ఇస్లామాబాద్: సైనిక న్యాయస్థానంలో తనపై విచారణ జరిపేందుకు సమయం దగ్గరపడిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మే 9వ తేదీన ఇమ్రాన్ అరెస్టు సందర్భంగా జరిగిన అల్లర్లకు కుట్ర పన్నిన వారిని మిలటరీ కోర్టుల్లో విచారణ జరిపిస్తామంటూ ఆర్మీ ప్రకటించడం, ఆ హింసాత్మక ఘటనలకు సూత్రధారి ఇమ్రానే అంటూ గురువారం మంత్రి సనావుల్లా పేర్కొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్య చేశారు. తనపై నమోదైన 10 కేసుల విచారణకు గాను గురువారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్..అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘మిలటరీ కోర్టులో పౌర విచారణ, చాలా అన్యాయం. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ముగింపు’అని ఆయన పేర్కొన్నారు. తనపై నమోదైన 150 కేసులు బోగస్‌వేనని తెలిపారు. పౌర న్యాయస్థానాల్లో ఇవి నిలవవు కాబట్టే కోర్టు మార్షల్‌కు నిర్ణయించారని ఆరోపించారు. మే 9 నాటి ఘటనలపై ఇప్పటికే మిలటరీ కోర్టుల్లో విచారణ మొదలైంది. ఇలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్‌పై అసంతృప్తితో ఉన్న పాకిస్తాన్–తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన కొందరు నేతలు వేరుకుంపటి పెట్టుకున్నారు. బడా చక్కెర వ్యాపారి, ఇమ్రాన్ సన్నిహితుడిగా పేరున్న జహంగీర్ ఖాన్ తరీన్ నేతృత్వంలో గురువారం పీటీఐ నేతలు ఇస్టెఖామ్–ఇ–పాకిస్తాన్(ఐపీపీ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment