అఖిలం
అతడి చిత్రం సామాజిక చైతన్యం. కళ్లముందు కదిలి... కాన్వాస్‌పై ఆవిష్కరించే నిజ దృశ్యం. వయసులో చిన్నే అయినా... ఆలోచనలు విశాలం. కూకట్‌పల్లి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎ.అఖిల్... కుంచెతో చేసే చిత్రాలెన్నో! పెయింటింగ్‌లో ఎన్నో పతకాలు, అభినందనలు అందుకున్న అఖిల్ ‘సిటీ ప్లస్’తో తన అభిరుచి గురించి ముచ్చటించాడు.
పర్యావరణం, పరిరక్షణ, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు... పెయింటింగ్ ఏదైనా సామాజిక అంశాన్ని మిళితం చేస్తాడు అఖిల్. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు నాలుగో తరగతి నుంచే ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. యాభైకి పైగా పోటీల్లో సత్తా చాటాడు. మహబూబ్‌నగర్ జిల్లా వంకేశ్వరం స్వగ్రామం. తన ఆలోచనలే కాదు... సినిమా పాటలోని భావాలకు రూపం ఇస్తాడు. పంట పొలాలు, వ్యవసాయం, పక్షులు, ఊళ్లలో జరిగే జాతర... ఇలా ప్రతిదీ అతడికి కళాత్మకమే. స్వాతంత్య్ర సమరయోధులు, దేవతలు, వెయ్యి, ఐదొందల రూపాయి నోట్ల వంటివి అచ్చుగుద్దినట్టు కాన్వాస్‌పై దించేస్తాడు.
పతకాలు ఘనం...
ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులపై అఖిల్ వేసిన పెయింటింగ్ (2012)కు జాతీయ స్థాయిలో బంగారు పతకం దక్కింది. అలాగే 2012, 13 సంవత్సరాల్లో నెమలి, పర్యావరణ పరిరక్షణపై గీసిన చిత్రాలకు కడప ఫైన్ ఆర్ట్స్ అకాడమీ బంగారు పతకాలు అందించింది. 2013లో సాక్షి నిర్వహించిన ‘నా దృష్టిలో వైఎస్‌ఆర్’ పోటీల్లో ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. ఆంజనేయుడి రూపంలో వైఎస్‌ఆర్ చిత్రపటం గీశాడు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ బాలభవన్‌లో జరిగిన నేషనల్ బాలశ్రీ అవార్డు ఫైనల్‌లో తెలంగాణ నుంచి పాల్గొన్నది అఖిల్ ఒక్కడే. చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, బిర్లా మందిర్, అసెంబ్లీ మధ్యలో మెట్రో రైల్వే ట్రాక్ పెయింటింగ్ వేసి అబ్బురపరిచాడు. ఎవరైనా చేయూతనిస్తే... మరింతగా రాణిస్తానంటున్నాడు అఖిల్.
-వాంకె శ్రీనివాస్