యాక్షన్... చెప్పింది చేయడం!
డెరైక్షన్... చెప్పి చేయించుకోవడం!!
కొందరికి యాక్షన్ ఈజీ! ఇంకొందరికి డెరైక్షన్ ఈజీ!
చాలా కొద్దిమందికే రెండూ ఈజీ!
ఎన్టీఆర్, భానుమతి, సావిత్రి, ఎస్.వి.రంగారావు... నటులుగా ఈ నలుగురూ ఆ రోజుల్లో అద్భుతాలు చేసినవారే! అటు దర్శకులుగా కూడా విజయాలు చవిచూసినవారే! ఈ తరానికి ఈ సంగతి అంతగా తెలీకపోవచ్చు.
పెద్ద స్టార్ దర్శకత్వం వహించడమన్నది భానుమతితోనే ప్రారంభం! 1953లో ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దర్శకత్వం వహించి సంచలనం రేపారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ స్టిల్ ఇది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అసాధ్యురాలు’... వంటి 8 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.
ఎన్.టి.రామారావు ‘సీతారామకళ్యాణం’ చిత్రం తో మొదలుపెట్టి, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలో అభిమన్యుడి పాత్రధారి అయిన తనయుడు బాలకృష్ణకు తనకు కావలసిన విధంగా మేకప్‌ను సరిదిద్దుతున్న స్టిల్ ఇది.
ఇక 1967, 68 - ఈ రెండు సంవత్సరాలలో ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎస్.వి.రంగారావు. ‘బాంధవ్యాలు’ చిత్రం షూటింగ్‌లో కెమెరా యాంగిల్‌ను చూసుకుంటున్న ఎస్.వి.రంగారావు.
మహానటి సావిత్రి 1968-72... ఈ ఐదేళ్ల కాలంలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘చిన్నారి పాపలు’, ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’... ఈ నాలుగు తెలుగు చిత్రాలకు, ‘కుళందై ఉళ్ళం’, ‘ప్రాప్తం’ అనే రెండు తమిళ చిత్రాలనూ దర్శకత్వం వహించారు. ‘చిరంజీవి’ చిత్రం సెట్‌పై నటులు ప్రభాకరరెడ్డి, చలంలకు సూచనలు ఇస్తున్న సావిత్రి!
ఆ రోజుల్లో క్షణం తీరిక లేని స్టార్స్ వీరు! అయినా...
దర్శకత్వం వహించారు.
కారణం... దర్శకత్వంపై ఉన్న ఇష్టం!
అసలు ‘సినిమా’ అంటేనే వారికి ఇష్టం.
అందుకే... నటించారు...
నిర్మించారు... దర్శకత్వం వహించారు...
వెళ్లిపోయారు!
‘సినిమా’ అనే కారణం కోసం పుట్టారు!
కారణం పూర్తవగానే వెళ్లిపోయారు!
కారణజన్ములు వాళ్లు!
- నిర్వహణ: సంజయ్ కిషోర్
sanjjaykkishor@gmail.com
అపురూపం: స్టార్ డైరెక్టర్స్...
Published Sun, Dec 1 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement