Court martial
-
కోర్టు మార్షల్‌కు సమయం దగ్గరపడింది
ఇస్లామాబాద్: సైనిక న్యాయస్థానంలో తనపై విచారణ జరిపేందుకు సమయం దగ్గరపడిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మే 9వ తేదీన ఇమ్రాన్ అరెస్టు సందర్భంగా జరిగిన అల్లర్లకు కుట్ర పన్నిన వారిని మిలటరీ కోర్టుల్లో విచారణ జరిపిస్తామంటూ ఆర్మీ ప్రకటించడం, ఆ హింసాత్మక ఘటనలకు సూత్రధారి ఇమ్రానే అంటూ గురువారం మంత్రి సనావుల్లా పేర్కొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్య చేశారు. తనపై నమోదైన 10 కేసుల విచారణకు గాను గురువారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్..అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మిలటరీ కోర్టులో పౌర విచారణ, చాలా అన్యాయం. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ముగింపు’అని ఆయన పేర్కొన్నారు. తనపై నమోదైన 150 కేసులు బోగస్‌వేనని తెలిపారు. పౌర న్యాయస్థానాల్లో ఇవి నిలవవు కాబట్టే కోర్టు మార్షల్‌కు నిర్ణయించారని ఆరోపించారు. మే 9 నాటి ఘటనలపై ఇప్పటికే మిలటరీ కోర్టుల్లో విచారణ మొదలైంది. ఇలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్‌పై అసంతృప్తితో ఉన్న పాకిస్తాన్–తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన కొందరు నేతలు వేరుకుంపటి పెట్టుకున్నారు. బడా చక్కెర వ్యాపారి, ఇమ్రాన్ సన్నిహితుడిగా పేరున్న జహంగీర్ ఖాన్ తరీన్ నేతృత్వంలో గురువారం పీటీఐ నేతలు ఇస్టెఖామ్–ఇ–పాకిస్తాన్(ఐపీపీ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. -
ఐఏఎఫ్ అధికారులకు కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ: సొంత క్షిపణి దాడి కారణంగా భారత వైమానిక దళ చాపర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ అధికారులు కోర్టు మార్షల్ ఎదుర్కోనున్నారు. పీఓకేలోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన తరువాత, ఫిబ్రవరి 27న పొరపాటున చేసిన క్షిపణి దాడిలో ఐఏఎఫ్ ఎంఐ 17 చాపర్ ఒకటి కశ్మీర్‌లోని బుద్గాంలో కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, ఐఏఎఫ్ అధికారుల మధ్య సమాచార లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒక గ్రూప్ కెప్టెన్, మరో వింగ్ కమాండర్ కోర్టు మార్షల్‌ను ఎదుర్కొంటారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇద్దరు ఎయిర్ కమాండర్లు, ఇద్దరు ఫ్లైట్ లెఫ్ట్నెంట్లపైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వెల్లడించాయి. -
26 ఏళ్లకు విముక్తి.. డిఫెన్స్‌కు రూ.5కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: చేయని నేరానికి కోర్టు మార్షల్‌కు గురై గత ఇరవై ఆరేళ్లుగా విధులకు దూరంగా ఉంటున్న ఓ సైనికుడి(సెకండ్ లెఫ్టినెంట్ కల్నల్)కి న్యాయం జరిగింది. చివరికి అతడిని వెంటనే విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఈ కాలం నాటికి అతడు ఏఏ ర్యాంకులు పొందాలో అవన్నీ ఇచ్చి, రూ.4కోట్లు అతడికి చెల్లించాలంటూ జస్టిస్ డీపీ సింగ్, ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ధర్మాసనం తీర్పు చెప్పింది. శ్రీనగర్‌లోని రాజపుట్ ఆరో బెటాలియన్‌లో 1991నాటికి ఎస్ఎస్ చౌహాన్ అనే వ్యక్తి సెకండ్ లెఫ్టినెంట్ అధికారిగా విధులు నిర్వర్తించేవారు. అయితే, అతడిని పలాయనం చెందిన సైనికుడిగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా పేర్కొంటూ 1991 నవంబర్ 4న అతడిపై కోర్టు మార్షల్ విధించగా నాటి శ్రీనగర్‌లోని జనరల్ ఆఫిసర్ ఇన్ కమాండింగ్ చీఫ్ కూడా ఆమోదించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తిరిగి తన స్థానాన్ని పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తునే ఉన్నారు. అతడు కోర్టుకు చెప్పిన ప్రకారం 1990 ఏప్రిల్ 11న శ్రీనగర్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించే క్రమంలో చౌహాన్ 147 బంగార్లు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు దాదాపు 27.5 కేజీల వరకు ఉంటుంది. వీటిని తన పై అధికారులు కల్నల్ కేఆర్ఎస్ పవార్, లెఫ్టినెంట్ జనరల్ జాకి మహ్మద్ అహ్మద్‌లకు అప్పగించారు. అయితే, వాటిని పై అధికారులే కాజేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తీవ్ర అనుమానాలు రేపి చివరకు చౌహాన్‌కు కోర్టు మార్షల్ విధించేలా చేశారు. దీనికి సంబంధించి నిజనిజాలు తెలుసుకున్న ది ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చివరకు చౌహాన్ నిర్దోషిగా తేల్చింది. రక్షణశాఖకు రూ.5కోట్ల ఫైన్ విధించింది. వాటిల్లో రూ.4 కోట్లు చౌహాన్‌కు, మరో కోటిని అతడి పేరిట ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ కింద నాలుగు నెలల్లో జమ చేయాలని తీర్పునిచ్చింది. బంగారు బిస్కెట్లు వ్యవహారం తేల్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. -
ప్లే@మెసేజ్
విభిన్న కళలకు వేదిక బంజారాహిల్స్ లామకాన్. గతవారం ఇందులో ప్రదర్శించిన రెండు నాటకాలు ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, కోర్ట్ మార్షల్’ సామాజిక చైతన్యం రగిలించే దిశగా సాగాయి. భిన్నత్వంలో కత్వం సాధించాలన్న కాంక్ష కాంక్షగానే మిగిలిందా అనే ప్రశ్నను సంధిస్తుంది మొదటి నాటకం. నిజాన్ని, దాని నిజస్వరూపాన్ని చూసి కదిలిపోయిన కల్నల్ కథ రెండోది. వేటికవే ప్రత్యేకతను చాటుకున్న ఈ రెండు నాటకాల ‘రివైండ్’... కోర్ట్ మార్షల్ యుద్ధాన్ని, శత్రువుని, చావుని ఎదుర్కోవడానికి ఎన్నడూ వెనకడుగేయని కల్నల్ సూరజ్... నిజాన్ని, దాని నిజ స్వరూపాన్ని చూసి కదిలిపోతాడు. అతని అంతరంగమే ఈ నాటకం. అలాగే... నేరానికి పాల్పడినవారు కళ్లముందే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైతే... ఆ న్యాయమూర్తి అంతరంగం ఎలా ఉంటుందో ఈ ప్లే ఆవిష్కరించింది. దేశంలో అగ్రకులాలు, అధికార దర్పంతో బలహీనులపై కొనసాగిస్తున్న అమానవీయ చర్యలు నేటికీ ప్రతి వ్యవస్థలో కొనసాగుతున్నాయనే చేదు నిజాన్నీ ఈ నాటకం మన ముందు ఉంచుతుంది. కథ విషయానికొస్తే... జవాను రాంచందర్... ఇద్దరు ఉన్నతాధికారులను కాలుస్తాడు. తాను చేసిన పనికి ఏ శిక్షకైనా సిద్ధమని అతడు కోర్టు మార్షల్ ముందు చెబుతాడు. దాడిలో ఇద్దరు అధికారుల్లో వర్మ మరణించగా, మరొకరు కపూర్ ప్రాణాలతో బయటపడతాడు. రాంచందర్ తరపు కెప్టెన్ రాయ్ కేసు వాదిస్తాడు. తన క్లయింట్ హత్య చేయడం నిజమేనని, అయితే అందుకు దారి తీసిన కారణాలు తెలుసుకోవాలంటాడు రాయ్. క్రీడాకారుడిగా, జవానుగా ప్రశంసలు అందుకున్న రాంచందర్ హంతకుడిగా మారిన తీరు దేశంలో నేటికీ కొనసాగుతున్న అనేక సంకుచిత ఆలోచనలు, వ్యక్తులను మన ముందుకు తెస్తుంది. పై అధికారి తప్పును ప్రశ్నించలేక... తోటివారి బాధ చూడలేని... నిస్సహాయతతో ఉడికిపోయే తత్వం రాంచందర్ది. తనను కులం తక్కువ వాడని దూషిస్తున్న అధికారులపై సహనం కోల్పోయి చేసిన దాడే ఈ హత్య అని చెబుతాడు రాయ్. స్వతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా భారత్‌లో కులాల కుంపటిని ఆర్పలేకపోతున్నామని చెబుతుందీ నాటకం. స్వదేశ్ దీపక్ రాసిన ఈ నాటకానికి సమహారా గ్రూప్ రత్నశేఖర్ దర్శకత్వం వహించారు. కెప్టెన్ రాయ్ పాత్రలో కూడా ఆయన చక్కగా ఒదిగిపోయారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ స్వాతంత్య్రానికి ముందు... తరువాత... ఎన్ని మార్పులు వచ్చినా మత వివాదాలకు కాలం చెల్లలేదని చెబుతుందీ కథ. నాటి, నేటి పరిస్థితులు, మారణహోమాలకు అమాయకులు బలవుతున్న తీరు కళ్లకు కడుతుంది. గాంధీ జయంతి సందర్భంగా నిశుంభిత కల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రదర్శించింది. ఈశ్వర్, అల్లా, బాగీ (తిరుగుబాటుదారుడు), సర్వం కోల్పోయిన ఓ రాజు... ఈ నలుగురి మధ్యా పిచ్చాసుపత్రిలో సాగే ఆసక్తికర సంభాషణల్లో... చరిత్రలో జరిగిన దుర్ఘటనలు, యుద్ధాలు, దేశ విభజన ముందు- తర్వాత సాగిన మారణహోమాలు అనేకం మన కళ్ల ముందు కదలాడతాయి. హిందువుల దాడిలో హిందువులు... ముస్లింల దాడిలో ముస్లింలనే బలితీసుకున్న ఘటనల నేపథ్యంలో సొంతవారిని పోగొట్టుకుని లాభపడింది ఎవరో తెలియక రోదిస్తున్న వారిని సమాజం పిచ్చి వాళ్లనే అంటుందేమో... అనే ఆలోచనల్లోకి నెడుతుందీ ప్లే. ఐదు వేల మంది హిందువులు, ఐదు వేల మంది ముస్లింలు చనిపోయారని చెబితే... ‘చనిపోయింది మనుషులని చెప్పటం మరిచారా! మనుషులుగా బతకడం, ఆలోచించడం మానేశారా’ అని ప్రశ్నిస్తాడు బాగీ. ఇన్ని సంఘర్షణల తరువాత పిచ్చాసుపత్రిలో ఉన్నవారు... బయట ఉన్నవారిలో ప్రేమ రగిలించు లేదా వాళ్లనీ పిచ్చివాళ్లని చెయ్యి అని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇంతకీ ఎవరు పిచ్చివాళ్లు..! ప్రేమ కోసం తపిస్తున్న వారా? మనుషులమన్న స్పృహ మరిచి ప్రవర్తిస్తున్న మనమా...! అనే ఓ ఆలోచనాత్మక ప్రశ్నను సంధిస్తూ ముగుస్తుంది నాటకం. పిచ్చివాళ్లుగా నటించిన కృష్ణచైతన్య, కృష్ణ, వినయ్, కేశవ్ అద్భుతమైన అభినయంతో మెప్పించారు. - ఓ మధు