తాత్వి‘కథ’
ఓ గ్రామంలోని చేదబావి దగ్గర ఇద్దరు మహిళలు వాదులాడుకుంటూ ఉన్నారు. ఒక మహిళ గట్టి గట్టిగా అరుస్తోంది. మాటలు పడుతున్న స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుంది.
దారినపోతున్న ఓ పండితుడు అది గమనించాడు.
గట్టిగా మాట్లాడుతున్న మహిళతో ‘‘ఇలా అరవడం మంచిది కాదు’’ అని చెప్పబోయాడు.
‘‘నోరు ఉన్న వాళ్ళదే కదా రాజ్యం!’’ అని బదులిచ్చింది అరిచిన మహిళ.
చిన్న నవ్వు నవ్వాడు ఆ పండితుడు.
ఖాళీగా ఉన్న బిందెను చేంతాడు సహాయంతో బావిలోకి పంపమన్నాడు. ‘అదెంత పని’ అని అనుకున్న ఆమె ఖాళీబిందెను సరసరా బావిలోకి వదిలింది. బిందెలో నీళ్ళు చేరాక పైకి లాగమన్నాడు. శక్తిని ఉపయోగిస్తూ బిందెను లాగడం ప్రారంభించింది.
‘‘ఎలా ఉంది?’’ అని ప్రశ్నించాడు పండితుడు.
‘‘బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి బరువుగా ఉంది. కష్టంగా లాగుతున్నాను’’ అని సమాధానమిచ్చింది.
‘‘ఖాళీ బిందెని బావిలోకి వదిలినంత సులభంగా మనం ఎదుటివారిని ఎన్నో మాటలనవచ్చు. కానీ ఆ మాటలు ఎదుటి వారి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి. నీళ్ళు చేరాక ఖాళీ బిందె ఎలా బరువయ్యిందో, అలాగే మన మాటలు చాలా మంది మనసుల్ని బరువుగా చేస్తుంది.
ఒంటికి తగిలిన గాయాలను కొన్నాళ్ళకు మరుస్తామేమో కానీ, మనసుకు తగిలిన గాయాల్ని అంత సులభంగా మరువలేము. ఆపైన, మనం ఎప్పుడు వారికి కనిపించినా మనం మాట్లాడిన మాటలే వారికి గుర్తుకు వస్తాయి. వారి మనసు బాధగా మూలుగుతుంది. విరిగిన మనసు అంత సులభంగా అతకదని తెలుసుకో. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మనలోని మంచి వారికి కనిపించదు.
అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటలు మన పెదాలు దాటితే అవి మన అధీనంలో ఉండవు. మాటలు అనడం తేలిక. మాటల పర్యవసానం చాలా భారం. దానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, మనుషుల్ని రాబట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం సులభం’’ అని హితవు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదని గుర్తించిన ఆ మహిళ, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్న స్త్రీని క్షమాపణలు కోరింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ చేద బావిలోని నీళ్ళను చేదుకున్నారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment