ప్లే@మెసేజ్
విభిన్న కళలకు వేదిక బంజారాహిల్స్ లామకాన్. గతవారం ఇందులో ప్రదర్శించిన రెండు నాటకాలు
‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, కోర్ట్ మార్షల్’ సామాజిక చైతన్యం రగిలించే దిశగా సాగాయి. భిన్నత్వంలో కత్వం సాధించాలన్న కాంక్ష కాంక్షగానే మిగిలిందా అనే ప్రశ్నను సంధిస్తుంది మొదటి నాటకం. నిజాన్ని, దాని నిజస్వరూపాన్ని చూసి కదిలిపోయిన కల్నల్ కథ రెండోది. వేటికవే ప్రత్యేకతను చాటుకున్న ఈ రెండు నాటకాల ‘రివైండ్’...
కోర్ట్ మార్షల్
యుద్ధాన్ని, శత్రువుని, చావుని ఎదుర్కోవడానికి ఎన్నడూ వెనకడుగేయని కల్నల్ సూరజ్... నిజాన్ని, దాని నిజ స్వరూపాన్ని చూసి కదిలిపోతాడు. అతని అంతరంగమే ఈ నాటకం. అలాగే... నేరానికి పాల్పడినవారు కళ్లముందే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైతే... ఆ న్యాయమూర్తి అంతరంగం ఎలా ఉంటుందో ఈ ప్లే ఆవిష్కరించింది. దేశంలో అగ్రకులాలు, అధికార దర్పంతో బలహీనులపై కొనసాగిస్తున్న అమానవీయ చర్యలు నేటికీ ప్రతి వ్యవస్థలో కొనసాగుతున్నాయనే చేదు నిజాన్నీ ఈ నాటకం మన ముందు ఉంచుతుంది.
కథ విషయానికొస్తే... జవాను రాంచందర్... ఇద్దరు ఉన్నతాధికారులను కాలుస్తాడు. తాను చేసిన పనికి ఏ శిక్షకైనా సిద్ధమని అతడు కోర్టు మార్షల్ ముందు చెబుతాడు. దాడిలో ఇద్దరు అధికారుల్లో వర్మ మరణించగా, మరొకరు కపూర్ ప్రాణాలతో బయటపడతాడు. రాంచందర్ తరపు కెప్టెన్ రాయ్ కేసు వాదిస్తాడు. తన క్లయింట్ హత్య చేయడం నిజమేనని, అయితే అందుకు దారి తీసిన కారణాలు తెలుసుకోవాలంటాడు రాయ్. క్రీడాకారుడిగా, జవానుగా ప్రశంసలు అందుకున్న రాంచందర్ హంతకుడిగా మారిన తీరు దేశంలో నేటికీ కొనసాగుతున్న అనేక సంకుచిత ఆలోచనలు, వ్యక్తులను మన ముందుకు తెస్తుంది. పై అధికారి తప్పును ప్రశ్నించలేక... తోటివారి బాధ చూడలేని... నిస్సహాయతతో ఉడికిపోయే తత్వం రాంచందర్‌ది. తనను కులం తక్కువ వాడని దూషిస్తున్న అధికారులపై సహనం కోల్పోయి చేసిన దాడే ఈ హత్య అని చెబుతాడు రాయ్. స్వతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా భారత్‌లో కులాల కుంపటిని ఆర్పలేకపోతున్నామని చెబుతుందీ నాటకం. స్వదేశ్ దీపక్ రాసిన ఈ నాటకానికి సమహారా గ్రూప్ రత్నశేఖర్ దర్శకత్వం వహించారు. కెప్టెన్ రాయ్ పాత్రలో కూడా ఆయన చక్కగా ఒదిగిపోయారు.
ఈశ్వర్ అల్లా తేరే నామ్
స్వాతంత్య్రానికి ముందు... తరువాత... ఎన్ని మార్పులు వచ్చినా మత వివాదాలకు కాలం చెల్లలేదని చెబుతుందీ కథ. నాటి, నేటి పరిస్థితులు, మారణహోమాలకు అమాయకులు బలవుతున్న తీరు కళ్లకు కడుతుంది. గాంధీ జయంతి సందర్భంగా నిశుంభిత కల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రదర్శించింది.
ఈశ్వర్, అల్లా, బాగీ (తిరుగుబాటుదారుడు), సర్వం కోల్పోయిన ఓ రాజు... ఈ నలుగురి మధ్యా పిచ్చాసుపత్రిలో సాగే ఆసక్తికర సంభాషణల్లో... చరిత్రలో జరిగిన దుర్ఘటనలు, యుద్ధాలు, దేశ విభజన ముందు- తర్వాత సాగిన మారణహోమాలు అనేకం మన కళ్ల ముందు కదలాడతాయి. హిందువుల దాడిలో హిందువులు... ముస్లింల దాడిలో ముస్లింలనే బలితీసుకున్న ఘటనల నేపథ్యంలో సొంతవారిని పోగొట్టుకుని లాభపడింది ఎవరో తెలియక రోదిస్తున్న వారిని సమాజం పిచ్చి వాళ్లనే అంటుందేమో... అనే ఆలోచనల్లోకి నెడుతుందీ ప్లే. ఐదు వేల మంది హిందువులు, ఐదు వేల మంది ముస్లింలు చనిపోయారని చెబితే... ‘చనిపోయింది మనుషులని చెప్పటం మరిచారా! మనుషులుగా బతకడం, ఆలోచించడం మానేశారా’ అని ప్రశ్నిస్తాడు బాగీ. ఇన్ని సంఘర్షణల తరువాత పిచ్చాసుపత్రిలో ఉన్నవారు... బయట ఉన్నవారిలో ప్రేమ రగిలించు లేదా వాళ్లనీ పిచ్చివాళ్లని చెయ్యి అని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇంతకీ ఎవరు పిచ్చివాళ్లు..! ప్రేమ కోసం తపిస్తున్న వారా? మనుషులమన్న స్పృహ మరిచి ప్రవర్తిస్తున్న మనమా...! అనే ఓ ఆలోచనాత్మక ప్రశ్నను సంధిస్తూ ముగుస్తుంది నాటకం. పిచ్చివాళ్లుగా నటించిన కృష్ణచైతన్య, కృష్ణ, వినయ్, కేశవ్ అద్భుతమైన అభినయంతో మెప్పించారు.
- ఓ మధు