అదే వారికి చివరి రాత్రి | Special Story About Nirbhaya Convicts By Madhav Singaraju | Sakshi
Sakshi News home page

అదే వారికి చివరి రాత్రి

Published Fri, Mar 20 2020 4:06 AM | Last Updated on Fri, Mar 20 2020 4:37 AM

Special Story About Nirbhaya Convicts By Madhav Singaraju - Sakshi

కొద్ది గంటల్లో నిర్భయ దోషులకు ఉరి. స్వయంగా నిర్భయ ఆత్మే ఏ ఆఖరి నిముషంలోనో గాలిలో తేలి వచ్చి ఏడేళ్ల నాటి కన్నీటి చారికల్ని తుడుచుకుంటూ దుఃఖపు క్షమతో ‘స్టే’ ఇప్పిస్తే తప్ప ఉరి నుంచి ఈ నలుగురూ బయటపడే దారే లేదు. చివరి రాత్రి ఇది (ఇది రాస్తున్న సమయానికి). ఉరికొయ్యపై పిట్ట పాడే ‘స్వాన్‌ సాంగ్‌’ (చివరి పాట)కు చరణాలు లేని పల్లవి ఈ రాత్రి. తినబుద్ధి కాని చివరి భోజనం ఈ రాత్రి.

ఈ రాత్రి వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? తెల్లారే ఉరి. ఏడేళ్ల నాటి ఒక రాత్రి చేత వాళ్లకై వాళ్లు తమ నుదుటిపై రాయించుకున్న డెత్‌ వారెంట్‌.. ఈ రాత్రి. తీహార్‌లోని జైలు నెంబర్‌ 3 గది గోడల మధ్య చావు భయపు ఛాయలలో వాళ్లు ఒక్కసారైనా అనుకోకుండా ఉండి ఉంటారా.. జీవితం ఏడేళ్లు వెనక్కి వెళ్లి.. దెయ్యం పట్టిన ఆ డిసెంబర్‌ 16 రాత్రి తొమ్మిదిన్నర గంటలప్పుడు దక్షిణ ఢిల్లీలోని ద్వారక సబ్‌–సిటీ నుంచి దక్షిణ ఢిల్లీ పరిధిలోనే ఉన్న పట్టణ గ్రామం మునిర్కకు వెళ్లేందుకు స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ‘నిర్భయ’ గురించి చెడు ఆలోచనలేమీ చేయకుండా ఆమెను ఆమె గమ్యస్థానంలో దింపి వెళ్లి ఉంటే.. ఇప్పుడిలా ఉరికొయ్యల వైపు తమ ప్రాణాలను సర్దుకుని బయల్దేరక తప్పని స్థితి తప్పి ఉండేదని? ప్రాణం పోకడ తెలియదంటారు.

ఉరి ఖైదీలకు ప్రాణం ఎప్పుడు పోయేదీ ముందే తెలుస్తుంది. మీరు చెప్పుకునేది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చని, మీ కుటుంబ సభ్యులను కడసారి చూసుకోవచ్చనీ కొన్ని రోజుల ముందే జైలు సూపరింటెండెంట్‌ వెళ్లి చెప్తారు. ఉరితీసే ముందు రోజు రాత్రి చిట్టచివరి భోజనంలోకి అడిగినవి పెడతారని, ఉదయాన్నే ఉరికొయ్యల మీద కూడా ‘నీ ఆఖరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటుంటారు. అయితే ఈ చివరి భోజనం, చివరి కోరిక.. రెండూ కూడా చట్టంలో లేనివేనని సునీల్‌ గుప్తా తన ‘బ్లాక్‌ వారెంట్‌’ పుస్తకంలో రాశారు! ‘లా’ ఆఫీసర్‌గా తీహార్‌ జైల్లోని తన 35 ఏళ్ల కెరీర్‌లో మొత్తం పదకొండు ఉరితీతల్ని ప్రత్యక్షంగా చూశారాయన. తొలిసారి ఆయన చూసిన ఉరి.. బిల్లా రంగాలది. 1982 జనవరి 31న బిల్లా రంగాలను ఉరి తీస్తున్నప్పుడు దగ్గరుండి మరీ న్యాయపరమైన విధానాల అమలును ఆయన సరిచూసుకోవలసి వచ్చింది. ఆయన సరిచూసుకున్న చివరి ఉరి మొహమ్మద్‌ అఫ్జల్‌ గురుది. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్‌ని ఉరి తీశారు.

బిల్లా రంగాల ఉరి బాధ్యతలు మీద పడే వరకు వాళ్ల గురించి వార్తాపత్రికల్లో చదవడమే కానీ.. సునీల్‌ గుప్తా వాళ్లను చూసిందీ, వాళ్లతో నేరుగా మాట్లాడిందీ లేదు. ఉరికొయ్య దగ్గర ఉండటానికి ఉదయాన్నే డ్యూటీకి వచ్చేయమన్నారు సునీల్‌ని జైలు సూపరింటెండెంట్‌. ఇంటికెళుతూ ఆ రాత్రి బిల్లా రంగాలను చూడ్డానికి వాళ్లున్న సెల్‌ దగ్గరికి వెళ్లారు సునీల్‌. రంగా ఎప్పుడూ.. ‘రంగా ఖుష్‌’ అనుకుంటూ ఉండేవాడని, బిల్లా రోజంతా ఏడుస్తూ.. ‘అంతా నీవల్లే’ అని రంగాను నిందిస్తూ ఉండేవాడని విన్నాడు సునీల్‌. సెల్‌ దగ్గరకు వెళ్లేటప్పటికే రంగా తిని పడుకుని ఉన్నాడు! బిల్లా మేల్కొనే ఉండి, గది గోడల్ని చూస్తూ తనలో తను ఏదో గొణుక్కుంటున్నాడు. వాళ్లు చేసిన నేరం కూడా నిర్భయ వంటిదే. కారులో లిఫ్ట్‌ అడిగిన టీనేజ్‌ అక్కాతమ్ముళ్లను అదే కారులో కిడ్నాప్‌ చేసి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపారు. అక్కను చంపేముందు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ కేసు మూడున్నరేళ్లు సాగింది. సెల్‌లో ఉన్న బిల్లారంగాలను చూసి వెళ్లాక సునీల్‌కు ఆ రాత్రి నిద్రపట్టలేదు. భోజనం సహించలేదు. మర్నాడు తెల్లారే ఉరి తీస్తున్నప్పుడు కూడా బిల్లా వెక్కిళ్లు పెడుతూనే ఉన్నాడు. రంగా మాత్రం ధైర్యంగా ఉండి, ‘జో బోలే సో నిహాల్, సత్‌ శ్రీ అకాల్‌’ (విజయ నినాదం) అని పెద్దగా అరుస్తూ తలవాల్చేశాడు.

సాధారణంగా జైలు సూపరింటెండెంట్‌ కనుసైగతో దోషుల కాళ్ల కింది చెక్కను తొలగిస్తాడు తలారి. అయితే ఆ రోజు కనుసైగకు బదులుగా ఎర్రరంగు చేతిరుమాలును ఊపాడు. ఆ ఎర్రరంగు ‘బిల్లారంగా కర్చీఫ్‌’ ఇప్పటికీ ఒక ‘జ్ఞాపకం’గా ఆ సూపరింటెండెంట్‌ ఇంట్లో ఉందట. సునీల్‌కు ఇప్పటికీ ఒళ్లు ఝల్లుమనిపించే జ్ఞాపకం ఒకటుంది. ఉరి తీశాక దేహాలను రెండు గంటల పాటు అలా కొయ్యలకు ఉంచేస్తారు. తర్వాత జైల్‌ డాక్టర్‌ వచ్చి, ఆ దేహాలను పరీక్షించి, మరణాన్ని ధృవీకరిస్తారు. ఆ రోజు.. ఉరి తీసిన రెండు గంటల తర్వాత కూడా రంగా ‘పల్స్‌’ కొట్టుకుంటూనే ఉందని డాక్టర్‌ చెప్పడంతో సునీల్‌ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఉరి తీస్తున్నప్పుడు భయంతో శ్వాసను బిగబట్టినప్పుడు దేహం లోపల బందీ అయిపోయిన గాలి కారణంగా కొందరిలో అలా జరుగుతుందని డాక్టర్‌ చెప్పడంతో సునీల్‌ స్థిమితపడ్డారు. డాక్టర్‌ సూచనపై అక్కడి గార్డు ఒకరు పదిహేను అడుగుల ఆ గోతిలోకి దిగి, శూన్యంలో నిర్జీవంగా వేలాడుతున్న రంగా కాళ్లలో ఒకదాన్ని పట్టిలాగాడు. దాంతో గాలి బయటికి వచ్చి పల్స్‌ ఆగిపోయింది. 

జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జె.కె.ఎల్‌.ఎఫ్‌) కో–ఫౌండర్‌ మక్బూల్‌ భట్‌ను తీహార్‌ జైల్లోనే 1984లో ఉరి తీశారు. భక్తిపరుడు ఆయన. మంచి చదువు, మంచి ఇంగ్లిష్‌ ఉన్నవాడు. జైలు సిబ్బంది తమకు వచ్చిన మెమోలకు మక్బూల్‌ భట్‌ చేత ఇంగ్లిష్‌లో రిప్లయ్‌లను రాయించుకుని పై అధికారులకు సమర్పించేవారు. సునీల్‌ గుప్తా కూడా ఆయన దగ్గర తన ఇంగ్లిష్‌ను మెరుగు పరుచుకున్నారు. అలా వాళ్లిద్దరికీ మంచి స్నేహం. అకస్మాత్తుగా ఓ రోజు మక్బూల్‌ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ యు.కె.లోని కశ్మీర్‌ మిలిటెంట్‌లు అక్కడి భారత రాయబారి రవీంద్ర మాత్రేను కిడ్నాప్‌ చేసి, మూడు రోజులు నిర్బంధించి, తర్వాత చంపేశారు. వెంటనే ఇక్కడ మక్బూల్‌కి డెత్‌ వారెంట్‌ జారీ అయింది. మాత్రేని ఫిబ్రవరి 6న తీవ్రవాదులు చంపేస్తే, ఐదోరోజు ఫిబ్రవరి 11న మక్బూల్‌ని ఉరి తీశారు. ‘‘ఉరి తీస్తున్నప్పుడు, ఆ ముందురోజు మక్బూల్‌ మౌనంగా, శాంతంగా ఉన్నారు’’ అని సునీల్‌ తన పుస్తకంలో రాశారు.  నిర్భయ దోషులకు కొన్ని గంటల్లో ఉరి అనగానే వాళ్లెంత నేరస్థులయినా గాని మన మెడ చుట్టూ వాళ్ల ఆలోచనలు బిగుసుకోకుండా ఉండవు. ‘ఆ మహాతల్లి ఆ రోజు బస్సు ఎక్కకుండా ఉంటే ఈరోజు ఈ నలుగురు తల్లులకు ఇంత గర్భశోకం ఉండేది కాదు’ అని అనుకుంటున్న వాళ్లెవరైనా ఉంటే.. ‘ఆ రోజు ఈ నలుగురికీ ఒక్క క్షణం వాళ్ల తల్లులు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి బతికి పోయేది’ అని కూడా వాళ్లు అనుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement