సాయి లహరి నృత్య భంగిమ
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): కూచిపూడి నృత్యంలో ప్రతిభ చూపుతూ, అందరి మన్ననలూ అందుకోవడమే కాకుండా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటోంది కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు సాయిలహరి. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ నృత్య ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలందుకుంటోంది. తృతీయ జాతీయ స్థాయి నంది నాట్య మహోత్సవంలో భాగంగా గత నెల 24న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న సాయిలహరి గరుడ నాట్య నంది అవార్డును అందుకుంది.
దేవగుప్తాపు సాంబశివరావు, అరుణల కుమార్తె సాయిలహరి. చిన్ననాటి నుంచీ సంప్రదాయ కూచిపూడి నాట్యంపై మక్కువ పెంచుకుంది. ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కూడా చదువుతోపాటు కూచిపూడి కూడా నేర్పించేందుకు హైదరాబాద్‌లోని మంజీరా నృత్య అకాడమీలో చేర్పించారు. పదేళ్లపాటు గురువు రేణుకా ప్రభాకర్ సాయిలహరికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో సాయిలహరి ఆరంగేట్రం చేసింది. అక్కడి నుంచి ఆమె కూచిపూడి నృత్యప్రస్థానం మొదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, హరిద్వార్, రిషీకేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకుంది. ఇప్పటివరకూ 150కి పైగా ప్రదర్శనలిచ్చి, తెలుగువారి ఖ్యాతిని, కూచిపూడి విశిష్టతను దేశం నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. గత నెలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన జాతీయ స్థాయి నాట్య మహోత్సవంలో 100 మంది కళాకారులు పాల్గొనగా, మంజీరా అకాడమీ నుంచి సాయిలహరి బృందం గ్రూప్, సోలో విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలో సాయిలహరి ప్రతిభ చూపి గరుడ నాట్య నంది అవార్డు కైవసం చేసుకుంది.
సాయిలహరి పొందిన అవార్డులు
బాలసుధాకర్ ఉగాది పురస్కారం, యువతరంగాలు, తెలంగాణ రికార్డు బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్, సూపర్‌కిడ్స్ రికార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, అఖిల భారత కూచిపూడి నాట్య కళామందిర్ అవార్డు, రత్న ఉగాది పురస్కారం, సూర్య విద్యానికేతన్ అవార్డు, తెలంగాణ టూరిజం అవార్డు, ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ అవార్డు, సిలికానాంధ్ర రికార్డు, రాధామాధవ రసరంజని అవార్డు, కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో వరుసగా మూడేళ్లు పురస్కారాలు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, సౌత్ ఇండియా డ్యాన్స్ అకాడమీ అవార్డు, తెలుగు వెలుగు కల్చరల్ అవార్డు, లయన్స్ క్లబ్ అవార్డులను సాయిలహరి ఇప్పటివరకూ అందుకుంది. వీటితోపాటు అనేక నగదు పురస్కారాలు కూడా అందుకుంది. హైదరాబాద్‌లోని వివిధ దేవాలయాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
కూచిపూడి నాట్యంలో ఇన్ని అవార్డులు రావడానికి తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం ఒక ఎత్తయితే, గురుమణి రేణుకా ప్రభాకర్ ఇచ్చిన శిక్షణే ప్రధాన కారణం. తాతయ్య, నాన్నమ్మలు వీరభద్రరావు, నాగలక్ష్మి, బాబాయ్ మూర్తి తోడ్పాటు కూడా మరువలేను. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి, తెలుగువారికే సొంతమైన కూచిపూడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడమే జీవిత లక్ష్యం.– సాయిలహరి
Comments
Please login to add a commentAdd a comment