈ ధ్రువతారకు సదా రుణపడే ఉంటుంది. శోభానాయుడు జీవితాన్ని తరచి చూస్తే కూచిపూడి కోసం ఆమె ఎంత నిబద్ధతతో పని చేశారో తెలుసుకుని గౌరవం రెట్టింపవుతుంది. ఆమె కూచిపూడి మీద ప్రేమతో ఇతర నాట్యరీతులను కూడా నేర్చుకోలేదు. కోట్లరూపాయలు రాగల సినిమా అవకాశాలను తృణీకరించారు. ఆమె ఆరోప్రాణం మాత్రమే ఆమెది. పంచప్రాణాలూ కూచిపూడే. అనకాపల్లి అమ్మాయి శోభానాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రాజమండ్రిలో పెరిగారు. తండ్రి వెంకట రెడ్డి ఇంజినీరు. తల్లి సరోజమ్మ గృహిణి. తండ్రికి నృత్యాలు, కళలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ పెంచుకున్న కూతురి నైపుణ్యాన్ని గ్రహించి తల్లి సరోజమ్మ ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదనే నమ్మకంతో తొలుత రాజమండ్రిలోని నాట్యాచార్యుడు పి.ఎల్.రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభా నాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా, మెరుగైన శిక్షణ కోసం సరోజమ్మ ఆమెను మద్రాసు తీసుకువచ్చి, వెంపటి చినసత్యం వద్ద చేర్పించారు. కూతురి శిక్షణ కోసం పదకొండేళ్లు ఒక చిన్న ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారు. వెంపటి చినసత్యం వద్ద శోభా నాయుడు గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కుమార్తె శివరంజని తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కూచిపూడి నర్తకిగా రాణిస్తున్నారు. అరండేల్ ఆశీస్సులు... శోభా నాయుడు అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి, భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్ ఎంతగానో ముగ్ధులయ్యారు. ‘అనవసరంగా సినిమాల వ్యామోహంలో చిక్కుకోవద్దు. కూచిపూడి ప్రక్రియకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు’ అంటూ ఆశీర్వదించారు. రుక్మిణీదేవి అరండేల్ సలహాను శోభా నాయుడు అక్షరాలా పాటించి, పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వివిధ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్యరూపకాల్లో కీలక పాత్రలు ధరించి, తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలోనూ ఆమె చిరస్మరణీయమైన కృషి చేశారు. నృత్య రంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో ఊరేగించి.. పల్లకీ మోశారు. సత్యభామ శోభానాయుడు ‘భామా కలాపం’తో చాలా ఖ్యాతి పొందారు. సత్యభామగా సినిమాల్లో జమున అభినయానికి కీర్తిగడిస్తే కూచిపూడిలో శోభానాయుడు ఖ్యాతి గడించారు. ఆమె ప్రదర్శించే శ్రీకృష్ణపారిజాతం రూపకాన్ని తిలకించేందుకు జనం పోటెత్తేవారు. భర్త అయిన కృష్ణుడి మీద దాచుకోవాలనిపించేంత ప్రేమ, తనమీద అతడి ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం దూరంగా నెట్టేస్తూనే దగ్గరకు తీసుకోవాలన్న ఆత్రం... ఇవన్నీ ఆమె సత్యభామ పాత్రలో ఆద్భుతంగా చూపిస్తారు. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘శ్రీకృష్ణ శరణం మమ’, ‘చండాలిక’, ‘మేనక–విశ్వామిత్ర’, ‘విప్రనారాయణ’, ‘విజయోస్తు నారీ’, ‘గిరిజా కళ్యాణం’, ‘స్వామి వివేకానంద’ వంటి దాదాపు పదహారు నృత్యరూపకాలను, నృత్యనాటికలను శోభానాయుడు తన బృందంతో కలసి దేశ విదేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో లెక్కకు మిక్కిలిసార్లు ప్రదర్శించారు. ఎన్నో సోలో ప్రదర్శనలూ ఇచ్చారు. ‘సత్యభామ’ పాత్రలో చేసే అభినయానికి ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నృత్య నాటికలో అన్ని పాత్రలనూ తానే అభినయిస్తూ చేసే ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. బ్లాంక్ చెక్ ఇచ్చినా... ఎన్నో అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చినా శోభా నాయుడు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. పదహారేళ్ల వయసులో ‘అభిమానవంతులు’ (1973) సినిమాలో ‘ఎప్పటివలె కాదురా నా స్వామి... ఎప్పటివలె కాదురా’ అనే పాటలో వెండితెరపై మెరిసిన శోభా నాయుడుకు ఆ తర్వాత కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఆమెను తన సినిమాల్లో నటించమని కోరారు. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కారు పంపించి, తన సినిమాలో నటించాల్సిందిగా తానే స్వయంగా అడిగారు. ఈ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.నాగిరెడ్డి ఏకంగా బ్లాంక్ చెక్ చేతిలో పెట్టినా, తిరిగి ఇచ్చేసి, నాట్యానికే పూర్తిగా అంకితం కాదలచుకున్నానని చెప్పారు. నాగిరెడ్డి కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అలాగని, శోభా నాయుడుకు సినిమాలంటే వ్యతిరేకత ఏమీ లేదు గాని, కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కాగలవనే కారణంతోనే ఆమె చాలా అవకాశాలను వదులుకున్నారు. అయితే, తన గురువు వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వం వహించిన వాటిలో ‘అమెరికా అమ్మాయి’ వంటి అతికొద్ది చిత్రాలకు సహాయ నృత్యదర్శకురాలిగా పనిచేశారు. తీరని కోరిక... నృత్య గ్రంథాలయం కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు ఐదు శతాబ్దాలు పురుషులే నాట్యాచార్యులుగా ఏలారు. శోభా నాయుడు సాగించిన నిరుపమానమైన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూచిపూడి నృత్య అకాడమీ ప్రిన్సిపాల్‌గా 1981లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. ఆమెకు దాదాపు 1500 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్య అకాడమీని శాఖోపశాఖలుగా విస్తరించారు. ఎన్నెన్నో పురస్కారాలు సంప్రదాయ నృత్యరంగంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. నిజానికి శోభానాయుడు కృషి మరో రెండు దశాబ్దాలైనా కొనసాగాల్సింది. ఆమె మరెన్ని ఎత్తులకు ఎదగాల్సింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పాడు సంవత్సరం ఆమెను తీసుకుపోయి తెలుగువారిని నిజంగా వంచించింది. ఇది క్షమార్హం కాని కాలం. – పన్యాల జగన్నాథ దాసు -
నాట్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
-
శోభా నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
దృశ్యకారిణి
ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు యామినీ రెడ్డి. మహాకవులు రాసిన గొప్ప గ్రంథాలలోని భావానికి నాట్య రూపం ఇది. సాహిత్యాభిలాషులకు నాట్యాన్ని దగ్గర చేయడంతోపాటు సామాన్యులకు గొప్ప గ్రంథాలలోని మార్మికత అర్థమయ్యేటట్లు భావాన్ని వివరిస్తూ దానిని కళ్ల ముందు ఆవిష్కరించడమే దృశ్య కావ్య. పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల కుమార్తె అయిన యామిని తన నాట్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. మూడేళ్ల వయసులో స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి గజ్జె కట్టుకున్నారు యామిని. పాదాలతో పదనిసలు పలికించడం, కళ్లలో భావాన్ని అభినయించడం యామినికి చిన్నప్పటి నుంచే అలవాటైంది. అయితే ఆమె సంపూర్ణ నర్తకిగా రంగప్రవేశం చేయడానికి ఇరవై ఏళ్లు దాటే వరకు ఆగాల్సి వచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే యామినిని నర్తకిని చేయాలనే కోరిక అమ్మానాన్నలకు లేకపోవడంతో ఆమె రంగప్రవేశానికి అంత టైమ్ పట్టింది. కూతురు ప్రొఫెషనల్ కోర్సు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది తల్లి కోరిక. తండ్రికి మాత్రం కూతురికి ఏ రంగం ఇష్టమైతే ఆ రంగం వైపు ప్రోత్సహిద్దామనే అభిలాష తప్ప ప్రత్యేకంగా ఏ నిబంధనా లేదు. డాక్టర్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్‌కి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందనే భయంతో యామిని మెడిసిన్ సీటును వదులుకున్నారు. ‘ఈ సీటు వదిలేశావ్ సరే, మరేదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో చేరు’ అనేది ఆమె తల్లి. అమ్మ మాట కోసం మాత్రమే యామిని ఎంబీఏ చేశారు. అప్పుడు కూడా ‘‘నాకు ఉద్యోగం చేయాలని లేదు, డ్యాన్స్ చేయాలని ఉంది’’ అందామె స్థిరంగా.‘‘పర్ఫెక్షన్ వచ్చే వరకు సాధన చెయ్యి. నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రంగప్రవేశం చేయవచ్చో లేదో నిర్ణయిస్తాను’’ అన్నారు తండ్రి. కూతురి మొండి పట్టుదలతో సాధన చేయడాన్ని, నాట్యంలో ఆమె సాధించిన మెళకువలను చూశాక మాత్రమే రంగప్రవేశం చేయడానికి అనుమతించారాయన. ‘‘మా నాన్న అంగీకారంగా తలూపడం అంటే యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చినట్లే’’ అన్నారామె నవ్వుతూ. అమ్మకు ఇష్టం లేదు ‘‘నాన్న, అమ్మ ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి పడిన కష్టం చిన్నది కాదు. కళారంగంలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని, నాట్యాన్ని కెరీర్‌గా తీసుకుంటే కొద్ది కాలానికే రిటైర్ కావలసి వస్తుందని అమ్మ భయం. ‘అమ్మా నా ఇష్టం నాట్యంలో ఉన్నప్పుడు మరే పని చేసినా మనసు చంపుకుని చేయాల్సిందే. నాట్యంలో నా కెరీర్‌ను కాపాడుకుంటాను. సవాళ్లకు భయపడను. మీరు పాటించిన సహనాన్ని నేను కూడా అలవరుచుకుంటాను’ అని అమ్మకు నచ్చచెప్పాను. నాట్యం అంటే భగవంతుడిని అర్చించే ఒక మార్గం. నేను అంతే అంకితభావంతో కూచిపూడి నాట్యం సాధన చేస్తుండడంతో అమ్మానాన్నలకు నా మీద నమ్మకం కలిగింది. నా కోసం హైదరాబాద్‌లో 2007లో నాట్య తరంగిణి డ్యాన్స్ స్కూల్ శాఖను ప్రారంభించారు. అప్పటి నుంచి నా మీద బాధ్యత పెరిగింది. నాట్య ప్రదర్శనలతోపాటు స్కూల్ నిర్వహణ చూసుకుంటున్నాను. నాట్యం ఒక ప్రవాహం నాట్యం తటాకంలా ఉండకూడదు. ప్రవహించే నదిలాగ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. నాట్యంలో ప్రయోగాలు చేస్తూనే ఉండాలనేది నాన్న పాటించిన సూత్రం, మాకు నేర్పించిన పాఠం. ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఇటీవల కొత్తతరంలో డ్యాన్స్‌కు ఆదరణ పెరిగింది, కానీ పొయెట్రీ చదవడం పూర్తిగా కనుమరుగైపోతోంది. ఊతుకాడు వెంకటసుబ్బయార్, తులసీదాస్, స్వాతి పెరుమాళ్, జయదేవ, నారాయణ తీర్థ వంటి మహాకవుల గురించి ఈతరం పిల్లలకు తెలిసే అవకాశం తక్కువ. వీళ్ల రచనల ఆధారంగానే దృశ్యకావ్యను రూపొందించాను. ఇందులో నాతోపాటు నా శిష్యులు పదిమంది పాల్గొంటున్నారు. ఈ ప్రయత్నం వల్ల పిల్లల్లో మన గ్రంథాల పట్ల ఆసక్తి కలగాలనేది నా కోరిక. నేర్పించాను... నిర్ణయించను మా అబ్బాయికి ఏడేళ్లు. తనకు కూచిపూడిలో బేసిక్స్ నేర్పించాను. తనను డ్యాన్సర్‌ని చేయాలనే నిర్ణయం నేను తీసుకోను. ఇప్పుడు నేనసలే ఏమీ నేర్పించకపోతే.... రేపు బాబు పెద్దయిన తర్వాత ‘నాకెందుకు నేర్పించలేదమ్మా’ అని బాధపడకూడదు కదా! అందుకోసం మాత్రమే తల్లిగా నా బాధ్యత అన్నట్లు నేర్పిస్తున్నాను. నాట్య ప్రదర్శన కోసం బయటికి వెళ్లినప్పుడు బాబు నన్ను మిస్ అవుతున్నాడనే అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది. అందుకే వారంలో రెండు రోజులు నా వర్క్ నుంచి హాలిడే తీసుకుని ఆ రెండు రోజులూ పూర్తిగా బాబు కోసమే కేటాయిస్తున్నాను. వృత్తి బాధ్యతను, తల్లి బాధ్యతను బ్యాలెన్స్ చేయడం కష్టం అని చెప్పను కానీ, చాలా సున్నితంగా డీల్ చేసుకోవాలని మాత్రం చెప్తాను. అలా సమన్వయం చేసుకోగలిగిన నేర్పు ఆడవాళ్లలో ఉంటుంది కూడా’’ అన్నారు యామిని. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేశ్ రెడ్డి ప్రశంస–పురస్కారాలు ‘యామిని డ్యాన్స్ కోసమే పుట్టిన అమ్మాయి. సంపూర్ణమైన నాట్యకారిణి’ యామిని నాట్యం చూసిన ప్రసిద్ధ సితార్ విద్వాంసులు, భారతరత్న పండిట్ రవిశంకర్ ఇచ్చిన ప్రశంస ఇది. ఆమె సంగీత నాటక అకాడమీ, జాతీయ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం, దేవదాసి నేషనల్ అవార్డు, ఫిక్కీ యంగ్ అచీవర్స్ అవార్డులు, ఐర్లాండ్, యూఎస్‌లలో స్థానిక సాంస్కృతిక పురస్కారాలు అందుకున్నారు. నాట్యం మీద ఆమె ‘ఆడియన్స్ డెవలప్మెంట్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ఇండియా’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని కూడా రాశారు. -
శ్రీ శారదా నృత్య నికేతన్ 24వ వార్షికోత్సవం
-
భళా..భక్తి మంజరి
-
సాయిలహరి.. నృత్యమయూరి..
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): కూచిపూడి నృత్యంలో ప్రతిభ చూపుతూ, అందరి మన్ననలూ అందుకోవడమే కాకుండా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటోంది కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు సాయిలహరి. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ నృత్య ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలందుకుంటోంది. తృతీయ జాతీయ స్థాయి నంది నాట్య మహోత్సవంలో భాగంగా గత నెల 24న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న సాయిలహరి గరుడ నాట్య నంది అవార్డును అందుకుంది. దేవగుప్తాపు సాంబశివరావు, అరుణల కుమార్తె సాయిలహరి. చిన్ననాటి నుంచీ సంప్రదాయ కూచిపూడి నాట్యంపై మక్కువ పెంచుకుంది. ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కూడా చదువుతోపాటు కూచిపూడి కూడా నేర్పించేందుకు హైదరాబాద్‌లోని మంజీరా నృత్య అకాడమీలో చేర్పించారు. పదేళ్లపాటు గురువు రేణుకా ప్రభాకర్ సాయిలహరికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో సాయిలహరి ఆరంగేట్రం చేసింది. అక్కడి నుంచి ఆమె కూచిపూడి నృత్యప్రస్థానం మొదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, హరిద్వార్, రిషీకేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకుంది. ఇప్పటివరకూ 150కి పైగా ప్రదర్శనలిచ్చి, తెలుగువారి ఖ్యాతిని, కూచిపూడి విశిష్టతను దేశం నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. గత నెలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన జాతీయ స్థాయి నాట్య మహోత్సవంలో 100 మంది కళాకారులు పాల్గొనగా, మంజీరా అకాడమీ నుంచి సాయిలహరి బృందం గ్రూప్, సోలో విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలో సాయిలహరి ప్రతిభ చూపి గరుడ నాట్య నంది అవార్డు కైవసం చేసుకుంది. సాయిలహరి పొందిన అవార్డులు బాలసుధాకర్ ఉగాది పురస్కారం, యువతరంగాలు, తెలంగాణ రికార్డు బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్, సూపర్‌కిడ్స్ రికార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, అఖిల భారత కూచిపూడి నాట్య కళామందిర్ అవార్డు, రత్న ఉగాది పురస్కారం, సూర్య విద్యానికేతన్ అవార్డు, తెలంగాణ టూరిజం అవార్డు, ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ అవార్డు, సిలికానాంధ్ర రికార్డు, రాధామాధవ రసరంజని అవార్డు, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో వరుసగా మూడేళ్లు పురస్కారాలు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, సౌత్ ఇండియా డ్యాన్స్ అకాడమీ అవార్డు, తెలుగు వెలుగు కల్చరల్ అవార్డు, లయన్స్ క్లబ్ అవార్డులను సాయిలహరి ఇప్పటివరకూ అందుకుంది. వీటితోపాటు అనేక నగదు పురస్కారాలు కూడా అందుకుంది. హైదరాబాద్‌లోని వివిధ దేవాలయాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. కూచిపూడి నాట్యంలో ఇన్ని అవార్డులు రావడానికి తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం ఒక ఎత్తయితే, గురుమణి రేణుకా ప్రభాకర్ ఇచ్చిన శిక్షణే ప్రధాన కారణం. తాతయ్య, నాన్నమ్మలు వీరభద్రరావు, నాగలక్ష్మి, బాబాయ్ మూర్తి తోడ్పాటు కూడా మరువలేను. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి, తెలుగువారికే సొంతమైన కూచిపూడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడమే జీవిత లక్ష్యం.– సాయిలహరి -
త్రిష నృత్యం.. రమణీయం
నాంపల్లి: త్రిష కూచిపూడి నృత్యం శాస్త్రోక్తంగా సాగింది. రాగం, భావం, తాళానుగుణంగా ఆమె నర్తించారు. ప్రతి అంశాన్ని లయాత్మకంగా ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్నారు. ఎస్జీఎస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రవీంద్రభారతి వేదికపై చిలుక త్రిష నృత్య ప్రదర్శన కన్నులపండువగా జరిగింది. ఆమె తల్లిదండ్రులు దయానంద్, సుధారాణిలకు భారతీయ కళలపై ఉన్న ఆసక్తి, మక్కువతో కుమార్తెకు ఐదో ఏటనే కూచిపూడిలో చేర్పించారు. ప్రముఖ నాట్య గురువు వాణీరమణ వద్ద శిష్యరికంతో కూచిపూడిలో ప్రవేశం పొందిన త్రిష నృత్యకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక కళా వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలను అందుకున్నారు. వేదికపై ప్రదర్శించిన జిమ్‌జిమ్ తనన, వీడలేరా వయ్యారం, భామాకలాపం, నీలమేఘ (తరంగం), సూర్యాష్టకం, సింహానందిని అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ భాగవతుల సేతూరాం అధ్యక్షతన జరిగిన సభలో నర్తకి త్రిషను అభినందించారు. ఈ సందర్భంగా గురు సత్కారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిపోయిన ‘నర్తనం’
నివాళి ఒక మువ్వ రాలిపోయింది... నిన్నటి దాకా నేలపై నర్తించిన పాదం... శివునితో నాట్యం చేయడానికి కైలాసం చేరుకుంది...కూచిపూడి వెంపటి వారసత్వం లయమై పోయింది... ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పద్మవిభూషణ్ వెంపటి చినసత్యం రెండవ కుమారుడు నాట్యాచార్యులు వెంపటి రవి శంకర్ ఈ ఉదయం గుండె పోటుతో చెన్నైలో కన్నుమూశారు. ‘‘1969 అక్టోబర్‌లో జన్మించిన రవి శంకర్ తండ్రి దగ్గర నాట్యాభ్యాసం చేయలేదు. వెంపటి చినసత్యంగారి ప్రథమ శిష్యురాలు బాల కొండలరావు దగ్గర వెంపటి నాట్యం ఆరంభించారు. ‘శ్రీనివాస కల్యాణం’లో కల్పతరువుగా నటించి, తండ్రి దృష్టిలో పడ్డారు. కుమారుడిని చూసి తండ్రి మురిసి పోయారు. ‘ఇంతింతై వటుడింతౖయె’ అన్నట్లుగా తండ్రికి దీటుగా నాట్యకారుడిగా అవ తరించాడు. చినసత్యం రూపొందించిన అంశాలను 1994 – 2004 మధ్యకాలంలో ప్రదర్శించారు. అర్ధనారీశ్వరుడిగా నటించి అందరినీ అలరించారు. ‘హరవిలాసం’లో శివుడు, ‘శకుంతలదుష్యంతులు’లో దుష్యంతుడు, ‘కిరాతార్జునీయం’లో అర్జునుడిగా నటించారు. బాల్యంలోనే ‘క్షీరసాగర మథనం’లో అప్సరసగా కూచిపూడి సంప్రదాయ రీతుల్లో ఆడ వేషం వేశారు. 1994లో ‘వందే ఉమాసుతం’ అనే స్వీయరచన చేసి 2007లో నృత్య రూపకల్పన చేశారు. ఈ రూపకాన్ని ఐదు గతుల్లో నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎవ్వరూ స్పృశించని అనేక అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం సమకూర్చి పిల్లల చేత ప్రదర్శనలు ఇప్పించారు. ‘అతడిని మించినవాడు లేడు’ అనిపించుకున్నాడు’’ అంటున్నారు ప్రముఖ నాట్యాచార్యులు కూచిపూడి గ్రామానికి చెందిన పశుమర్తి కేశవప్రసాద్. ‘‘మాస్టారుగారి అబ్బాయికి నేర్పడం నాకు గర్వంగా ఉంది. నా శిష్యుడు నన్ను అధి గమించాడు. తండ్రితో సమానంగా, తండ్రికి ధీటుగా ప్రతి విషయాన్ని చక్కగా కూచిపూడి శైలిలో మలిచాడు’’ అంటారు వెంపటి రవిశంకర్ నాట్యగురువులు శ్రీమతి బాల కొండలరావు. ‘‘పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దగ్గర సంగీతం అభ్యసించి, కచేరీలు చేశాడు. ఆయన మంచి నాట్యాచార్యుడు, నర్తకుడు. ఆయనకు జ్ఞాత, అజ్ఞాత శిష్యులు దేశవిదేశాలలో ఉన్నారు. ఆయన అçస్తమయం కూచిపూడి కళారంగానికి తీరనిలోటు. అన్ని వాద్యాల మీద అపరిమితమైన పరిజ్ఞానం ఉంది. ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో, ఏ వాద్యాన్ని ఏ సందర్భానికి ఉపయోగించాలో బాగా తెలుసు. లఘువు బిగువులు తెలిసిన మహావ్యక్తి. కుర్రవాళ్లలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. తీర్చిదిద్దడం, అంశాన్ని డ్రమెటైజ్ చేయడం ఆయనకి బాగా తెలుసు. మాకు బాలా త్రిపుర సుందరి మీద కీర్తనలు పాడి ఇచ్చారు. అందరి మనసులలో స్థానం ఏర్పరుచుకున్నారు. సంగీతం, నృత్యం నేర్చుకోవడమే కాదు, అందులో నిష్ణాతులు. చినసత్యం అంతటి వారవ్వగలిగిన జ్ఞాని ఆయన. కాని అనారోగ్యం కారణంగా కాలేకపోయారు. దక్ష యజ్ఞంలో శివుడు వేషం వేసి మెప్పించారు. విద్వత్సభలలో సంగీత కచేరీలు చేశారు. నట్టువాంగం రావాలంటే సంగీతం వచ్చి తీరాలి. చినసత్యం గారు రూపకల్పన చేసిన వాటిని యథాతథం ప్రదర్శించేవారు. ఆనందతాండవం, జయముజయము... వంటివి. చినసత్యంగారి వారసుడుగా నిలబడలేకపోవడం కూచిపూడికి తీరనిలోటు.. అంటు న్నారు విజయవాడకు చెందిన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల వెంకట రామశర్మ. 2008లో మొట్టమొదటి కూచిపూడి నాట్య సమ్మేళనం అమెరికాలో జరిగినప్పుడు తండ్రితో పాటు సిలికానాంధ్రకు విచ్చేసి ‘కూచిపూడి వైజయంతిక’ అనే బ్యాలేలో సిద్ధేంద్ర యోగి పాత్ర ధరించారు. అప్పటి నుంచి సిలికానాంధ్ర చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తోడ్పడుతూ వచ్చారు. 2016లో విజయవాడలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనానికి ‘సాధన వీడియో’ స్వయంగా తయారుచేసి అందించారు. అద్భుత మైన కళాకారుడు. మృదుస్వభావి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2015లో కళారత్న పురస్కారం అందచేశాం. ఎన్నో సాధించవలసిన వ్యక్తి, చినసత్యంగారి వార సుడు ఆయన. వారి కుటుంబానికి తగిన సహాయం సిలికానాంధ్ర తరఫు నుంచి అంద చేయాలని సంకల్పించాం... అన్నారు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్. – డాక్టర్ పురాణపండ వైజయంతి -
లయ విన్యాసం
-
సేవ ఒక కళ
సుజాత వింజమూరి- కూచిపూడి నృత్యకారిణి కావాల్సినంత డబ్బు. అందరూ కలలు కనే అమెరికాలో నివాసం. విలాసవంతమైన జీవితం. ఆనందంగా బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? అయితే జన్మభూమికి సేవ చేయాలనే తపన ఆమెను నిలవనీయలేదు. అందుకే తనకు ఇష్టమైన నృత్య కళను కొనసాగిస్తూ.. ఆ కళలే నేపథ్యంగా దేశంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సుజాత వింజమూరి. కళారత్న బిరుదు అందుకున్న కూచిపూడి నృత్యకారిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. నృత్యంలోనే ఆనందం, శక్తి ఉన్నాయని నమ్మే సుజాత అంతరంగం ఆమె మాటల్లోనే.. భగవద్గీతలో ఏదో ఎనర్జీ ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని కొన్ని శాశ్వతం అని భ్రమపడతాం. కానీ ఏదీ శాశ్వతం కాదనే విషయం గీత తెలియజేస్తుంది. అందుకే భగవద్గీత నృత్యనాటికను ఎంచుకున్నా. నటరాజు బొమ్మను చూస్తాం. కానీ ఆ ఆకారానికి అర్థం తెలియదు. ఆ బొమ్మలో ఒక్కోదానికి ఒక్కో సందేశం ఉంది. ఆ సందేశాన్ని చెప్పాలనే నటరాజుఅంశంగా తీసుకున్నా. ఆయన త్రినేత్రుడు ఎందుకయ్యాడు, ఒకే భంగిమలో ఎందుకున్నాడు వంటి విషయాలన్నీ తెలియాలంటే నృత్యనాటికను చూడాల్సిందే. అమెరికాలో అకాడెమీ అమెరికాలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ ‘సెయింట్ లూయీ’ స్థాపించి 30 ఏళ్లు అయింది. ఎంతోమందికి నృత్యంలో శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం 100 మంది విద్యార్థులున్నారు. మా అకాడమీకి వచ్చే విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సేవాభావాన్ని అలవరుస్తాం. అలా తెలియజెప్పేందుకే ఈసారి 9మంది విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చాను. సేవే లక్ష్యంగా... ప్రతి ఏటా భారత్‌లో నాలుగు ప్రదర్శనలు చేస్తాం. అందులో రెండు చారిటీ కోసం. ఇప్పుడు హైదరాబాద్‌లో.. త్వరలో తిరుపతి, ఇతర నగరాల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నాం. ఇండియాలో గతంలో నిర్వహించిన ప్రదర్శనలకు వచ్చిన ఐదు లక్షలను ఢిల్లీలోని సలాం బాలక్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చాం. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న మహాత్ముడి సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా. దానికి కట్టుబడే ఈ సాయం చేయడం. అమెరికాలో చారిటీ కోసం అక్టోబర్. నవంబర్‌లో ప్రదర్శనలు నిర్వహిస్తాం. విదేశాల్లోనే గౌరవం.. మనది ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సంస్కృతి. విదేశాల్లోనే మన సంస్కృతి-సంప్రదాయాలకు గౌరవం ఎక్కువ. అమెరికాలో తెలుగుదనం వర్ధిల్లుతోంది. వెస్ట్రన్ కల్చర్‌లో ఉన్నా మన కల్చర్‌కు పెద్దపీట వేస్తున్నారు మనవాళ్లు. సంస్కృతి, సంప్రదాయలతో పాటు ఆధ్యాత్మికత వర్ధిల్లాలి. నా ఊపిరున్నంతవరకూ అందుకోసమే పనిచేస్తాను. - కోన సుధాకర్ రెడ్డి