ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
కొత్తకోట రూరల్: భార్యను కాపురానికి రమ్మని భర్త అడగడంతో నిరాకరించిన ఆమె గాఢనిద్రలో ఉన్న భర్తపై గుర్తుతెలియని రసాయనిక పదార్థం పోసి నిప్పటించింది. దీంతో తీవ్రగాయాల పాలైన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ ఆనంద్ కథనం ప్రకారం.. ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల గ్రామానికి చెందిన గోటు మహేష్(32)కు ఎనిమిదేళ్ల క్రితం కొత్తకోట మండలం సత్యహళ్లి గ్రామానికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ కవల పిల్లలు ఉన్నారు. మహేష్ కొంతకాలంగా సత్యహళ్లిలోనే ఉంటూ కొత్తకోటలో మేసీ్త్ర పనిచేస్తుండేవాడు.
ఇటీవల భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారు. కుటుంబ కలహాలతో ఇబ్బందులకు గురైన మహేష్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో మహేష్‌కు అప్పులు ఎక్కువ కావడంతో మేస్త్రి పనిచేసేందుకు 9 నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. మహేశ్వరి మాత్రం పిల్లలతో కలిసి సత్యహళ్లిలోనే ఉంటుంది. 20 రోజుల క్రితం పిన్నంచర్ల గ్రామానికి చేరుకుని భార్యను తన వెంట హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ఆమెను ఒప్పించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అందుకు మహేష్ కుటుంబ సభ్యులు మహేశ్వరి దగ్గరకు వచ్చి హైదరాబాద్ వెళ్లాలని పెద్ద మనుషులు సూచించినా ఆమె ఒప్పుకోలేదు. పైగా మహేష్ అంటే ఇష్టం లేదని, అతనికి విడాకులు ఇస్తానడంతో అందుకు ఆమె తల్లిదండ్రులు వారించి కాపురాన్ని కొత్తకోటకు మార్చారు.
ఆదివారం మధ్యాహ్నం మహేష్ గాఢ నిద్రలో ఉన్నాడని గమనించిన మహేశ్వరి భర్తపై ఏదో లిక్విడ్ జల్లి నిప్పంటించింది. అంతటితో ఆగక మహేష్ సోదరుడు సురేష్‌కు ఫోన్ చేసి మీ అన్న నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పింది. తీవ్ర గాయాలైన మహేష్‌ను స్థానికులు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేష్‌ను తమ్ముడు సురేష్ ఎలా జరిగిందని వివరాలు అడిగి తెలుసుకుని ఫోన్లో రికార్డ్ చేశాడు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై మహేష్ తమ్ముడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేశ్వరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment