నేత్ర... పదమూడేళ్ల అమ్మాయి. తొమ్మిదో తరగతి చదువుతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన మానవాభిృద్ధి, శాంతివిభాగం (అసోసియేషన్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్) ఈ అమ్మాయిని ‘గుడ్‌విల్ అంబాసిడర్ ఫర్ ద పూర్’గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం నాడు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి నేత్రకు అభినందనలు తెలియచేశారు. నోటిమాటగా అభినందనలతో సరిపెట్టలేదు, నేత్ర ఉన్నతవిద్యకు అవసరమైన ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు ముఖ్యమంత్రి పళనిస్వామి. నేత్ర తాను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పింది.
కష్టం తెలిసిన బాల్యం
లాక్‌డౌన్ సమయంలో పేదప్రజలు పడుతున్న కష్టాలను చూసి నేత్ర పెద్దమనసుతో స్పందించింది. వలస కార్మికులకు సహాయం చేయడానికి, వారికి నిత్యావసరాలను అందించడానికి ముందుకు వచ్చింది. పదమూడేళ్ల అమ్మాయి ఇచ్చే విరాళం అంటే... పుట్టినరోజు నాడు అమ్మమ్మ, నానమ్మ ఏదైనా కొనుక్కోమని ఇచ్చిన వెయ్యి రూపాయలో, రెండు వేలో కాదు. తల్లీతండ్రీ ఈ అమ్మాయి చదువు కోసం కూడబెట్టిన ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బునంతటినీ వలస కార్మికుల కోసం విరాళంగా ఇవ్వడానికి అమ్మానాన్నలను ఒప్పించింది. అంత డబ్బు ధారాళంగా విరాళం ఇవ్వడానికి ఆమె అమ్మానాన్నలు సంపన్నులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు. నేత్ర తండ్రి మోహన్ సెలూన్ నడుపుతాడు. కూతురి కోరిక ప్రకారం మోహన్, నేత్ర తల్లి పండిసెల్వి మే 2న అన్నానగర్ పోలీసులను సంప్రదించారు.
వలసకార్మికుల అవసరాల కోసం ఉపయోగించమని ఆ డబ్బును ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. ఈ సంగతి తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రస్తామించి, నేత్ర దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. పేదవాళ్ల కష్టం చూసి ఆమె స్పందించిన తీరుకు ప్రశంసలు అందుతున్నాయి. నేత్ర మాత్రం ‘‘కొన్నేళ్ల కిందట మా కుటుంబం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నది. కనీస అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు. పేపర్లలో వలసకార్మికులు పడుతున్న బాధల గురించి చదివినప్పుడు మేము పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి. నా చదువు కోసం మళ్లీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న డబ్బు ఇచ్చేద్దాం... అని పట్టుపట్టాను’’ అని చెప్పింది. రాష్ట్ర మంత్రి సెల్లూర్ కె రాజు ‘‘నేత్ర మా మధురై జిల్లాకే గర్వకారణం. ఆమెకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద అవార్డు ఇవ్వడానికి ముఖ్యమంత్రికి సిఫారస్ చేస్తాన’’ని చెప్పారు. నేత్రకు న్యూయార్క్, జెనీవాలలో జరిగే ఐరాస సదస్సుల్లో ప్రసంగించే అవకాశం ఇస్తున్నట్లు యూఎన్ శాంతి పరిరక్షక విభాగం తెలియచేసింది.
Comments
Please login to add a commentAdd a comment