సేవ ఒక కళ
సుజాత వింజమూరి- కూచిపూడి నృత్యకారిణి
కావాల్సినంత డబ్బు. అందరూ కలలు కనే అమెరికాలో నివాసం. విలాసవంతమైన జీవితం. ఆనందంగా బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? అయితే జన్మభూమికి సేవ చేయాలనే తపన ఆమెను నిలవనీయలేదు. అందుకే తనకు ఇష్టమైన నృత్య కళను కొనసాగిస్తూ.. ఆ కళలే నేపథ్యంగా దేశంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సుజాత వింజమూరి. కళారత్న బిరుదు అందుకున్న కూచిపూడి నృత్యకారిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. నృత్యంలోనే ఆనందం, శక్తి ఉన్నాయని నమ్మే సుజాత అంతరంగం ఆమె మాటల్లోనే..
భగవద్గీతలో ఏదో ఎనర్జీ ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని కొన్ని శాశ్వతం అని భ్రమపడతాం. కానీ ఏదీ శాశ్వతం కాదనే విషయం గీత తెలియజేస్తుంది. అందుకే భగవద్గీత నృత్యనాటికను ఎంచుకున్నా. నటరాజు బొమ్మను చూస్తాం. కానీ ఆ ఆకారానికి అర్థం తెలియదు. ఆ బొమ్మలో ఒక్కోదానికి ఒక్కో సందేశం ఉంది. ఆ సందేశాన్ని చెప్పాలనే నటరాజుఅంశంగా తీసుకున్నా. ఆయన త్రినేత్రుడు ఎందుకయ్యాడు, ఒకే భంగిమలో ఎందుకున్నాడు వంటి విషయాలన్నీ తెలియాలంటే నృత్యనాటికను చూడాల్సిందే.
అమెరికాలో అకాడెమీ
అమెరికాలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ ‘సెయింట్ లూయీ’ స్థాపించి 30 ఏళ్లు అయింది. ఎంతోమందికి నృత్యంలో శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం 100 మంది విద్యార్థులున్నారు. మా అకాడమీకి వచ్చే విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సేవాభావాన్ని అలవరుస్తాం. అలా తెలియజెప్పేందుకే ఈసారి 9మంది విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చాను.
సేవే లక్ష్యంగా...
ప్రతి ఏటా భారత్‌లో నాలుగు ప్రదర్శనలు చేస్తాం. అందులో రెండు చారిటీ కోసం. ఇప్పుడు హైదరాబాద్‌లో.. త్వరలో తిరుపతి, ఇతర నగరాల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నాం. ఇండియాలో గతంలో నిర్వహించిన ప్రదర్శనలకు వచ్చిన ఐదు లక్షలను ఢిల్లీలోని సలాం బాలక్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చాం. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న మహాత్ముడి సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా. దానికి కట్టుబడే ఈ సాయం చేయడం. అమెరికాలో చారిటీ కోసం అక్టోబర్. నవంబర్‌లో ప్రదర్శనలు నిర్వహిస్తాం.
విదేశాల్లోనే గౌరవం..
మనది ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సంస్కృతి. విదేశాల్లోనే మన సంస్కృతి-సంప్రదాయాలకు గౌరవం ఎక్కువ. అమెరికాలో తెలుగుదనం వర్ధిల్లుతోంది. వెస్ట్రన్ కల్చర్‌లో ఉన్నా మన కల్చర్‌కు పెద్దపీట వేస్తున్నారు మనవాళ్లు. సంస్కృతి, సంప్రదాయలతో పాటు ఆధ్యాత్మికత వర్ధిల్లాలి. నా ఊపిరున్నంతవరకూ అందుకోసమే పనిచేస్తాను.
- కోన సుధాకర్ రెడ్డి