Sanjay kishore
-
సావిత్రి తో షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో SVR ఏం చెప్పేవారంటే..
-
సినీ గ్లామరే కాదు.. గ్రామర్ ఉండాలి: వెంకయ్య నాయుడు
‘శక్తిమంతమైన ప్రచార, ప్రసార మాధ్యమం సినిమా. అలాగే, నేటికీ ప్రజలకు అత్యంత చౌకగా వినోదం అందించే సాధనమూ సినిమా. కానీ, నేటి సినిమాల్లో ఎక్కువగా గ్లామర్, అక్కడక్కడా హ్యూమర్ నిండి, అసలైన గ్రామర్ (చెప్పుకోదగ్గ విషయం) తక్కువగా ఉంటోంది. ఒకప్పటి సినిమాల్లా వినోదంతో పాటు, విజ్ఞానం, ఎంతో కొంత సందేశం ఉండేలా చూసుకోవడం సినీరంగం బాధ్యత’’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిశోర్ రూపొందించిన ‘స్వాతంత్య్రోద్యమం–తెలుగు సినిమా–ప్రముఖులు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ‘స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న పాత తరం సినీ ప్రముఖులపై ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ‘వరకట్నం, సతీసహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంచి ఇతివృత్తాలతో, సంభాషణలతో వచ్చిన సినిమాలు గతంలో విజయవంతమయ్యాయయని గుర్తు చేశారు.. అలాంటి మంచి సినిమాలు తీస్తే ఆడవనే మాట తప్పని ఆయన విశ్లేషించారు. ‘నేటి తరం గురువును మర్చిపోయి, గూగుల్‌ను చూస్తోందని.. గూగుల్ పాడైతే, దాన్ని బాగుచేయడానికి సాంకేతిక నిపుణుడనే గురువునే పిలవాలి. అది మర్చిపోకండని వెంకయ్య చమత్కరించారు. భాష, సంస్కృతి, రాజకీయ రంగాలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశమంటే మట్టి కాదు మనుషులే. పెద్దల్ని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, సర్వప్రాణులతో కలసి జీవించడం, ఉన్నది పదుగురితో పంచుకోవడం, తోటివారి పట్ల అక్కరచూపడం (షేర్ అండ్ కేర్) మన భారతీయ సంస్కృతికి మూలం. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా ఇదే మన సంస్కృతి. అంటే మన జీవనవిధానం. ఇవాళ రాజకీయాల్లోనూ విలువలు దిగజారిపోయాయి. ఇవాళ సభ అంటే బస్, బిర్యానీ, బాటిల్ అనే 3 బీ ఫార్ములా అనుసరించి జనాన్ని తరలిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాలు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ల స్థాయి తగ్గిపోయి, ప్రజాప్రతినిధుల భాష పతనమవుతున్న ధోరణిని ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. నేను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషువాడికి వ్యతిరేకం. మాతృభాషను పక్కనపెట్టేసి, పరాయిభాషను నెత్తినపెట్టుకొనే భావదారిద్య్రానికి వ్యతిరేకం. స్వాతంత్య్రానికి పూర్వం మన స్థూలజాతీయోత్పత్తి ప్రపంచంలో మూడోవంతు ఉండేది. కానీ, మనల్ని దోచుకువెళ్ళి, ఆనాడే అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసి ఎగుమతి చేసిన మనల్ని పనికిమాలిన, తెలివితక్కువవారనే అభిప్రాయంలో ఇవాళ్టికీ ఉంచేలా చేసిన పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకం. సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్ వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, పారిశ్రామికవేత్తలు వి. రాజశేఖర్, రాజు, జేవీ కృష్ణప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఎందరో సినీప్రముఖుల గురించి రాసిన ఈ పుస్తకావిష్కరణను సినీపరిశ్రమ చేసి ఉండాల్సింది’ అని రమణాచారి అభిప్రాయపడ్డారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ‘గతంలో దాదాపు ప్రతి సినిమాలో ప్రబోధాత్మక గీతం ఉండేది. ఒకప్పుడు దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్పవారున్నారు. ఇవాళ దేశాన్నే త్యాగం చేస్తున్న ప్రబుద్ధులు తయారయ్యారు. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి లాంటి ఒకరిద్దరి గురించే తెలుగులో సినిమాలొచ్చాయి. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగువారైన మరెందరో త్యాగధనుల గురించి సినిమాలు రావాలి’ అని అభిలషించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘వాస్తవాలను వక్రీకరించకుండా, చరిత్రను చెప్పే సినిమాలు రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా రమణాచారి ఇచ్చిన సలహా మేరకు ఎంతో శ్రమించి, ఈ పుస్తకం రాసినట్టు సంజయ్ కిశోర్ తెలిపారు. సురేఖామూర్తి, శ్రీమతి భూదేవి తదితర ప్రముఖ గాయనులు స్వాతంత్య్ర గీతాలాపన, అంబటిపూడి మురళీకృష్ణ వ్యాఖ్యానం సభను రక్తి కట్టించాయి. పలువురు సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. -
SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం
సినీ పరిశోధకునిగా, కళాసంస్థ నిర్వాహకుడిగా చాలా మంది సినీ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగే భాగ్యం, వాళ్ళ వ్యక్తిత్వాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగాయి. అయితే బాలు గారి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. పేరెన్నికగన్న గాయకుడిగా కీర్తి గడించినా ఎంతో ఒదిగి ఉండే తత్వం, స్థాయిలకు అతీతంగా అందరినీ గౌరవించే గుణం, నలుగురికీ సాయం చేసే దాతృత్వం, ఓర్పు, సహనంతో మెలగడం ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ‘సంగమం ఫౌండేషన్’ వ్యవస్థాపకుడిగా ఈ రెండు దశాబ్దాలలో నేను చేసిన అనేక కార్యక్రమాలలో బాలు గారు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల గారు కొన్నేళ్ళ క్రితం ‘పి.సుశీల ట్రస్ట్’ను నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా ఏటా ఒక సింగర్‌ని జాతీయ స్థాయి పురస్కారంతో గౌరవించాలని సంకల్పించారు. తొలి అవార్డును గాయని యస్. జానకి గారికి బహూకరించాలనుకున్నారు. అప్పుడు బాలు గారి కచేరీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. రవీంద్రభారతిలో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమం సాయంత్రం అనగా సౌండ్ సిస్టవ్‌ు చెక్ చేయడానికి ఉదయం పదకొండు గంటలకే బాలు గారు రవీంద్రభారతికి వచ్చారు. కొద్ది రోజుల ముందే లక్షలు ఖర్చుపెట్టి పెద్ద సౌండ్ సిస్టవ్‌ును రవీంద్రభారతి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ సిస్టవ్‌ును చెక్ చేసిన బాలు గారు నాదగ్గరకొచ్చి ‘సంజయ్ గారూ! సౌండ్ సిస్టమ్ ఓకే. కానీ కొత్త సౌండ్ సిస్టవ్‌ు కాబట్టి సౌండ్ ఆపరేటర్లకు ఆ సిస్టవ్‌ును ఆపరేట్ చేయడంలో ఇంకా పూర్తి పట్టు చిక్కినట్లులేదు. సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మేము, ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. రిస్క్ ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నా కచ్చేరీలన్నింటికీ రెగ్యులర్‌గా వాడే సౌండ్ సిస్టమ్‌నే పిలిపించుకుంటా’ అన్నారు. ‘అలాగే సర్’ అని, వారికి రెగ్యులర్‌గా వచ్చే సౌండ్ సిస్టమ్ వారినే పిలిపించి ఏర్పాట్లు చేశాం. అంతా బాగా జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలు గారి దగ్గర కెళ్ళి ‘సౌండ్ సిస్టమ్ వారికి పేమెంట్ ఎంత ఇవ్వాలి సార్’ అని అడిగాను. దానికి వారు ‘‘సంజయ్ గారూ! ‘రవీంద్రభారతి సౌండ్ సిస్టమే వాడతాంగా’ అని సౌండ్‌కు మీరు బడ్జెట్ వేసుకొని ఉండరు. సడెన్‌గా నేను వచ్చి ఆ సౌండ్ సిస్టమ్‌ను కాదని నాకు అలవాటున్న సౌండ్ సిస్టమ్‌ను తెప్పించుకుని దానికి మిమ్మల్ని పేమెంట్ ఇవ్వండని అడిగితే మీకెంత ఇబ్బంది! ఇప్పటికిప్పుడు మీరెక్కడి నుంచి తెస్తారు? ఏం ఫరవాలేదు. మీరేమీ ఇవ్వకండి, నేను చూసుకుంటా’’ అని చెప్పి వారే స్వయంగా వారి జేబులోంచి రూ. 15 వేలు తీసి సౌండ్ సిస్టమ్ వారికి ఇచ్చారు. నాకు నోట మాట లేదు. ఖర్చు పెట్టించేవారినే చూశా కానీ, ఏ సెలబ్రిటీ ఎదురు ఖర్చు పెట్టడం చూడలేదు. మరునాడు ఉదయం బాలు గారి హోటల్ రూమ్‌కి నేను, సుశీల గారు వెళ్ళాం. ‘బాలూ! నేను పాడమని అడగగానే వెంటనే ఒప్పుకుని పాడావు. ఇంత ఇమ్మని ఏమీ అడగకుండానే వచ్చి పాడావు. ఇపుడే ట్రస్ట్ ప్రారంభించాం. ఇది నీ స్థాయి రెమ్యూనరేషన్ కాకపోయినా అభిమానంతో ఇస్తున్నా ఈ యాభై వేలుంచు’ అన్నారు సుశీల. వెంటనే బాలు చిరుకోపాన్ని ప్రదరిస్తూ, ‘అమ్మా! మీ పాటలు వింటూ పెరిగినవాణ్ణి. మీ పక్కన పాడడంతోనే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. అలాంటి మీరు ఒక ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మా వంతు సహకారం అందించాలి గాని మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి! ఇంకెప్పుడూ ఇలా చేయకండి’ అని తన చేతికిచ్చిన డబ్బుల కవర్‌ను సుశీల గారికిచ్చేసి, ఆమె కాళ్ళకు నమస్కరించారు. అప్పట్లో ఉడుత సరోజిని అని సీనియర్ సినీ గాయనికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా సంస్థ తరఫున సన్మానించి, కొంత నగదు ఇచ్చాం. నెల ముందే బాలు గారిని సంప్రతించి, ఆహ్వానించాం. ‘అదే రోజు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది. రాలేను సారీ’ అన్నారు. సరోజిని గారి సన్మానం రోజున మా ఏర్పాట్ల హడావిడిలో మేముండగా సడెన్‌గా బాలు గారి నుండి ఫోన్. ‘‘కార్యక్రమం బాగా చేయండి. నేను రాలేకపోతున్నానని బాధగానే ఉంది. అయినా నా మిత్రుడు మురళితో ఓ పాతిక వేలు పంపిస్తున్నా. సరోజిని గారికి నా నమస్సులు తెలియజేసి ఆ మొత్తాన్ని వారికి అందజేయండి’’ అని కోరారు. ఎంతో బిజీగా ఉండే బాలుగారు, వారు రాలేకపోయినా, నెల తర్వాత జరిగే ప్రోగ్రావ్‌ు తేదీని గుర్తుపెట్టుకొని, తన సీనియర్ గాయని కోసం బాధ్యతగా పాతిక వేలు పంపడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయా. హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయా. ప్రముఖ సితార్ విద్వాంసులు జనార్దన్ మిట్టా అంటే బాలు గారికి ప్రత్యేకాభిమానం. తను పాడిన తొలి చిత్రం నుండి అనేక వేల చిత్రాలలోని పాటలకు సితార్ వాయించిన జనార్దన్ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదని బాలు గారి భావన. జనార్దన్ గారు పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో వారికో ఘన సన్మానం చేసి గౌరవించాలనుకున్నారు బాలు. ఆ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేయమన్నారు. అప్పుడే వరసగా మూడు ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాము. మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ అంటే స్పాన్సర్స్ కష్టమేమో అని తటపటాయిస్తూ వారికి విషయం చెప్పా. బాలు వెంటనే అప్పటికప్పుడు తనకు తెలిసిన వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి, స్పాన్సర్ చేయించారు. కార్యక్రమం ముందురోజు బాలుగారు నాకు ఫోన్ చేసి ‘‘ఏమండీ! జనార్దన్ గారు పెద్దవారు, వారిని మామూలుగా సత్కరించి వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే స్వర్ణకంకణం తొడిగి గౌరవిద్దామనుకుంటున్నా. చెన్నైలో పనుల ఒత్తిడిలో ఉన్నాను. కంకణం కొనే టైమ్ లేదు. ఏమీ అనుకోకుండా ఓ లక్ష రూపాయల్లో మంచి స్వర్ణకంకణం మీరు నా తరఫున షాపింగ్ చేయండి’’ అన్నారు. నా దగ్గరున్న డబ్బుతో స్వర్ణకంకణం కొన్నాను. కార్యక్రమం రోజు బాలు దంపతులు తమ ఖర్చులతోనే విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతికి రాగానే రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లాను. కారు దిగుతూనే స్వర్ణకంకణం కోసం నేను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు నా చేతిలో పెట్టేశారు. అంత పకడ్బందీగా ఉంటారు బాలు గారు. బాలు గారు అంత ఘనమైన సత్కారాన్ని తనకు చేయించడంతో సంతోషంలో సితార్ జనార్దన్ గారికి వేదికపైనే ఆనందభాష్పాలు రాలాయి. ఓ సాటి కళాకారుడిని ఇంత ఘనంగా గౌరవించే మనసు ఎంతమందికి ఉంటుంది! ఇలా ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా, బాలు గారి లాంటి వ్యక్తులు అరుదు. విశిష్ట వ్యక్తిత్వం వారి సొత్తు. అమరగాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో తన సొంత ఖర్చులతో నెలకొల్పారు బాలు. అలాగే, నెల్లూరులో తమ సొంత ఇంటిని వేద పాఠశాల నిమిత్తం కంచి కామకోటì పీఠానికి డొనేట్ చేశారు. మిత్రులెందరినో ఆపదలో ఆదుకున్నారు. లెక్కలేనన్ని గుప్తదానాలు చేశారు. 2020 ఫిబ్రవరిలో చెన్నైలో బాలు గారిని వారింట్లో కలిసినప్పుడు ‘త్వరలో హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు టైమ్ తీసుకుని మీ ఆఫీసు కొచ్చి తెలుగు సినిమాపై మీరు సేకరించిన కలెక్షన్స్ అన్నింటినీ తీరిగ్గా చూస్తా. ఏయన్నార్, యస్వీఆర్లపై మీరు వేసిన ఫోటో బయోగ్రఫీ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. ఆ తరహాలో నా మీద కూడా ఒక పుస్తకాన్ని ప్లాన్ చేయాలి. అది కూడా మీతో అప్పుడు చర్చిస్తాను’ అన్నారు. అవేమీ జరగకుండానే కరోనా మహమ్మారి బారిన పడి 2020 సెప్టెంబర్ 25న బాలు ఈ లోకాన్ని వీడారు. వారితో పాటే నిబద్ధత, సమర్థత, విధేయత, మంచితనం, మానవత్వం కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది. – సంజయ్ కిషోర్, ప్రముఖ సినీ పరిశోధకులు నేడు యస్పీబీ స్వరనీరాజనం యస్పీబీ 75వ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు. -
మహానటుడు ఎస్వీ రంగారావు పుస్తకావిష్కరణ
-
తెలుగువాడిగా పుట్టడం అదృష్టం
‘‘నేను అభిమానించే నటుల్లో ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ ముఖ్యులు. వారి నటన సహజంగా ఉంటుంది. ఎస్వీఆర్ నటునిగా ఒక ఎన్సైక్లోపీడియా’’ అని నటుడు చిరంజీవి అన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటునిగా చిర కాలం గుర్తుండిపోయె నటుడు ఎస్వీ రంగారావు. ఆయనపై రచయిత, జర్నలిస్ట్, ‘సంగం’ అకాడమీ వ్వవస్థాపకుడు సంజయ్‌కిషోర్ రచించిన ‘మహానటుడు’ పుస్తకాన్ని చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానటుడు’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే పుస్తకం రచించడం ఆషామాషీ కాదు. ఎంతో నిబద్ధతతో చేయాల్సిన పని. ఎస్వీఆర్గారిపై నాకు అంత అభిమానం కలగటానికి కారణం మా నాన్నగారు. ఆయనకి నటనంటే ఎంతో ఇష్టం. అప్పట్లో ఆయన డ్రామాలు వేస్తూ ఉండేవారు. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా అప్పటి ఆర్థిక స్తోమత దృష్ట్యా చేయలేక పోయారు. కానీ నాన్నగారు బాపట్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ‘జగత్ కిలాడీ’, ‘జగత్జంత్రీలు’ సినిమాల్లో ఎస్వీఆర్‌గారితో నటించే అవకాశం మా నాన్నకు వచ్చింది. అది ఆయన చేసుకున్న అదృష్టం. షూటింగ్ నుండి నాన్న ఇంటికి వచ్చిన తర్వాత.. సెట్లో ఎస్వీఆర్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నటిస్తారు? అని చెప్పేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద నాకున్న అభిమాన బీజాన్ని నాన్నగారే వేశారేమో. రామ్‌చరణ్ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎస్వీఆర్‌గారి గురించి చెప్పి, ఆయన సినిమాలు చూపించేవాడిని. మానాన్న గారి దగ్గరి నుండి నేను, నా నుంచి రామ్‌చరణ్ ఎస్వీఆర్‌గారి నుంచి స్ఫూర్తి పొందాం. అలాంటి మహానటుడు, గొప్పనటుడు తెలుగు వాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. నేను నటుడు కావటానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని ఒక్కసారి కూడా నేను చూడలేకపోయానే, ఒక్క ఫొటోగ్రాఫ్ కూడా లేదే అనేది తీరని కోరికగా మిగిలింది. అలాంటిది ఆయనపై వచ్చిన ఈ çపుస్తకాన్ని ఆవిష్కరించటంతో ఆ బాధ తీరింది’’ అన్నారు. కాగా ‘మహానటుడు’ తొలి ప్రతిని హరనా«ద్‌బాబు లక్షా వేయి నూటపదహారు రూపాయలకు కొనుగోలు చేశారు. నటులు రావికొండలరావు, రోజారమణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీతో పాటు, కిమ్స్ హాస్పిటల్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య, మండలి బుద్ధ ప్రసాద్, ఎస్పీ రంగనా«ద్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలో దాచుకునేలా మహానటుడు
‘‘సావిత్రిగారు, యస్వీ రంగారావుగారు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. నా కాలేజీ రోజుల్లో యస్వీ రంగారావుగారి మీద ఆర్టికల్ రాస్తూ రిఫరెన్స్ కోసం మార్కెట్లో ఏదైనా బుక్ ఉందా అని చూస్తే ఎక్కువ మెటీరియల్ దొరకలేదు. దాంతో కసితో ఆయన గురించి రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. దాదాపు 5 ఏళ్ల శ్రమతో యస్వీ రంగారావుగారి మీద సమగ్రమైన ఫొటో బయోగ్రఫీ తీసుకువస్తున్నాను’’ అన్నారు సంజయ్ కిషోర్. విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ‘మహా నటుడు’ పేరుతో ఫొటో బయోగ్రఫీగా ఆవిష్కరించబోతున్నారు సంజయ్ కిషోర్. ఈ పుస్తకం నేడు హైదరాబాద్‌లో చిరంజీవి విడుదల చేస్తున్నారు. పుస్తక రూపకల్పన వెనక ఉన్న కథను ఆయన పంచుకున్నారు. ‘‘ఇండియాలో ఫొటో బయోగ్రఫీని పూర్తిస్థాయిలో తీసుకొచ్చింది మేమే. అప్పట్లో మార్కెట్లో కొన్ని ఫొటోబయోగ్రఫీలు ఉన్నప్పటికీ ఇంత సమగ్రంగా లేవు. చిన్న కాఫీ టేబుల్ బుక్స్‌లా ఉన్నాయి అంతే. కాలేజీ రోజుల్లో యస్వీ రంగారావుగారి మీద ‘విశ్వనట చక్రవర్తి’ అనే బుక్ రాశాను. దాన్ని గుమ్మడిగారు రిలీజ్ చేశారు. ఆ తర్వాత యస్వీఆర్గారి ఫొటో బయోగ్రఫీ వేసే పనులు మొదలుపెట్టాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు ‘నా పుస్తకం కూడా వేయకపోయావా’ అనడంతో ‘మన అక్కినేని’ పుస్తకం రూపొందించాం. ‘విశ్వనట చక్రవర్తి’ పుస్తకం రాసే సమయంలో కలెక్ట్ చేసిన ఫొటోలు, ఆ తర్వాత ఈ బుక్ కోసం ఓ రెండేళ్లు మొత్తం 5 ఏళ్ల వర్క్ చేశాను. యస్వీఆర్, సినీ అభిమానులంతా తమ లైబ్రరీలో దాచుకునే పుస్తకంలా మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. -
3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్‌గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు. -
మన అక్కినేని... మన కళ్లకు కట్టినట్లు!
‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో చక్కటి పుస్తకాన్ని సంజయ్ కిశోర్ తీసుకు రావడం చాలా సంతోషం’’ అన్నారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ రచించి, సేకరించి, రూపొందించిన ‘మన అక్కినేని’ ఫొటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ వేడుకకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మన కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో చూపించారు. ఏయన్నార్ గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ ప్రజలంతా చూసుకునే అవకాశాన్ని ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్ కిశోర్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి -
అపురూపం: ఒకే ఒక మాయాబజార్
తెలుగు సినిమా పుట్టి ఎనభై సంవత్సరాలు పూర్తయ్యాయి! ఇన్ని సంవత్సరాలలో... అన్ని తరాల వారికి నచ్చిన చిత్రం అన్ని వయసులవారు మెచ్చిన చిత్రం ఏదైనా ఉందంటే, అది ‘మాయాబజార్’ ఒక్కటే! భారీ తారాగణంతో, భారీ సెట్స్‌తో, దాదాపు 30 లక్షల బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషలలో విజయ ప్రొడక్షన్స్‌వారు అందించిన దృశ్యకావ్యం ఈ మాయా బజార్! అన్ని విధాలా భారీగా తీస్తున్నాము. హిట్టవుతుందా అని మథనపడ్డారట అందరూ. హిట్టయ్యింది! ఎంత హిట్టంటే... తెలుగు సినిమా ఇంతవరకూ ఎప్పుడూ చూడనంత! ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు...’ పాట చిత్రీకరణప్పుడు ఘటోత్కచుడు పాత్రధారి ఎస్వీ రంగారావు దగ్గర లైటింగ్ ఎక్స్‌పోజర్‌ని చెక్ చేసుకుంటున్న ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే (పైన). సినిమాలో శశిరేఖ పాత్రధారి సావిత్రిపై ‘నీవేనా నను తలచినది...’ పాటను చిత్రీకరిస్తున్నప్పటి స్టిల్ ఇది (కుడి). సావిత్రి అభినయిస్తుండగా దర్శకుడు కె.వి.రెడ్డి (కుర్చీలో), ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే తదితరులు పరిశీలిస్తున్న అపురూపమైన స్టిల్ ఇది! ఇక ఈ సినిమాలో ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’ పాటను రేలంగి (లక్ష్మణ కుమారుడు) సావిత్రి వెంటపడుతూ పాడగా సావిత్రి ‘దూరం దూరం..’, ‘పెద్దలున్నారు...’ వంటి చిన్న చిన్న మాటలు పాట మధ్యలో అంటుంది. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల (ఎడమ చివర), కె.వి.రెడ్డి (ఎడమ నుంచి నాలుగో వ్యక్తి) తదితరులు సావిత్రితో రిహార్సల్స్ చేయిస్తున్న దృశ్యం ఇది (ఎడమ). ప్రేక్షకులు 1957లో తొలిసారి ఈ సినిమాని చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు! మునుముందూ చూస్తారు!! అంతేముందీ మాయాబజార్లో!!! నటీనటుల అందమా... వారి అభినయమా... కథా... కథనమా... సెట్టింగులా... లైటింగులా... మాటలా... పాటలా... ఏం బాగుంటాయి ఈ సినిమాలో? అన్నీ బాగుంటాయి! అవును... నిజంగా... అన్నీ బాగుంటాయి! అందుకే... ‘మాయా బజార్’ అంత బాగుంటుంది!!! నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com -
అపురూపం: స్టార్ డైరెక్టర్స్...
యాక్షన్... చెప్పింది చేయడం! డెరైక్షన్... చెప్పి చేయించుకోవడం!! కొందరికి యాక్షన్ ఈజీ! ఇంకొందరికి డెరైక్షన్ ఈజీ! చాలా కొద్దిమందికే రెండూ ఈజీ! ఎన్టీఆర్, భానుమతి, సావిత్రి, ఎస్.వి.రంగారావు... నటులుగా ఈ నలుగురూ ఆ రోజుల్లో అద్భుతాలు చేసినవారే! అటు దర్శకులుగా కూడా విజయాలు చవిచూసినవారే! ఈ తరానికి ఈ సంగతి అంతగా తెలీకపోవచ్చు. పెద్ద స్టార్ దర్శకత్వం వహించడమన్నది భానుమతితోనే ప్రారంభం! 1953లో ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దర్శకత్వం వహించి సంచలనం రేపారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ స్టిల్ ఇది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అసాధ్యురాలు’... వంటి 8 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు ‘సీతారామకళ్యాణం’ చిత్రం తో మొదలుపెట్టి, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలో అభిమన్యుడి పాత్రధారి అయిన తనయుడు బాలకృష్ణకు తనకు కావలసిన విధంగా మేకప్‌ను సరిదిద్దుతున్న స్టిల్ ఇది. ఇక 1967, 68 - ఈ రెండు సంవత్సరాలలో ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎస్.వి.రంగారావు. ‘బాంధవ్యాలు’ చిత్రం షూటింగ్లో కెమెరా యాంగిల్‌ను చూసుకుంటున్న ఎస్.వి.రంగారావు. మహానటి సావిత్రి 1968-72... ఈ ఐదేళ్ల కాలంలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘చిన్నారి పాపలు’, ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’... ఈ నాలుగు తెలుగు చిత్రాలకు, ‘కుళందై ఉళ్ళం’, ‘ప్రాప్తం’ అనే రెండు తమిళ చిత్రాలనూ దర్శకత్వం వహించారు. ‘చిరంజీవి’ చిత్రం సెట్‌పై నటులు ప్రభాకరరెడ్డి, చలంలకు సూచనలు ఇస్తున్న సావిత్రి! ఆ రోజుల్లో క్షణం తీరిక లేని స్టార్స్ వీరు! అయినా... దర్శకత్వం వహించారు. కారణం... దర్శకత్వంపై ఉన్న ఇష్టం! అసలు ‘సినిమా’ అంటేనే వారికి ఇష్టం. అందుకే... నటించారు... నిర్మించారు... దర్శకత్వం వహించారు... వెళ్లిపోయారు! ‘సినిమా’ అనే కారణం కోసం పుట్టారు! కారణం పూర్తవగానే వెళ్లిపోయారు! కారణజన్ములు వాళ్లు! - నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com -
అపురూపం 6: మొదలు.. సావిత్రి - కమల్ హాసన్
మహానటి సావిత్రి... ఆమె పక్కన చిన్నారి కమల్‌హాసన్... అవును... మన కమల్‌హాసనే! కమల్ బాలనటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారన్న సంగతి చాలామందికి తెలీదు! ఆ చిత్రం పేరు ‘కళత్తూర్ కణ్ణమ్మ’ (1960) తమిళంలో వచ్చిన ఈ చిత్రంలో సావిత్రి, జెమినీ గణేష్‌ల కొడుకుగా కమల్ నటించాడు. అప్పుడు సావిత్రి టైమ్ నడుస్తుంది! తెలుగు, తమిళంలో ఆమే నంబర్ వన్. దక్షిణాది మహానటిగా ఓ వెలుగు వెలుగుతోంది! సావిత్రి పక్కన వేషమంటే ఆషామాషీ కాదు. అయినా ఆమె చూపిన చొరవతో సునాయాసంగా నటించి, మంచి మార్కులు కొట్టేశాడు మూడేళ్ల కమల్. తుది కమల్ పెద్ద హీరో అయ్యాడు. సావిత్రి టైమ్ అయిపోయింది. జీవితంలోని ఆటుపోట్ల వల్ల ఆమె అన్నివిధాలా సన్నపడింది. క్యారెక్టర్ రోల్స్‌కి మారింది. అవసరార్థం చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. కారణాలు అనేకం! అలా ఓ చిన్న పాత్రలో అదే కమల్‌హాసన్ నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుద విలక్కుమ్’ తమిళ చిత్రంలో నటించింది! తొలి స్టిల్‌లో నిండుగా, అందంగా ఉన్న సావిత్రిని చూసి... మలి స్టిల్‌లో నీరసించి కళ తప్పిన సావిత్రిని చూస్తే, ‘ఈమె మన సావిత్రేనా?’ అనిపిస్తుంది. 1979లో ఈ సినిమా విడుదలైంది. 1981లో సావిత్రి పరమపదించింది. ఇన్నేళ్లయినా సావిత్రిని, ఆమె నటనను మనమెవరూ మరచిపోలేదు! కమల్‌హాసన్ కూడా! ఇప్పటికీ మీ అభిమాన నటీమణి ఎవరు అని అడిగితే ఆయన చెప్పే పేరు ‘మహానటి సావిత్రి’! - నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com