చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లికి లోకం తెలియదు. ఇద్దరు చెల్లెళ్లకు ఊహే తెలియదు. తల్లి కోర్టు చుట్టూ తిరుగుతోంది. తిరుగుతోంది.. తిరుగుతోంది. భానుమతి పెద్దయ్యే వరకు.. ‘పరిహారం’ ఆ ఇంటి దరి చేరలేదు! ఆ పేదింటి భానుమతే.. జస్టిస్ భానుమతి. ‘సుప్రీం’ జడ్జిగా నిన్న రిటైర్ అయ్యారు.
జూలై 20 జస్టిస్ ఆర్. భానుమతి పుట్టిన రోజు. నేడు ఆమె 66 ఏళ్ల వయసులోకి ప్రవేశించారు. నిన్ననే సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. మూడు రోజుల ముందే.. శుక్రవారం ‘వర్చువల్’గా జరిగిన వీడ్కోలు సమావేశంలో జడ్జిగా తన ముప్పై ఏళ్ల అనుభవంలో ‘అకారణమైన అవరోధాలు అనేకం’ ఎదురైనట్లు చెప్పారు. బహుశా అవి తర్వాత ఎప్పుడైనా పుస్తకంగా రావచ్చు. వీడ్కోలులో మాత్రం ఆ అవరోధాల గురించి ఆమె మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థలోని అనివార్యమైన జాప్యానికి తను, తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లు బాధితులైన ఒక విషయాన్ని మాత్రం పంచుకున్నారు. భానుమతికి ఊహ తెలుస్తున్నప్పుడు న్యాయం కోసం తన తల్లి చేసిన పోరాటాన్ని కళ్లారా చూసిన రోజులు అవి. భానుమతి ‘లా’ చదవడానికి ఆ పోరాటం ఒక ప్రేరణగా పనిచేసి ఉండొచ్చు.
జస్టిస్ భానుమతిని మరొక రకంగా కూడా గుర్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్భయ కేసు దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయడంలో న్యాయపరమైన అడ్డంకులు తలెత్తుతున్నందున వారిని ఎవరికి వారుగా ఉరి తీయడానికి అనుమతించమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి, నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న ఆదేశాలను ఇస్తూ.. కళ్లు తిరిగి పడిపోయిన జడ్జి.. భానుమతే. అయితే అది ఆమె బేలతనానికి చిహ్నం కాదు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల అలసటలోంచి వచ్చిన తూలిపాటు.
వాస్తవానికి 2014లో ఆమె సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చిన నాటి నుంచి, నలుగురు దోషులకు మార్చి 20 ఉదయం ఉరి శిక్ష అమలయే ముందరి గంట వరకు నిర్భయ కేసులో వాదోపవాదాలు విన్న ధర్మాసనంలో జస్టిస్ భానుమతి ఉన్నారు. ‘ఎ గ్రేట్ జడ్జ్’ అంటారు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ఆమెను. ఇక సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యుంత్ దావే అభిప్రాయంలోనైతే.. ‘ఎ ఫియర్స్‌లీ ఇండిపెండెంట్ జడ్జ్’! దేనినైనా విభేదించవలసి వస్తే జస్టిస్ భానుమతి ఏమాత్రం సంశయించరని దావే తరచు చెబుతుంటారు. భానుమతి దైవ నిర్ణయం అనే భావనను బలంగా విశ్వసిస్తారు. ‘‘జీసెస్ మనకు ఏదైనా రాసి పెట్టి ఉంటే, దానినిక ఎవరూ మార్చలేరు’’ అని.. వీడ్కోలు సమావేశంలో చెప్పారు ఆమె. హిందూ కుటుంబం ఉంచి వచ్చిన భానుమతి చిన్నతనంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.
భానుమతికి బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి బస్సు ప్రమాదంలో చనిపోయారు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లుండేది తమిళనాడులోని ఉతంగరై అనే చిన్న గ్రామంలో. బంధువులు లేరు. తెలిసినవారు లేరు. తండ్రి స్నేహితులు నష్టపరిహారం కోసం భానుమతి తల్లి చేత కోర్టులో కేసు వేయించారు. ఆ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఏళ్ల పాటు భానుమతి తల్లిని కోర్టు చుట్టూ నడిపించింది. నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ‘డిక్రీ’ ఇచ్చినప్పటికీ ఆ పరిహారం అందడానికి పిల్లలు పెద్దవాళ్లు అవవలసి వచ్చింది. ఆ ప్రత్యక్ష అనుభవం భానుమతిని ‘లా’ వైపు మళ్లించినట్లుంది. చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ ప్రభుత్వ ‘లా’ కళాశాలలో చదివారు.
ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సుప్రీం కోర్టు వరకు ఎదిగారు. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఇప్పుడు చాలా నయం. కేసు ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోడానికి ఉంటోంది. టెక్నాలజీ వచ్చాక కేసు ఎంత వరకు వచ్చిందీ, కేసులో ఏం జరుగుతోంది అనే సమాచారం అందుబాటులో ఉంటోంది’’ అని అన్నారు జస్టిస్ భానుమతి.
ఈ కోవిద్ సమయంలో ప్రత్యక్ష కోర్టు విచారణలపై కూడా ఆమె నిస్సంకోచంగా తన అభిప్రాయం చెప్పారు. జడ్జిల కమిటీ నిర్ణయం ఎలాంటిదైనా.. కోర్టుకు నేరుగా హాజరు కావాలన్న నిబంధన మాత్రం సరికాదు. కేసుల విచారణ కన్నా, మనుషుల ప్రాణాలు ముఖ్యం’’ అన్నారు భానుమూర్తి.
ముఖ్య విశేషాలు
► 1988లో సెషన్స్ జడ్జిగా (తమిళనాడు) భానుమతి కెరీర్ మొదలైంది.
► 2003లో మద్రాసు హైకోర్టు జడ్జిగా పదోన్నతి.
► 2013లో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం.
► 2014లో సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ స్వీకారం.
► సుప్రీం కోర్టుకు జడ్జి అయిన ఆరవ మహిళగా, ఐదుగురు జడ్జిలు సభ్యులుగా ఉండే ‘కొలీజియం’ (న్యాయమూర్తుల నియామక సలహా మండలి) లో రెండో మహిళగా గుర్తింపు. కోలీజయంలో మొదటి మహిళ రూమాపాల్ 2006లో పదవీ విరమణ పొందారు.
► ప్రస్తుతం భానుమతి రిటైర్ అవడంతో సుప్రీంకోర్టులో ఇద్దరు మాత్రమే.. ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ.. మహిళా జడ్జిలు ఉన్నట్లయింది. సుప్రీం కోర్టు చరిత్రలోనే ఒకేసారి ముగ్గురు మహిళా సిట్టింగ్ జడ్జిలు ఉండటం ఇదే మొదటిసారి.
గత ఏడాది ఆగస్టులో తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై జస్టిస్ భానుమతి చెన్నై వచ్చినప్పటి చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment