‘అర్బన్ ఫోక్ మ్యూజిక్
‘భూక్ రోటీ కీ హయ్ తుఝే... ధూండే ఫిర్ క్యోం తూ తుక్డే జమీన్ కీ...’ (అన్నం కోసం ఆకలి వేస్తే భూమిని ఎందుకు లాక్కుంటున్నావ్) అంటూ సామాజిక చైతన్యం రగిలించింది ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’. బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం జనసంవాద్ బ్యాండ్ ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన సురేంద్రసింగ్ నేగి... సామాజిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా వినూత్నంగా సంగీతాన్ని ఎన్నుకున్నారు. ‘టాక్ టు పీపుల్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో ప్రజా చైతన్యం కోసం ముందుకు సాగుతున్న సురేంద్రసింగ్‌ను ‘సిటీ ప్లస్’ పలకరించింది...
మాది దిల్లీ. మొదటి నుంచీ సామాజిక సమస్యలపై అవగాహన ఎక్కువ. దిల్లీ యూనివర్సిటీ నుంచి స్పానిష్‌లో పీహెచ్‌డీ చేశా. తరువాత ఇఫ్లూలో స్పానిష్ లెక్చరర్‌గా అవకాశం వచ్చింది. చదువుకునే రోజుల్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఆలోచింపజేసింది. అప్పుడే సమాజం కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి నుంచి మతసామరస్యం, ఆడవారిపై దాడులు, వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, కశ్మీర్‌లో మతపరమైన దాడులు, రైతుల ఆత్మహత్యలు, భూ సేకరణ... ఇలా సామాజిక అంశాలను ఎంచుకుని పాటలు రాశా.
అదే సమయంలో నాలాంటి ఆలోచనలే కలిగిన తారీఖ్‌షేఖ్ (బెంగాల్), బేస్ గిటార్ స్పెషలిస్టు సుమిత్ భండారీ (దిల్లీ), ఫ్లూట్ స్పెషలిస్టు దీపక్ సేన్‌వాల్ (ఫ్లూట్ స్పెషలిస్టు), తబలా ప్లేయర్ సావన్ (హైదరాబాద్)తో పరిచయం ఏర్పడింది. ఆ నలుగురితో కలసి ‘జన్‌సంవాద్’ బ్యాండ్‌కు శ్రీకారం చుట్టాం. 2012లో తొలిసారిగా ఇఫ్లూలో అర్బన్ ఫోక్ మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చాం.
మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, లామకాన్‌లో నిర్వహించిన మా కన్సర్ట్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. అలాగే దిల్లీ, బీహార్‌లలో కూడా ప్రదర్శనలిచ్చాం. ఎక్కడికెళ్లినా మా ఆలోచనకు జేజేలు దక్కాయి. నా మ్యూజిక్ వల్ల వందమందిలో ఒకరు మారినా ఆనందమే.
డిఫరెంట్ వాయిద్యాలు...
అర్బన్ ఫోక్ మ్యూజిక్‌లో విభిన్న రకాల వాయిద్యాలు ఉపయోగిస్తున్నాం. త్రీ టైమ్స్ గిటార్, రిథమ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, దేశ్ గిటార్, తబలా, ఫ్లూట్, డోలక్‌లను వాడుతున్నాం. మా టీమ్‌లోని సభ్యులమంతా నగర నేపథ్యం ఉన్నవారం కాబట్టి... ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’ను ఎంచుకున్నాం. నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఈ మ్యూజిక్ చాలా ఉపయోగపడుతోంది. మ్యూజిక్ ప్లే చేసి ప్రజల్లో సామాజిక మార్పు తీసుకొచ్చే దిశగా సాగుతున్నాం. ఇప్పటికే పల్లెల్లో ఘల్లుమంటున్న జానపదానికే సరికొత్త బాణీలు చేర్చి ఇష్యూస్ రైజ్ చేసేలా పాటలు పాడుతున్నాం.
- వాంకె శ్రీనివాస్