పురుగు మందు తాగేందుకు భయపడి వెనకడుగు వేసిన తండ్రి
ఏబూడిదపాడులో విషాదఛాయలు
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.
పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.
తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్‌ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment