హాథ్రస్‌ ఘటన: అంతా ఆ నలుగురి వైపే | Special Story About Lawyer Seema Samridhi | Sakshi
Sakshi News home page

హాథ్రస్‌ ఘటన: అంతా ఆ నలుగురి వైపే

Published Sun, Oct 4 2020 4:22 AM | Last Updated on Sun, Oct 4 2020 9:54 AM

Special Story About Lawyer Seema Samridhi - Sakshi

ఆరేళ్లు నడిచింది నిర్భయ కేసు. హాథ్రస్‌కి ఇంకా నడకే రాలేదు. అసలు నడవనిచ్చేలానే లేరు! కోర్టుకు వెళ్తేనే కదా తొలి అడుగు. ఆ అడుగునే పడనివ్వడం లేదు. ఊళ్లోకి దారులన్నీ మూసేశారు. కొన్ని నోళ్లను కూడా!! ‘నిర్భయ’ లాయర్‌ వచ్చారు. ‘పో.. పోవమ్మా’ అని ఆపేశారు. ఆమె ఆగిపోతారనా?! నిర్భయ లాయర్‌ మాత్రమే కాదు.. లాయర్‌ నిర్భయ కూడా.. సీమ!

తల్లీకూతుళ్లు పంట పొలంలో పచ్చిక కోస్తున్నారు. కోస్తూ కోస్తూ కూతురు కొంచెం దూరం వెళ్లింది. చిన్నపిల్లేం కాదు, ‘ఎక్కడుందో?’ అని తల్లి వెతుక్కోడానికి. పందొమ్మిదేళ్ల యువతి. సమయం గడిచింది. అలికిడి లేదు. అప్పుడు అనుమానం వచ్చి తలతిప్పి చూసింది. చూపు ఆనే దూరంలోనూ కూతురు కనిపించలేదు. కూతురు స్లిప్పర్స్‌ మాత్రం కనిపించాయి. తల్లి గుండె గుభేల్మంది. స్పిప్లర్స్‌ కనిపించాక, మనిషిని ఈడ్చుకెళ్లిన జాడలు కనిపించాయి. ‘తల్లీ’.. అని కూతురు ఏ లోకాన ఉన్నా వినిపించేలా అరచి, ఆక్రోశించింది తల్లి గుండె. సెప్టెంబర్‌ 14 న ఇది జరిగింది.

సామూహిక అత్యాచారంలో ప్రాణం కోసం కొట్టుకుని కొట్టుకుని సెప్టెంబర్‌ 29 న ఆసుపత్రిలో ఆ కూతురు కన్నుమూసింది. తల్లిని కూడా దగ్గరికి రానివ్వకుండా పోలీసులే కూతుర్ని దహనం చేశారు! హాథ్రస్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా. ఆ జిల్లాలోని బుల్గడీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సీమ ‘నిర్భయ’ కేసు లాయర్‌. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష పడి, నిర్భయకు కొంతైనా న్యాయం జరిగిందంటే ఆమె వల్లనే. 

నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్‌ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. హాథ్రస్‌ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు! ‘‘ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు’’ అని అడిషనల్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అంటున్నారు. ‘‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’’ అని జిల్లా మేజిస్ట్రేట్‌ అంటున్నారు! జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్‌ అధికారులు హాథ్రస్‌ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియా ను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్‌లోకే అడుగు పెట్టనివ్వడం లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్‌ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టాక జిల్లా ఎస్పీని, మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేయడం మాత్రమే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు దక్కిన న్యాయం. ఈ తరుణంలో హాథ్రస్‌ కేసును తను వాదించడానికి ముందుకు వచ్చిన సీమా సమృద్ధికీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసును చేపట్టాలని సీమ కృతనిశ్చయంతో ఉన్నారు. 

మృతురాలు చనిపోయే ముందు ఆసుపత్రిలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను బట్టి ఆమెపై జరిగింది కేవలం దాడి మాత్రమే కాదు, అత్యాచారం కూడా అని రుజువు చేసే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో బహిరంగ సాక్ష్యంగా ఉంది. వీడియో వరకు ఎందుకు? మృతురాలి తల్లి మాటలు చాలవా?! ‘‘ఈడ్చుకెళ్లిన జాడల వైపు నడుచుకుంటూ వెళ్లాను. ఓ చోట నా కూతురు స్పృహలో లేకుండా పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. నోట్లోంచి రక్తం కారుతోంది’’ అని ఆమె చెప్పిన నాలుగు ముక్కలు చాలు సీమ ఆ కేసును వాదించడానికి. 

సీమది కూడా ఉత్తరప్రదేశే. అక్కడి ఎటావా స్వస్థలం. తండ్రి బలాదిన్‌ ఖుష్వహ.. బిధిపూర్‌ గ్రామ మాజీ సర్పంచి. కూతుర్ని ఆమె ఇష్ట ప్రకారం ‘లా’ చదివించాడు. లా తర్వాత జర్నలిజం, పొలిటికల్‌ సైన్‌ కూడా చదివారు సీమ. 2012లో నిర్భయ ఘటన జరిగే నాటికి ఆమె ఇంకా విద్యార్థినిగానే ఉన్నారు. తర్వాత రెండేళ్లకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. ఆ నలుగురికీ ఉరిశిక్ష పడాల్సిందేనని గట్టిగా వాదించినప్పుడు తొలిసారిగా ఆమె పేరు దేశానికి తెలిసింది. కేసు నడుస్తున్నప్పుడు ‘నిర్భయ జ్యోతి ట్రస్టు’కు ఆమె సలహాదారుగా ఉన్నారు.

ఆ ట్రస్టును నెలకొల్పింది నిర్భయ తల్లిదండ్రులు. అత్యాచార బాధితుల న్యాయపోరాటాలకు ఆర్థికంగా తోడ్పాటును అందివ్వడం ట్రస్టు ధ్యేయం. మిగతా సామాజిక అంశాలలో కూడా సీమ చురుగ్గా ఉన్నారు. నిర్భయ దోషులు చట్టంలోని వెసులుబాట్లను ఉపయోగించుకుని చివరి వరకు బయట పడాలని చూసినట్లే, వారిని ఉరికంబం ఎక్కించేందుకు సీమ చివరి వరకు ప్రయత్నించి నిర్భయకు కనీస న్యాయం జరిపించారు. ఇప్పుడీ హాథ్రస్‌ కేసు స్వీకరించడం కూడా తన ధర్మం అని ఈ న్యాయవాది మనస్ఫూర్తిగా భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement