సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి.
నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది.
జీవితమే సినిమా రంగం..
నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది.
-కోన సుధాకర్‌రెడ్డి