బలవన్మరణం
ఏడాది క్రితమే ప్రేమ వివాహం
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో మనస్తాపం
నాగర్‌కర్నూల్ జిల్లా జిన్‌కుంటలో విషాదం
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్‌కుంటలో చోటుచేసుకుంది.
అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్‌కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సీఐ రవీందర్, ఏఎస్‌ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.
ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment