Kona sudhakar reddy
-
కౌబాయ్
హైందవ సంప్రదాయంలో గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.. పూజిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో.. ఎల్లలు దాటి సంచరిస్తున్న జూలియన్ కిర్పాల్ బ్లెస్ కూడా ఆవును అమితంగా ప్రేమిస్తారు. గో సంరక్షణ ప్రాధాన్యం తెలియజేస్తూనే.. సేవాగుణం గొప్పదనాన్ని చాటుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కిర్పాల్.. తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, వాటికి ప్రచారం కల్పిస్తూ.. 12 ఏళ్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ ప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చిన అతన్ని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. - కోన సుధాకర్ రెడ్డి ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు. ఒకటి- సేవాగుణం, రెండు- ఆధ్యాత్మికత. ఈ రెండూ ఉన్న చోట ధర్మం నిలబడుతుంది. ఇది మెట్ట వేదాంతం కాదు. జీవిత సత్యం. ఈ నిజం నాకు అవగతమై పన్నెండేళ్లు అవుతోంది. అప్పట్నుంచి నేను నమ్మిన సిద్ధాంతాన్ని పది మందికీ పరిచయం చేస్తున్నా. దైవంగా పూజించే గోవును చంపడాన్ని నేను నేరంగా భావిస్తాను. ఒక్క ఆవునే కాదు.. ఏ మూగజీవాన్నీ చంపడం, వాటి మాంసం భుజించడాన్ని నేను సమర్థించను. నేనే కాదు అమెరికాలోని మా కుటుంబం నాన్‌వెజ్ పూర్తిగా మానేసింది. శాకాహారం ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలా చేయగలుగుతుంది. కొన్నాళ్ల కిందట అమెరికాలోని విస్టన్ వ్యాలీ మీడియం కరెక్షనల్ జైలులోని ఖైదీలకు పూర్తిగా శాకాహారం అందించడం మొదలుపెట్టాం. కొన్నాళ్లకు ఆ ఖైదీల మానసిక ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించింది. నేనే బండి లాగాను.. కర్మభూమిగా భాసిల్లుతున్న భారతదేశం సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక దిక్సూచి వంటిది. భారతదేశం గొప్పదనం గురించి పుస్తకాల్లో చదివాక.. ఈ దేశానికి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకున్నాను. ఆ క ల మూడుసార్లు నెరవేరింది. ఇప్పటికే భారత్‌లో రెండుసార్లు పర్యటించాను. ఇది మూడోసారి. ఢిల్లీ, చెన్నై, పాండిచ్చేరి, హైదరాబాద్‌తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా చూశాను. ఈ ప్రయాణంలో ఎన్నో గోశాలలు సందర్శించాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఆవులకు వైద్యం అందించడం చూశాను. ఢిల్లీలో ఉండగా.. ఎద్దుతో నడిపించే బండిని చూశాను. తట్టుకోలేకపోయాను. వెంటనే దాన్ని విడిపించి నేనే బండి లాగాను. పశువులతో పని చేయించుకోవడం తప్పు కాదు. కాని, వాటిపై మోయలేని భారాన్ని మోపడం సరికాదు. ఇలాగే సాగుతా.. మానవ మనుగడకు పర్యావరణం ప్రధాన వనరు. పర్యావరణాన్ని రక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. నేను ఎంచుకున్న సేవా పథంలో పర్యావరణ పరిరక్షణే మొదటి అంశం. దీనిపై కూడా నాకు తోచినంతలో పది మందికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే.. వయసు 48. పెద్దగా చదువుకోలేదు. అమెరికాలో రియల్ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఆరు నెలల కిందట ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం కుటుంబ సభ్యులే నాకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ.. సమాజ హితం కోరుతూ ఇలా ముందుకు సాగుతాను. రెండు నెలలుగా.. ఆరు నెలల కిందట ఇండియా టూర్‌కు వచ్చిన కిర్పాల్.. రెండు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఓ వైపు తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే తెలుగు భాషా, సంస్కృతులపై అధ్యయనం చేస్తున్నాడు. రవీంద్ర భారతికి కిర్పాల్ నిత్య అతిథి. సామాజిక దృక్పథం ఉన్న నాటకాలు, ప్రదర్శనలు చూసి ఆహా.. ఓహో.. అని చప్పట్లు చరచడమే కాదు.. వాటి విశేషాలను ప్రచారం చేస్తుంటాడు. -
గానమే ప్రాణం
కొంమండూరి రామాచారి... వర్ధమాన సంగీతంలో తరచుగా వినిపించే పేరు. ఈ పేరు వినగానే కొందరికి ప్రభావశీలి అయిన పాటల మాంత్రికుడుగా గుర్తుకొస్తే... మరికొందరికి క్రమశిక్షణతో సంగీతం నేర్పే గురువుగా స్ఫురిస్తారు. తనకి పాటలు నేర్పిన గురువులకు నిఖార్సయిన శిష్యుడిగా... తన దగ్గర సంగీత సాధన చేస్తున్న వారికి ఆదర్శప్రాయుడైన గురువుగా... గానమే ప్రాణంగా జీవిస్తున్న పాటల మాంత్రికుడి పరిచయం. కోన సుధాకర్‌రె డ్డి మెదక్ జిల్లా ‘పెదగొట్టిముక్కల’లో కొమండూరి కృష్ణమాచార్యులు, యశోదమ్మ దంపతులకు జన్మించారు రామాచారి. బాల్యం అంతా జన్మస్థలం సమీపంలోని శివంపేట్లోనే. పదో తరగతి వరకు అక్కడే చదివి ఇంటర్ కోసం 1980లో సికింద్రాబాద్‌లో ప్రభుత్వ సంగీత కళాశాలకు వచ్చిన ఆయన ఏనాడూ వెనుదిరిగి చూడలేదు. తొలి మలుపు... అప్పుడప్పుడే పాటలు పాడటం ప్రారంభించిన తనకు బాలవినోదం కార్యక్రమం కలిసి వచ్చింది. పీవీ సాయిబాబా దగ్గర లలితసంగీతం నేర్చుకొన్నారు. రేడియోతోపాటు.. హిం దీ, తెలుగు, లలిత గీతాలు పాడటం ప్రారంభిం చారు. గొంతు బాగుందని ప్రోత్సహించడంతో స్నేహితులతో కలిసి మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లో పాటలు పాడటంతో మంచి గుర్తింపు వచ్చింది. 1998లో... 1998లో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీ ఏర్పాటు చేసి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారాయన. వీకెండ్స్‌లో రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు తమ పిల్లలను శిక్షణ కోసం తీసుకొస్తారు. ఒకసారి పిల్లల కంఠం వింటే పాటల్లో వారి భవిష్యత్ ఏంటో ఇట్టే చెప్పేయగల దిట్ట. ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న కుర్రకారు సాకేత్, ప్రణవి, గీతామాధురి, కారుణ్య, హేమచంద్ర. నాగసాహితీ, దీపు, ఇర్ఫాన్, రేవంత్‌లు రామాచారి శిష్యులే. టీవీ ఛానల్స్ రియాల్టీషోస్లో పాల్గొనే వారిలో అధిక శాతం వీరి శిష్యులే. సంగీతం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు పెద్ద పీఠ వేస్తారు. సంగీతంతో సమానంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతారు. వేసవిలో అంతర్జాతీయ శిక్షణ.. విదేశాల్లో సైతం రామాచారికి వేలాది మంది శిష్యులు ఉన్నారు. ఒక్క అమెరికానే కాదు లండన్, అస్ట్రేలియాతో పాటు చాలా దేశాల్లో పాఠశాలల వేసవి సెలవుల సమయంలో అక్కడికి వెళ్లి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయంగా వేల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన, వందలాది అవార్డులు సొంతం చేసుకొన్నాడు. పూల వాసన దారానికి కూడా అబ్బుతుందన్న ట్లు.. ఇంటిల్లిపాది సంగీతాన్ని వంటబట్టిం చుకొన్నారు. రామాచారి వారసుడు సాకేత్ ఇప్పటికే ప్లే బ్యాక్ సింగర్‌గా దూసుకుపోతున్నాడు. కుమార్తె సాహితీ కూడా పాటలు పాడుతుంది. సెల్యూట్ చేయాల్సిందే... సంగీతం వ్యాప్తికి ఇక్కడి మీడియా చేస్తున్న కృషికి సెల్యూట్ చేయకతప్పదు. మీడియానే చొరవ తీసుకోకుండా ఉండి ఉంటే సంగీతం వెనకబడేది. బయటికి వెళ్తే హితులు, సన్నిహతులు, విదేశాల్లోని వారు కూడా మీ ఆధ్వర్యంలో ఒక సంగీత కళాశాల ప్రారంభించమని కోరుతున్నారు. అంతర్జాతీయ సంగీత రెసిడెన్సియల్ కళాశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కొంత నిధులు సమకూర్చుకొన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థల సహయం చేస్తే సంగీత కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తా. -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి -
అలలపై నడుస్తా
‘నాకు గానీ ఒక అవకాశం గానీ ఇస్తే.. హుస్సేన్‌సాగర్ అలలపై నడిచి చూపిస్తా..’ అంటున్నారు ప్రపంచ మాయలోడు పీసీ సర్కార్. ఒక్క ఈలతో కళ్లముందున్నవి కనిపించకుండా చేసే మాయావి ఆయన. అబ్రకదబ్ర అని మంత్రదండం తిప్పారో.. అద్భుతాలు జరిగిపోతాయి. మాయాలేదు, మర్మం లేదు అంటూనే కనికట్టుతో ఓ పట్టుపడతారు. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యల్లో ఆరితేరిన ఈ మాయలోడు హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో షో ఇవ్వడానికి వచ్చిన ఆయన సిటీప్లస్‌తో ముచ్చటించారు. - కోన సుధాకర్‌రెడ్డి మేజిక్కు కులగోత్రాలు లేవు. ఎనిమిదేళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ అందరికీ ఇది ఆనందం పంచుతుంది. మా తాత పీసీ సర్కార్ వారసత్వంగా ఇంద్రజాలం నాకు లభించింది. పీసీ సర్కార్ వంశంలో నాది మూడో జనరేషన్. దీన్నో గొప్ప వరంగా భావిస్తున్నాను. మేజిక్ అంటే నాకు ఆసక్తి మాత్రమే కాదు, నా జీవితం. నాకు అబ్బిన విద్య ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాను. అనుమతిస్తే.. అద్భుతాలే..1999, 2009, 2010 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు వచ్చాను. 2009లో ఒకే నెలలో 42 ప్రదర్శనలిచ్చి రికార్డు సృష్టించా. ఈసారీ ఈ సిటీలో రికార్డు సాధించాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం అనుమతిస్తే హుస్సేన్‌సాగర్ నీటిపై నడిచి చూపిస్తా. నెక్లెస్ రోడ్డులో కళ్లకు గంతలు కట్టుకుని ఓపెన్ టాప్ జీప్ నడిపిస్తా. అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంకా కొంచెం.. మా తాత పీసీ సర్కార్ 101వ జయంతి ఉత్సవంగా హరిహరకళాభవన్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్నాను. ఇందులో ట్రెడిషనల్ ఐటమ్స్‌తో పాటు నా తరహా ప్రదర్శనలు కూడా ఉంటాయి. వ్యానిషింగ్ యాక్ట్ (మనిషి మాయం చేయడం) కూడా ఉంటుంది. స్టేజ్ నుంచి మాయం కావడం, వెంటనే బాల్కనీ నుంచి హాయ్ అంటూ ముందుకు రావడం ఇలాంటి మేజిక్స్ ఎన్నో ఉంటాయి. ప్రదర్శనకు వస్తే మీకే తెలుస్తాయి. సహకరించాలి.. మేజిక్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చాలామంది వసతులు లేక ఈ విద్య నేర్చుకోలేకపోతున్నారు. 1935 లోనే పీసీ సర్కార్ కోల్‌కతాలో మ్యాజిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సిటీల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అందుకు స్థానిక మెజీషియన్స్ ముందుకు రావాలి. అంతేకాదు ప్రభుత్వం కూడా స్థలం, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెన్నైలో కొంతమంది మేజీషియన్స్ సహకారంతో ఓ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్‌లో ప్రదర్శనల ఏర్పాటుకు ఇక్కడి ప్రియ కల్చరల్ అకాడమీ మాకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. చప్పట్లే అవార్డులు.. దేశవ్యాప్తంగా వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చాను. యురోపియన్, ఆఫ్రికా దేశాలు, అమెరికా, కెనడా, సౌత్ఆఫ్రి కా, జపాన్ ఇలా ఎన్నో దేశాలు తిరిగాను. ప్రజలను ఆనందపర్చడమే మా పని. వారి చప్పట్లే మాకు అవార్డులు, రివార్డులు. హైదరాబాద్‌లో ఈ నెల 24 నుంచి జనవరి 8 వరకూ ప్రదర్శనలు ఇస్తున్నాను. సిటీవాసులకు సరికొత్త వినోదం అందిస్తాననే నమ్మకం ఉంది. నేటి నుంచే ఇంద్రజాల ప్రదర్శన పీసీ సర్కార్ (యంగ్ అండ్ మాస్టర్) ప్రదర్శన తేదీలు: 24 డిసెంబర్, 2014 నుంచి 8 జనవరి, 2015 వరకు ప్రదర్శన వేళలు: రోజూ రాత్రి 7 గంటలకు.. శని, ఆదివారాలు: సాయంత్రం 4, రాత్రి 7 గంటలకు వేదిక: హరిహర కళాభవన్, సికింద్రాబాద్. ఆన్లైన్ బుకింగ్: bookmyshow వివరాలకు ఫోన్: 97006 66061 -
సృజనకు పట్టం
రెక్కలు తొడిగిన ఊహలకు ఆ చిట్టి కుంచెలు అద్భుతమైన రూపాన్నిచ్చాయి. అబ్బురపరిచే కళను రంగులతో కలగలిపి కాన్వాస్‌పై ఒలకబోసి అదరహో అనిపించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ పోటీలు చిన్నారుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. 50 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్ చిన్నారులే మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కోన సుధాకర్ రెడ్డి ఫుల్ హ్యాపీ గతంలో జరిగిన పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాను. నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పెయింటింగ్ వేశాను. - కె.దివిజ, ఏడో తరగతి,డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి మొదటిసారైనా.. ఇలాంటి పోటీలో నేను పాల్గొనడం ఇదే తొలిసారి. సెకండ్ ప్లేస్‌లో నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని ఫ్యామిలీ, టీచర్లు, స్నేహితులతో పంచుకుంటా. చిన్నపిల్లలు-నీటి సంర క్షణ కాన్సెప్ట్‌ను కాన్వాస్‌పై చూపాను. - జి.అమృత లక్ష్మి, ఎనిమిదో తరగతి,కేంద్రియ విద్యాలయం, బేగంపేట్. ఇదే స్ఫూర్తితో.. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో నాకు ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది.లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చిన ఘట్టాన్ని.. ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చిత్రం గీశాను. ఇలాంటి పోటీలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. - ఇ.శ్వేత, తృతీయ బహుమతి విజేత, ఎనిమిదో తరగతి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్- 1, ఈసీఐఎల్ -
చైతన్య వాహిని
లోకంలో ప్రశ్నించే వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు. నిలదీసే వాళ్లూ ప్రతి వీధిలో తారసపడతారు. సమాధానం చెప్పేవాళ్లు మాత్రం కోటికొక్కరు ఉంటారు. అంతులేని ప్రశ్నలకు అర్థమయ్యేలా జవాబు చెప్పి.. సమాజంలో పేరుకుపోయిన బూజును దులిపే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే సంకల్పంతో ఏర్పాటైంది మంథన్ ఫౌండేషన్. సామాజిక అంశాలు, ఆర్థిక అవసరాలు, రాజకీయ కోణాలు, అంతర్జాతీయ సంగతులు.. ఇలా ఎన్నో అంశాలపై ఓపెన్ డిబేట్ నిర్వహిస్తూ సామాన్యుడికి అర్థం కాని అనేక విషయాలపై అవగాహన కల్పిస్తోంది. మంథన్ అంటే .. మేధోమథనం! వినడానికి బరువైన పదంగా అనిపించొచ్చు. కానీ ఎన్నో సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు చూపుతున్న మార్గం ఇది. సైన్స్ అండ్ ఫిక్షన్, రాజకీయాల్లోని అవినీతి.. ప్రజా చట్టాల్లోని లొసుగులు.. అభివృద్ధితో అందే ఫలాలు.. ఇలా లోకాభిరామాయణాన్ని భుుజానికెత్తుకుంది మంథన్ సంస్థ. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు అజయ్ గాంధీ, ఎమ్ఆర్ విక్రమ్‌ల ఆలోచనతో తొమ్మిదేళ్ల కిందట తొమ్మిది మందితో పిల్లకాలువలా మొదలైన ఈ వాహిని.. ఇప్పుడు ఆరువేల మంది సభ్యులతో ఉప్పెనలా రూపుదిద్దుకుంది. సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. లక్ష్యం దిశగా.. అంశం ఏదైనా సమాజాన్ని చైతన్య పర్చడమే మంథన్ లక్ష్యం. వివిధ రంగాల్లో ప్రముఖులు, నీతి, నిజాయతీలకు మారు పేరుగా నిలిచిన వారు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు బృంద చర్చలు, సమావేశాలు, బహిరంగ చర్చలు నిర్వహిస్తుంటారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను వక్తలుగా ఆహ్వానిస్తారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు ఓపెన్ డిబేట్లో ఆహూతుల అభిప్రాయాలను స్వీకరిస్తారు. ప్రతినెలా ఒకటి లేదా రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రవేశం ఉచితం. మనం చేయాల్సిందల్లా ఠీఠీఠీ.ఝ్చ్టజ్చిజీఛీజ్చీ.ఛిౌఝ లో పేరు నమోదు చేసుకోవడమే. సామాజిక బాధ్యతను నెత్తినేసుకున్న మంథన్ ఫౌండేషన్ ఏ ఇతర సంస్థ నుంచి , వ్యక్తుల నుంచి నిధులు వసూలు చేయదు. రచయితలు, వ్యాపారులు, కంపెనీ యజమానులు, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉండటం విశేషం. పెరుగుతున్న ఆదరణ.. మంథన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా 150 నుంచి 700 మంది ప్రజలు హాజరవుతారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఆరుసార్లకు పైగా ప్రముఖ వక్తలతో చర్చలు నిర్వహించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్య మనుగడపై సామాజిక కార్యకర్త, మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్‌రాయ్ ఉపన్యసించారు. గతంలో ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల పోరాట నేత కణ ్ణబీరన్, కవి జావెద్ అక్తర్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి 150 మందికి పైగా ప్రముఖులు మంథన్ సదస్సులో పాల్గొన్నారు. ఓపెన్ ప్లాట్‌ఫాం గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో మంథన్ సంవాద్-2014 ఏర్పాటు చేసినట్లు మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. మంథన్ అభిప్రాయాలు పంచుకోవడానికి అందరికీ ఓపెన్ ప్లాట్‌ఫాం అని తెలిపారు. - కాకి మాధవరావు, ఐఏఎస్(రిటైర్డ్ ) ఒక మైల్స్టోన్ నగరానికి మంథన్ ఒక మైల్స్టోన్ లాంటిది. తొమ్మిదేళ్లుగా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 150 మంది వరకు వ్యక్తలు పాల్గొన్నారు. వివిధ రకాల సభలు, సదస్సులు నిర్వహించాం. దేశంలోని సమస్యల గురించి విపులంగా, సూక్ష్మంగా విశ్లేషించేందుకు మంథన్ ఫౌండేషన్ సదస్సులు దోహదం చేస్తున్నాయి. - అజయ్ గాంధీ - కోన సుధాకర్‌రెడ్డి -
సేవే వ్యసనం
కాలేజీ.. పుస్తకాలు.. చదువు.. ఆటలూ.. పాటలు.. అంతేనా! ఇంకేమీ లేదా.. అని అనుకున్నారు ఆ స్టూడెంట్స్. ఫ్రెండ్స్.. జల్సాలు.. సినిమాలు.. షికార్లు.. ఇంతేనా! అని వారికి వారు ప్రశ్నించుకున్నారు. ఒక్కరా, ఇద్దరా.. ఇరవై మంది.. ఒక్కటయ్యారు. అద్భుతమైన ఆలోచనలకు రూపమిచ్చారు. సామాజిక సేవకు నడుంబిగించారు. సేవే వారి తోవ. ఆ వూర్గంలో పుట్టిందే ‘అడిక్షన్ ద స్టూడియో’. త్రినాథ్, సాహిత్య సాగర్... ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. ఐదేళ్ల క్రితం కలిశారు. త్రినాథ్ ఐదు సినిమాల్లో నటించాడు. సాహిత్య సాగర్ పది సినిమాలకు పాటలు, మాటలు రాశాడు. సేవాదృక్పథం కలిగిన వారి కోసం సోషల్ నెట్‌వర్క్‌లో వెతకగా ఇరవై మంది విద్యార్థులు, యువకులు తారసపడ్డారు. అందరూ కలిసి ఐదేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటర్ల జాగృతం దేశంలోని మహానగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్ మీద వీరు దృష్టి పెట్టారు. ఓటర్లను జాగృతం చేయాలనుకున్నారు. సాహిత్య సాగర్... ‘మళ్లీ వచ్చింది అవకాశం.. గొప్ప మార్పు తెచ్చేటి అవకాశం.. మన కోసం’ అంటూ ఐదు నిమిషాల పాట రాశాడు. దానికి త్రినాథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియావారు దాన్ని ఇటీవలి ఎన్నికల ముందు విపరీతంగా టెలికాస్ట్ చేశారు. పాటతో పాటు వీరు నటించిన విజువల్స్ ఓటర్లను హత్తుకున్నాయి. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అదే... ‘ఎడిక్షన్ ద స్టూడియో’. ధర్మో రక్షతి రక్షితః పేరుతో నిజాంపేట్‌లో వరలక్ష్మీవ్రతం, మహాలక్ష్మీ యాగ సహిత సుదర్శన హోమం నిర్వహించారు. మలేసియా టౌన్షిప్ సమీపంలోని చైతన్య రెస్టారెంట్వారు.. వీరి కార్యక్రమాల్లో ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. ‘చదుకున్నవారు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నవారు. అడిక్షన్ ద స్టూడియో. పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సేవ ద్వారా మంచి నడవడికకు అవకాశం ఉంటుంది. అందుకే మేం సపోర్ట్ చేస్తున్నాం’ అంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు కె.రామకృష్ణ, ఎస్.యుగంధర్. - కోన సుధాకర్ రెడ్డి ఎనర్జిటిక్‌గా ఆలోచించాలి సోషల్ నెట్ వర్క్‌లో కలిశాం. అడిక్షన్ ద స్టూడియో అభిప్రాయాలు తెలిసిన తర్వాత సపోర్ట్ చేయాలనిపించింది. అందులో మెంబరై ముందుకు సాగుతున్నా. మనుషులకు ఆత్మశుద్ధి.. సేవాతత్పరత ఉండాలి. అందుకే సేవలో నిమగ్నమయ్యాను. - సింధూరి కులక ర్ణి, ఎమ్మెస్సీ, సైకాలజీ ఫైనలియర్ యూత్ కలసి రావాలి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కలసి రావాలి. ఇది ఆరంభమే. సేవలో పునీతులు కావాలి. కలసి వచ్చేవారు inboxaddiction@gmail.com, లేదంటే 90599 99144, 99599 73999 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. - సాహిత్య సాగర్, త్రినాథ్ -
ఆర్గానిక్ స్వీట్స్
తీపి... శుభారంభానికి ప్రతీక. ఆ శుభారంభం ఆరోగ్యవంతమైనదిగా ఉండాలనుకుంటున్నారు హైదరాబాదీలు. ధర కొంచెం ఎక్కువైనా పర్లేదు.. రసాయనాలు, పురుగులమందుల అవశేషాలు లేని ప్యూర్ స్వీట్స్కే మా ప్రయారిటీ అంటున్నారు. అందుకే ఆర్గానిక్ స్వీట్స్‌కి డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే నగరంలో ఆర్గానిక్ స్వీట్ షాప్స్ వెలుస్తున్నాయి. - కోన సుధాకర్‌రెడ్డి కూరగాయలే కాదు... స్వీట్స్ కూడా ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నారు హైదరాబాదీలు. అందుకే ఇలాంటి స్వీట్స్ అందించేందుకు కొత్తగా పుట్టుకొస్తున్నాయి సరికొత్త షాపులు. 150కి పైగా.. 150 నుంచి 200 రకాల మిఠాయిలు ఆయా ఆర్గానిక్ స్వీట్ షాపుల్లో దొరుకుతాయి. గోందు కతేరం పానీయం, సబ్జ, మజ్జిగ, బాదంపాలు, మోతీచూర్ లడ్డు, కాజు కతిలి, వైట్ కలాకండ్, రస్మలైతో పాటు, బెల్లం, ఆర్గానిక్ నూనెలతో ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమే... కతేరా గోందు చెట్టుకు సంబంధించిన బంకను వేడి నీటిలో మరిగిస్తే జెల్ వస్తుంది. మరిగించిన సుగంధపాల వేర్ల రసాన్ని ఇందులో కలిపితే గోందు కతేరం పానీయం తయారవుతుంది. ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇక ఒక రకమైన తులసి విత్తనాలు బెల్లం నీళ్లల్లో నానబెట్టి సబ్జ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. శెనగ పిండి , రసాయనాలు లేని బెల్లంతో మోతి చూర్ లడ్డూ చేస్తారు. బాదం ఉడికించి పొట్టు తీసి, వేడి పాలల్లో కలిపి బాదంపాలు చేస్తారు. నేచురల్ కలర్స్.. కెమికల్స్‌తో తయారు చేసిన పర్మినెంట్ కలర్స్‌కు చోటు లేదిక్కడ. కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వుతో కేసరి కలర్ తయారు చేస్తుంటారు. అలాగే మిగతా రంగులు కూడా. మిఠాయిలపై ఉపయోగించే వెండి అద్దకం ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన పిండి పదార్థాలనే స్వీట్లల్లో వినియోగిస్తారు. కాగితంతో తయారు చేసిన క్యారీ బ్యాగులు, ఆకు దొన్నె కవర్లు మాత్రమే వాడతారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో.. ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్ పాలేకర్ సూచించిన పద్ధతిలో తయారు చేసిన బెల్లాన్ని మాత్రమే ఈ స్వీట్స్‌లో వాడతారు. గానుగ ద్వారా తీసిన పప్పు, నువ్వులు, కొబ్బరి నూనె తోనే స్వీట్స్ తయారు చేస్తారు. కనిపించేవన్నీ మంచివి కావు... కంటికి మంచిగా కనపడే స్వీట్స్ కొనే పద్ధతి నుంచి ప్రజలు బయటపడాలి. సిటీలో ఆర్గానిక్ స్వీట్ షాపులు చాలా ఉన్నాయి. అయితే అందరికంటే ముందే 1999లో మేము ఆర్గానిక్ స్వీట్ షాపు ప్రారంభించాము. 15 ఎకరాల్లో 60 దేశీయ ఆవులతో సౌభాగ్య గో సదన్ ఏర్పాటు చేశాం. మిఠాయిలకు అవసరమయ్యే పదార్థాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ పండిస్తాం. వినియోగదారుల అభిరుచిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఆర్గానిక్ స్వీట్స్దే హవా! - విజయరాం, ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఓనర్ -
పాటే నా ప్రాణం: కె.ఎస్.చిత్ర
చిట్‌చాట్: పద్మశ్రీ డాక్టర్ కె.ఎస్.చిత్ర.. పరిచయం అక్కరలేని సింగర్. శుక్రవారం ఆమె హైదరాబాద్‌కు విచ్చేశారు. ‘సిటీప్లస్’తో కాసేపు ముచ్చటించారు. విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘కేరళలోని తిరువనంతపురంలో 1963లో జన్మించాను. 1979లో ఎంజీ రాధాక్రిష్ణన్ నేతృత్వంలోని మలయాళ చిత్రం ‘అట్టహాసం’తో రంగప్రవేశం చేశాను. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. మలయాళం, తెలుగు, అస్సామీ, కన్నడ, ఒరియా, బెంగాలి, పంజాబీ, బడగ తదితర పది భాషల్లో పాడాను. దేశవిదేశాల్లో ఎన్నో సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా అవార్డులు పొందాను. 2005లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సాధనతో ఇదంతా సాధ్యమైంది. శ్రోతలను మెప్పించాను. లిటిల్ నైటింగేల్‌గా పేరొందాను. పాటకే నా జీవితం అంకితం. హైదరాబాద్‌కు చాలా కాలంగా వస్తున్నా. ఈ నగరంతో నాది విడదీయలేని అనుబంధం. ఆప్యాయతానురాగాలకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. ఆనందకరమైన వాతావరణం. వెలకట్టలేని తెలుగువారి అభిమానం నన్నెంతగానో మురిపిస్తాయి. రెండు రోజుల పర్యటన కోసం ఈసారి సిటీకి వచ్చా. శనివారం సాయంత్రం 6.30 గంటలకు శిల్పకళావేదికలో సంగీతవిభావరిలో పాల్గొంటున్నా. ఆదివారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో ‘త్రిశక్తి’ భక్తి ఆల్బమ్‌ను ఆవిష్కరించబోతున్నా..’ - కోన సుధాకర్‌రెడ్డి -
సేవ ఒక కళ
సుజాత వింజమూరి- కూచిపూడి నృత్యకారిణి కావాల్సినంత డబ్బు. అందరూ కలలు కనే అమెరికాలో నివాసం. విలాసవంతమైన జీవితం. ఆనందంగా బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? అయితే జన్మభూమికి సేవ చేయాలనే తపన ఆమెను నిలవనీయలేదు. అందుకే తనకు ఇష్టమైన నృత్య కళను కొనసాగిస్తూ.. ఆ కళలే నేపథ్యంగా దేశంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సుజాత వింజమూరి. కళారత్న బిరుదు అందుకున్న కూచిపూడి నృత్యకారిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. నృత్యంలోనే ఆనందం, శక్తి ఉన్నాయని నమ్మే సుజాత అంతరంగం ఆమె మాటల్లోనే.. భగవద్గీతలో ఏదో ఎనర్జీ ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని కొన్ని శాశ్వతం అని భ్రమపడతాం. కానీ ఏదీ శాశ్వతం కాదనే విషయం గీత తెలియజేస్తుంది. అందుకే భగవద్గీత నృత్యనాటికను ఎంచుకున్నా. నటరాజు బొమ్మను చూస్తాం. కానీ ఆ ఆకారానికి అర్థం తెలియదు. ఆ బొమ్మలో ఒక్కోదానికి ఒక్కో సందేశం ఉంది. ఆ సందేశాన్ని చెప్పాలనే నటరాజుఅంశంగా తీసుకున్నా. ఆయన త్రినేత్రుడు ఎందుకయ్యాడు, ఒకే భంగిమలో ఎందుకున్నాడు వంటి విషయాలన్నీ తెలియాలంటే నృత్యనాటికను చూడాల్సిందే. అమెరికాలో అకాడెమీ అమెరికాలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ ‘సెయింట్ లూయీ’ స్థాపించి 30 ఏళ్లు అయింది. ఎంతోమందికి నృత్యంలో శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం 100 మంది విద్యార్థులున్నారు. మా అకాడమీకి వచ్చే విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సేవాభావాన్ని అలవరుస్తాం. అలా తెలియజెప్పేందుకే ఈసారి 9మంది విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చాను. సేవే లక్ష్యంగా... ప్రతి ఏటా భారత్‌లో నాలుగు ప్రదర్శనలు చేస్తాం. అందులో రెండు చారిటీ కోసం. ఇప్పుడు హైదరాబాద్‌లో.. త్వరలో తిరుపతి, ఇతర నగరాల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నాం. ఇండియాలో గతంలో నిర్వహించిన ప్రదర్శనలకు వచ్చిన ఐదు లక్షలను ఢిల్లీలోని సలాం బాలక్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చాం. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న మహాత్ముడి సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా. దానికి కట్టుబడే ఈ సాయం చేయడం. అమెరికాలో చారిటీ కోసం అక్టోబర్. నవంబర్‌లో ప్రదర్శనలు నిర్వహిస్తాం. విదేశాల్లోనే గౌరవం.. మనది ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సంస్కృతి. విదేశాల్లోనే మన సంస్కృతి-సంప్రదాయాలకు గౌరవం ఎక్కువ. అమెరికాలో తెలుగుదనం వర్ధిల్లుతోంది. వెస్ట్రన్ కల్చర్‌లో ఉన్నా మన కల్చర్‌కు పెద్దపీట వేస్తున్నారు మనవాళ్లు. సంస్కృతి, సంప్రదాయలతో పాటు ఆధ్యాత్మికత వర్ధిల్లాలి. నా ఊపిరున్నంతవరకూ అందుకోసమే పనిచేస్తాను. - కోన సుధాకర్ రెడ్డి -
నా తెలంగాణ స్వచ్ఛంగా.. పాటలా.. తేటగా..
నవ తెలంగాణ: పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో.. కనిపించని కుట్రల.. అని గ్రామాల్లో జరుగుతున్న దుర్మార్గాలను, కనుమరుగు అవుతున్న పల్లె సంస్కృతిని చూసి బాధతో గొంతు పెకిలించినోడు ప్రజాకవి గోరటి వెంకన్న. తన గొంతు నుంచి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. గోరటి పాటలను భుజాన వేసుకుని జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు.. వేలల్లో ఉన్నారు.అలాంటి వెంకన్న.. నవ తెలంగాణ నిర్మాణంపై కోన సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రజల కల సాకారమైంది. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. ఇక కొత్త రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ పునర్నిర్మాణం జరగాలి. గ్రామీణ సంప్రదాయ కళా ైవె భవాలకు పునర్వైభవం తీసుకురావాలి. సెజ్‌ల పేరుతో తెలంగాణ గడ్డన భూములకు పడ్డ కంచెలు తొలగిపోవాలి. వివక్షకు అసలు కారణం భూమే కాబట్టి ఎవరికీ 20 ఎకరాలకు మించి ఉండకూడదు. భూమిలేనివారందరికీ ప్రభుత్వ భూమి ఇవ్వాలి. ప్రభుత్వమే చెరువులు తవ్వించాలి. అవసరం అనుకుంటే బోర్లు వేయించాలి. నీటి యాజమాన్యం పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి. అభివృద్ధి దిశగా ఆలోచించాలి. రెండు జీవనదుల మధ్యనున్న గడ్డ తెలంగాణ. సంపూర్ణంగా నీరు రావాలి. పెట్టుబడుల్లేని వ్యవసాయం, నీటి వాడకం తక్కువగా ఉన్న పంటలు రావాలి. పంటలు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలు ఈ రోజు నుంచి కొత్త తెలంగాణ రాష్ట్రం కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. లంచం తీసుకోబోమని, అవినీతి జోలికి వెళ్లబోమని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేయాలి. ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలి. అధికారులు అలసత్వం వీడాలి. తెలంగాణ స్వచ్ఛంగా, సంపూర్ణంగా ఉండాలి. పల్లెల బాగు కోసం.. సరళీకరణ ఆర్థిక విధానాలతో పల్లెల్లో చాలా మార్పులు వచ్చాయి. ఊహించని సదుపాయాలతోపాటు రాజకీయ దళారీ వ్యవస్థలూ వచ్చి చేరాయి. పల్లెలు బాగుపడాలంటే ఆదర్శవంతమైన ఉద్యమాలు రావాలి. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం మద్య నిషేధం చేయడంతోపాటు ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి. ప్రజలను పిప్పిచేస్తున్న వైద్య, విద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. పోలీసులు సోషల్ వర్కర్ల లాగా పనిచేయాలి. కుల వృత్తులను ఆధునికీకరించాలి. అప్పుడే తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి సిరిమల్లెచెట్లు మొలకెత్తుతాయి. విడిపోయిన మనమొక్కటే.. తెలంగాణ అంటే కరువు..కన్నీళ్లే. నీరు, కొలువుల విషయంలో బాగా అన్యాయం జరిగింది. ఇప్పుడు విడిపోయినా మంచిగానే విడిపోవాలి. భౌగోళికంగానే విడిపోతున్నాం తప్ప మన సంస్కృతి, జాతి ఒక్కటే కదా. ఇక సాంస్కృతికంగా తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. వలసవాదులు మొదట తెలంగాణ భాషపైనా, ఈ ప్రాంతపు సొగసులపైనా పడ్డారు. కళను మార్కెట్ చేసుకుని ఆ తర్వాత అందమైన తెలంగాణ సృజనాత్మకతను మింగేశారు. అందుకే.. ఆ పాట రాశా ఎందరో వలసవాద రాజకీయనేతలు, పెట్టుబడిదారులు ఇక్కడి వందలాది ఎకరాల పచ్చటి నేలను ఆక్రమించేశారు. ఉద్యోగాలను కొల్లగొట్టారు. మా తెలంగాణ బిడ్డలు యాడికిపోవాలి. వందలాది మంది మిసమిసలాడే మీసకట్టు కలిగిన యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు విడుస్తుంటే ఏమీ ఎరగని వారిలాగా ఆంధ్రావాళ్లు ఉంటే మాకు మండదా. అందుకే కడుపు మండి ‘పొమ్మంటే పోవేందిర ఓ ఆంధ్ర దొర’ అనే పాట రాశా. ఏ ఉద్యమానికైనా పాటే ఊపిరి పాటలేని ఉద్యమాన్ని ఊహించుకోలేం. ఆఫ్రికా జాతి ఉద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రజల పక్షాన నిలిచింది పాటే. ప్రగతీ శీల ఉద్యమాలకు ముందే పాట ఉంది. హింసకు, పెత్తనానికి, బాంచన్ దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పాటను ఆయుధంగా చేసుకున్నారు. ఆనందం, బాధ కలిగినప్పుడు పాట దానంతట అదే పుట్టుకొస్తుంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు పాట అనేకరకాలుగా దోహదం చేసింది. కోస్తాలో పౌరాణిక నాటకం, రాయలసీమలో తత్వ పద్యం, తెలంగాణలో జానపద పాటలు.. మూడు ప్రాంతాల్లో మూడు రకాలు. పల్లెనుంచి వచ్చాను కాబట్టే ఆ వాసన మాది మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని గౌరారం. మధ్యతరగతి కుటుంబం. నాలుగో తరగతి నుంచి పది వరకు రఘుపతిపేటలో, ఇంటర్ కల్వకుర్తిలో చదివాను. తల్లి ఈరమ్మ, తండ్రి నర్సింహ. టీచరు వెంకటరెడ్డి ప్రభావంతో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు కొంతకాలం మొగ్గాను. మా ఊరంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందరూ ఒకే కులంగా కలిసిమెలసి బతికేవారు. పల్లె నుంచి వచ్చిన వాణ్ణి కనుక నా పాటలో పల్లె వాసన ఉంటుంది. నిజాం రాక్షసత్వం, ప్రపంచీకరణ పరిస్థితులు చూశాను. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వామపక్షనేతల్ని, సర్వోదయ ఉద్యమాల్ని గమనించాను. దీంతో మనుషులంతా సమానం అన్న అభ్యుదయం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. 1985-86లో నీ పాట ఏమాయెరో అనే పాట రాశాను. సోషలిజం, సమానత్వం, సాటి మనిషికి సాయం చేయాలనేదే ఇప్పటికీ నా ఆలోచన. ఆ పార్టీ రాకముందే అన్యాయంపై పాటరాశా తెలంగాణపై మొత్తంగా 22పాటలు రాశా. సందర్భోచితంగా పాడినవి మరికొన్ని ఉన్నాయి. ‘రేలదూల తాలెల్లాడే తెలంగాణ నే’, తల్లి తెలంగాణ , ఎలమంద ఎలమంద, కంపతారు చెట్లు...ఇలా ఎన్నో రాశాను. పారుతున్న నదీజలాల పంపకంలో జరిగిన అన్యాయానికి మొగ్గతొడిగిన ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ రాకముందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పాట రాశా. బషీర్‌బాగ్ కాల్పులపై 12 పాటలు రాశాను. అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి ముందుగా వారి కుటుం బాలు బాగుపడాలి. ఇకనుంచి తెలుగు ప్రజల దుఃఖం గురించి పాడతా. వైఎస్ అభినందించారు నేను రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాట రాష్ట్రంలో ఓ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైందని చాలామంది అంటుంటారు. నిజానికి నాకైతే ఆ విషయం తెలియదు. 1996-97లో రాసిన ఆ పాటను ‘కుబుసం’ సినిమాలో వాడుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు ‘పార్టీ’ వాళ్లు ప్రకటనగా వాడుకున్నారు. అది అలా దోహదకారిగా అయిందని చాలామంది అప్పట్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడో రోజే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను, మరికొందరిని పిలిపించి అభినందించారు. నా ఊరే ప్రేరణ.. 1996-97లో ‘పల్లె కన్నీరు పెడుతుందో...’ అనే పాట రాశాను. దీనికి ప్రేరణ నా ఊరే. సంస్కరణల ప్రభావంతో ఊళ్ల నుంచి వలసలు మొదలైన కాలం. ప్రతి ఏటా మా ఊళ్లో మొహర్రం బాగా జరుగుతుంది. అలాంటిది ఆ ఏడాది మా ఊరికి పోతే ఊళ్లో జనాలే లేరు. రైతుల వ్యధలు, పల్లె ఉనికి కోల్పోతున్న వైనం నన్ను కదిలించింది. అదేపాటగా మారింది. ఆధునికతకు దూరమవుతున్న మనుషుల గురించి రాశాను. ఏ ఊళ్లో చూసినా కలవృత్తులు మూలనపడ్డాయి. ఒక సంవత్సర కాలం పట్టిందీ పాటకు. బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో నేనీ పాటను రాశా.