చైతన్య వాహిని | Manthan Foundation will help to make awarnes in people | Sakshi
Sakshi News home page

చైతన్య వాహిని

Published Thu, Oct 2 2014 12:49 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

చైతన్య వాహిని - Sakshi

చైతన్య వాహిని

లోకంలో ప్రశ్నించే వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు. నిలదీసే వాళ్లూ ప్రతి వీధిలో తారసపడతారు. సమాధానం చెప్పేవాళ్లు మాత్రం కోటికొక్కరు ఉంటారు. అంతులేని ప్రశ్నలకు అర్థమయ్యేలా జవాబు చెప్పి.. సమాజంలో పేరుకుపోయిన బూజును దులిపే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే సంకల్పంతో ఏర్పాటైంది మంథన్ ఫౌండేషన్. సామాజిక అంశాలు, ఆర్థిక అవసరాలు, రాజకీయ కోణాలు, అంతర్జాతీయ సంగతులు.. ఇలా ఎన్నో అంశాలపై ఓపెన్ డిబేట్ నిర్వహిస్తూ సామాన్యుడికి అర్థం కాని అనేక విషయాలపై అవగాహన కల్పిస్తోంది.
 
 మంథన్ అంటే ..
 మేధోమథనం! వినడానికి బరువైన పదంగా అనిపించొచ్చు. కానీ ఎన్నో సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు చూపుతున్న మార్గం ఇది. సైన్స్ అండ్ ఫిక్షన్, రాజకీయాల్లోని అవినీతి.. ప్రజా చట్టాల్లోని లొసుగులు.. అభివృద్ధితో అందే ఫలాలు.. ఇలా లోకాభిరామాయణాన్ని భుుజానికెత్తుకుంది మంథన్ సంస్థ. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు అజయ్ గాంధీ, ఎమ్‌ఆర్ విక్రమ్‌ల ఆలోచనతో తొమ్మిదేళ్ల కిందట తొమ్మిది మందితో పిల్లకాలువలా మొదలైన ఈ వాహిని.. ఇప్పుడు ఆరువేల మంది సభ్యులతో ఉప్పెనలా రూపుదిద్దుకుంది. సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది.
 
లక్ష్యం దిశగా..
 అంశం ఏదైనా సమాజాన్ని చైతన్య పర్చడమే మంథన్ లక్ష్యం. వివిధ రంగాల్లో ప్రముఖులు, నీతి, నిజాయతీలకు మారు పేరుగా నిలిచిన వారు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు బృంద చర్చలు, సమావేశాలు, బహిరంగ చర్చలు నిర్వహిస్తుంటారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను వక్తలుగా ఆహ్వానిస్తారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు ఓపెన్ డిబేట్‌లో ఆహూతుల అభిప్రాయాలను స్వీకరిస్తారు.   ప్రతినెలా ఒకటి లేదా రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రవేశం ఉచితం. మనం చేయాల్సిందల్లా ఠీఠీఠీ.ఝ్చ్టజ్చిజీఛీజ్చీ.ఛిౌఝ లో పేరు నమోదు చేసుకోవడమే. సామాజిక బాధ్యతను నెత్తినేసుకున్న మంథన్ ఫౌండేషన్ ఏ ఇతర సంస్థ నుంచి , వ్యక్తుల నుంచి నిధులు వసూలు చేయదు. రచయితలు, వ్యాపారులు, కంపెనీ యజమానులు, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉండటం విశేషం.
 
 పెరుగుతున్న ఆదరణ..
 మంథన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా 150 నుంచి 700 మంది ప్రజలు హాజరవుతారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఆరుసార్లకు పైగా ప్రముఖ వక్తలతో చర్చలు నిర్వహించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్య మనుగడపై సామాజిక కార్యకర్త, మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్‌రాయ్ ఉపన్యసించారు. గతంలో ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల పోరాట నేత కణ ్ణబీరన్, కవి జావెద్ అక్తర్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి 150 మందికి పైగా ప్రముఖులు  మంథన్ సదస్సులో పాల్గొన్నారు.
 
 ఓపెన్ ప్లాట్‌ఫాం
 గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్‌లో మంథన్ సంవాద్-2014 ఏర్పాటు చేసినట్లు మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. మంథన్ అభిప్రాయాలు పంచుకోవడానికి అందరికీ ఓపెన్ ప్లాట్‌ఫాం అని తెలిపారు.
 - కాకి మాధవరావు, ఐఏఎస్(రిటైర్డ్ )
 
 ఒక మైల్‌స్టోన్
నగరానికి  మంథన్ ఒక మైల్‌స్టోన్ లాంటిది. తొమ్మిదేళ్లుగా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 150 మంది వరకు వ్యక్తలు పాల్గొన్నారు. వివిధ రకాల సభలు, సదస్సులు నిర్వహించాం. దేశంలోని సమస్యల గురించి విపులంగా, సూక్ష్మంగా విశ్లేషించేందుకు మంథన్ ఫౌండేషన్ సదస్సులు దోహదం చేస్తున్నాయి.  
 - అజయ్ గాంధీ
 - కోన సుధాకర్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement