Prasanth bhushan
-
కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎందుకు సవాల్ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ? సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాశ్ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్ నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్‌ల్యాండ్’ రక్షణ కుంభకోణం, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్‌కు నాయకత్వం వహించిందీ అశోక్ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే. అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసును కూడా 2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్‌గా పనిచేస్తుండగా, అభయ్ డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అభయ్ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది. అద్వానీతో పరిచయం లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట. ఢిల్లీకి పిలుపు.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్ బయోటెక్’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. 3.83 కోట్ల ముడుపులు స్టెర్లింగ్ బయోటెక్ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ వర్గాలే స్పాన్సర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈడీ దాడులతో స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్ సండేసర ఆస్తులపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్ వర్మ అక్టోబర్ 15వ తేదీన అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్ అలోక్ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి. -
పేదలకు న్యాయం అందడం లేదు
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ - లాయర్‌ను నియమించుకునే స్తోమత లేకపోవడమే కారణం సాక్షి, హైదరాబాద్: దేశంలో 80 శాతం మంది నిరుపేదలకు న్యాయం అందడం లేదని, కోర్టుల్లో తమ తరఫున వాదనలు వినిపించేలా న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత వారికి లేకపోవడమే దీనికి కారణమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘న్యాయవ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కోట్ల మందికి ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, న్యాయవ్యవస్థలో ప్రస్తుత సంక్లిష్టమైన విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. 20 శాతం మంది న్యాయవాదిని నియమించుకుని కోర్టుల్లో పోరాడుతున్నా తీవ్రమైన జాప్యం వల్ల వారికీ సత్వర న్యాయం అందడం లేదన్నారు. కోట్లలో పెండింగ్ కేసులు, సంక్లిష్టమైన విధానంతో ప్రజలకు దూరంగా న్యాయవ్యవస్థ ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల నమ్మకం కోల్పోయి న్యాయవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందన్నారు. గ్రామీణ న్యాయాలయాలను విసృ్తతంగా ఏర్పాటు చేసి న్యాయవాది అవసరం లేని సరళమైన విధానాన్ని అమలు చేయాలని, తద్వారా కక్షిదారులే తమ సమస్యలపై నేరుగా వాదనలు వినిపించుకునే పరిస్థితులు కల్పించాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతిపోవాలంటే సమూలమైన సంస్కరణలు రావాలని బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, రఘునాథ్, భూపాల్‌రాజ్, లక్ష్మణ్‌సింగ్, సంపూర్ణ, తిరుపతివర్మ, గోవర్థన్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. -
ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు
పార్టీ మీద తిరుగుబాటు చేసిన యోగేంద్ర యాదవ్, ప్రశాంతభూషణ్ ఇద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వాళ్లమీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలనూ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గిన కొన్నాళ్లకే పార్టీలో అసంతృప్తి బయల్దేరడం, దాంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగడం తెలిసిందే. తర్వాత యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ ఇద్దరూ కలిసి 'స్వరాజ్ అభియాన్' అనే గ్రూపును ఏర్పాటుచేశారు. వాళ్లిద్దరినీ పార్టీలోని కీలక పదవులు, కమిటీల నుంచి ఇప్పటికే తప్పించారు. వాళ్లతోపాటు ఆనందకుమార్, అజిత్ ఝా అనే మరో ఇద్దరు సీనియర్ నేతలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమాంతర గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేశారని ప్రశాంత భూషణ్‌పై ఆరోపణలు మోపారు. కొత్త పార్టీ ఏర్పాటుగురించి ఏమంటారని కూడా ఆ సమావేశంలో కార్యకర్తలను అడిగినట్లు నోటీసులో పేర్కొన్నారు. -
ఆప్‌కు పోటీగా కొత్త పార్టీ!
ప్రశాంత్ భూషణ్, యోగేంద్రఏర్పాటు చేసే అవకాశం ఈనెల 14న మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్న ప్రశాంత్ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు కొత్త పార్టీ నెలకొల్పబోతున్నారా? ఇందుకు త్వరలోనే సన్నాహాలు మొదలుపెట్టనున్నారా? తాజా పరిణామాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రశాంత్ తోసిపుచ్చలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 14న తమ మద్దతుదారులతో సమావేశమవుతామని, ఈ భేటీ తర్వాత పార్టీ పెట్టాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పీటీఐ వార్తాసంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. తనను, యోగేంద్ర యాదవ్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన తీరు అత్యంత బాధకు గురిచేసిందన్నారు. కేజ్రీవాల్‌కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. కిందటేడాది నవంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ రద్దయ్యేందుకు ముందే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాల్సిందిగా ఓ సామాజిక కార్యకర్త ద్వారా రాహుల్‌గాంధీతో రాయబారాలు నడిపార ని చెప్పారు. ఇలా కాంగ్రెస్ మద్దతుకు యత్నించడం, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం, ఢిల్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల్లో కేజ్రీవాల్‌తో విభేదాలు ఏర్పడ్డాయని వివరించారు. ఇక వారితో కలసి నడవలేను ఆప్‌లో కొనసాగుతారా అని అడగ్గా.. కేజ్రీవాల్, ఆయన మద్దతుదారులతో కలసి ఇక నడవలేనని ప్రశాంత్ అన్నారు. ఆరోజు(మార్చి 28న జాతీయ మండలి సమావేశంలో) వారు చేసింది క్షమించరాని చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆప్ కార్యకర్తల శక్తిని సానుకూల దిశలోకి మళ్లించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సొంత ఎమ్మెల్యేలనే నమ్మని కేజ్రీవాల్! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం ఉండేది కాదని ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ మంగళవారం విమర్శించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీల కార్యాలయాల నుంచి చేస్తున్నట్లుగా.. సొంతవ్యక్తులతో పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయించేవారని, రూ. 10 కోట్లిస్తాం.. బీజేపీకి మద్దతివ్వాలని వారితో అడిగించేవారని గార్గ్ ఆరోపించారు. తనతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు అలాంటి ఫోన్‌కాల్స్ వచ్చాయని చెప్పారు. -
మనోభావాలను దెబ్బతీశారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో ముసలం ముదిరిపోయింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి వ్యవస్థాపక సభ్యులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తప్పించిన తీరుపై మరో సీనియర్ నేత మయాంక్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు రాజీనామాకు సిద్ధపడిన తరువాత కూడా మనీష్ సిసోడియా వీరి తొలగింపు తీర్మానాన్ని తీసుకురావటంపై తాను దిగ్భ్రాంతి చెందానని మయాంక్ గురువారం తన బ్లాగులో పేర్కొన్నారు. గురువారం జాతీయ కార్యవర్గ సమావేశంలో మయాంక్ ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గురువారం జరిగిన కీలకమైన పీఏసీ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనల గురించి బయటపెట్టినట్లయితే తనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం హెచ్చరించిందన్నారు. మయాంక్ ఆరోపణలు ఆప్‌లో ఉన్నతస్థాయి నాయకత్వం మధ్యన విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. మయాంక్ తన బ్లాగులో వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెడతానని ప్రశాంత్ భూషణ్ పలుమార్లు నాతో అన్నారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు అయ్యేంత వరకూ మిగతా నేతలు నియంత్రించారు. కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌ల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. ముగ్గురి మధ్య తీవ్రమైన విభేదాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 26 రాత్రి జాతీయ కార్యవర్గ సభ్యులు అరవింద్ కేజ్రీవాల్‌ను కలవటానికి వెళ్లినప్పుడు, ఆ ఇద్దరూ పీఏసీలో ఉంటే తాను కన్వీనర్‌గా ఉండనని ఆయన కచ్చితంగా చెప్పారు. 'జిందాల్'లో కేజ్రీవాల్ బెంగళూరు: తీవ్ర మధుమేహం, రక్తపోటు, దగ్గుతో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... చికిత్స కోసం బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో గురువారం చేరారు. పదిరోజులపాటు ఆయన ఇక్కడే ఉంటారు. పార్టీని విడిచిపెట్టను: యాదవ్ ఆప్ పీఏసీ నుంచి తమను తొలగించిన పరిణామాల గురించి ఆప్ సీనియర్ నేత మయాంక్ గాంధీ బ్లాగులో చేసిన వ్యాఖ్యలపై స్పందించటానికి యోగేంద్ర యాదవ్ నిరాకరించారు. ఆమ్ ఆద్మీపార్టీ అనే భావన వ్యక్తులకు అతీతమైనదని ఆయన అన్నారు. ఆప్‌ను విడిచిపెట్టేది లేదని యాదవ్ చెప్పారు. -
'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు అయ్యిందో, లేదో.. అప్పుడే ఆ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చ మొదలైన కొన్నాళ్లకే పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పీఏసీ పదవికి తానూ రాజీనామా చేస్తానని పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. పీఏసీ భేటీకి ఆయనతో పాటు సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా గైర్హాజరయ్యారు. ఈ ఉదంతంతో పార్టీ నాయకత్వం ఎటు పోతోంది, పార్టీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రి పదవికే పరిమితం అయిపోతే ఇక పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ఆమోదం ఉన్నా కూడా పార్టీని సమైక్యంగా నడిపించలేరా అన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీ భవితవ్యంపై కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నా, మరోవైపు నాయకులు ఒక్కొక్కరుగా చేజారిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. -
ఆమ్ ఆద్మీలో రగిలిన విభేదాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి తొలగించటానికి ఆప్ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆప్ నేత సంజయ్ సింగ్ సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను పార్టీ కన్వీనర్ పదవి నుంచి తొలగించటానికి పలువురు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ యోగేంద్ర, ప్రశాంత్ లపేర్లు ప్రస్తావించకుండానే వారిపై ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌ను తొలగించి యోగేంద్రకు పార్టీ కన్వీనర్ పదవి ఇవ్వాలంటూ మరో సీనియర్ నేత శాంతి భూషణ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలనూ ఆయన తప్పుబట్టారు. ‘‘పార్టీ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్‌ను తొలగించాలని కొందరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్టీ పేరునూ చెడగొడుతున్నారు’’ అని విమర్శించారు. ఇటీవల కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలు పార్టీని పరిహసించేలా, ఎగతాళి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆ లేఖలను లీక్ చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. వాటిని మీడియా ద్వారా ప్రజల ముందుకు తేవటానికి బదులుగా ఆ విషయాలను పార్టీ వేదికపై చర్చించి ఉండొచ్చని పేర్కొన్నారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ బుధవారం సమావేశమై.. తాజా వివాదంతో సహా అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే యోగేంద్ర, ప్రశాంత్‌లను పీఏసీ నుంచి తొలగించే అవకాశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు. గత వారం జరిగిన కార్యవర్గ భేటీలోనే కేజ్రీవాల్ రాజీనామాకు సిద్ధపడ్డారని, అయితే పార్టీ నేతలంతా అందుకు అనుమతించలేదని, పార్టీ జాతీయ కన్వీనర్‌గా ఆయనే కొనసాగాలని కోరినట్లు సంజయ్ తెలిపారు. ఆయన్ను తొలగించాలని కోరుతున్న వారు పార్టీ కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వారిద్దరిపై తీర్మానం ప్రవేశపెడతాం... కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా యోగేంద్ర కుట్రపన్నారని, ఆయనను పీఏసీ నుంచి తొలగించాల్సిందిగా బుధవారం జరిగే కార్యనిర్వాహక కమిటీ భేటీ తీర్మానం ప్రవేశపెడతానని ఈ కమిటీ సభ్యుడు నవీన్ జైహింద్ చెప్పారు. యోగేంద్ర, ప్రశాంత్‌లను పీఏసీ నుంచి తొలగించాలని తాము తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయని కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన మరో నేత పేర్కొన్నారు. పార్టీ నడిచే పద్ధతి ఒకటి ఉందని.. ఇప్పుడు తలెత్తిన సమస్యలు తీవ్రమైనవని అన్నారు. పార్టీలో ఒకరికి ఒక పదవే ఉండాలని, ఒక్క వ్యక్తి కేంద్రంగా నడిచే ఇతర పార్టీలకు భిన్నంగా ఉండాలని, అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లివిరియాలని ప్రశాంత్ భూషణ్ గతంలో లేఖ రాశారు. అలాగే పార్టీలో విలువలు, ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని యోగేంద్రతో కలసి మరో లేఖ రాయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. మరోవైపు పార్టీలో విభేదాలంటూ వస్తున్న కథనాలు ఊహాగానాలేనని యోగేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినందున చిన్న చిన్న విషయాలను పక్కనబెట్టి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలన్నారు. కొద్దిరోజులుగా తనకు, ప్రశాంత్ భూషణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం, కుట్ర జరుగుతోందని, ఇది చాలా బాధాకరమన్నారు. -
చైతన్య వాహిని
లోకంలో ప్రశ్నించే వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు. నిలదీసే వాళ్లూ ప్రతి వీధిలో తారసపడతారు. సమాధానం చెప్పేవాళ్లు మాత్రం కోటికొక్కరు ఉంటారు. అంతులేని ప్రశ్నలకు అర్థమయ్యేలా జవాబు చెప్పి.. సమాజంలో పేరుకుపోయిన బూజును దులిపే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే సంకల్పంతో ఏర్పాటైంది మంథన్ ఫౌండేషన్. సామాజిక అంశాలు, ఆర్థిక అవసరాలు, రాజకీయ కోణాలు, అంతర్జాతీయ సంగతులు.. ఇలా ఎన్నో అంశాలపై ఓపెన్ డిబేట్ నిర్వహిస్తూ సామాన్యుడికి అర్థం కాని అనేక విషయాలపై అవగాహన కల్పిస్తోంది. మంథన్ అంటే .. మేధోమథనం! వినడానికి బరువైన పదంగా అనిపించొచ్చు. కానీ ఎన్నో సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు చూపుతున్న మార్గం ఇది. సైన్స్ అండ్ ఫిక్షన్, రాజకీయాల్లోని అవినీతి.. ప్రజా చట్టాల్లోని లొసుగులు.. అభివృద్ధితో అందే ఫలాలు.. ఇలా లోకాభిరామాయణాన్ని భుుజానికెత్తుకుంది మంథన్ సంస్థ. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు అజయ్ గాంధీ, ఎమ్ఆర్ విక్రమ్‌ల ఆలోచనతో తొమ్మిదేళ్ల కిందట తొమ్మిది మందితో పిల్లకాలువలా మొదలైన ఈ వాహిని.. ఇప్పుడు ఆరువేల మంది సభ్యులతో ఉప్పెనలా రూపుదిద్దుకుంది. సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. లక్ష్యం దిశగా.. అంశం ఏదైనా సమాజాన్ని చైతన్య పర్చడమే మంథన్ లక్ష్యం. వివిధ రంగాల్లో ప్రముఖులు, నీతి, నిజాయతీలకు మారు పేరుగా నిలిచిన వారు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు బృంద చర్చలు, సమావేశాలు, బహిరంగ చర్చలు నిర్వహిస్తుంటారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను వక్తలుగా ఆహ్వానిస్తారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు ఓపెన్ డిబేట్లో ఆహూతుల అభిప్రాయాలను స్వీకరిస్తారు. ప్రతినెలా ఒకటి లేదా రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రవేశం ఉచితం. మనం చేయాల్సిందల్లా ఠీఠీఠీ.ఝ్చ్టజ్చిజీఛీజ్చీ.ఛిౌఝ లో పేరు నమోదు చేసుకోవడమే. సామాజిక బాధ్యతను నెత్తినేసుకున్న మంథన్ ఫౌండేషన్ ఏ ఇతర సంస్థ నుంచి , వ్యక్తుల నుంచి నిధులు వసూలు చేయదు. రచయితలు, వ్యాపారులు, కంపెనీ యజమానులు, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉండటం విశేషం. పెరుగుతున్న ఆదరణ.. మంథన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా 150 నుంచి 700 మంది ప్రజలు హాజరవుతారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఆరుసార్లకు పైగా ప్రముఖ వక్తలతో చర్చలు నిర్వహించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్య మనుగడపై సామాజిక కార్యకర్త, మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్‌రాయ్ ఉపన్యసించారు. గతంలో ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల పోరాట నేత కణ ్ణబీరన్, కవి జావెద్ అక్తర్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి 150 మందికి పైగా ప్రముఖులు మంథన్ సదస్సులో పాల్గొన్నారు. ఓపెన్ ప్లాట్‌ఫాం గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో మంథన్ సంవాద్-2014 ఏర్పాటు చేసినట్లు మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. మంథన్ అభిప్రాయాలు పంచుకోవడానికి అందరికీ ఓపెన్ ప్లాట్‌ఫాం అని తెలిపారు. - కాకి మాధవరావు, ఐఏఎస్(రిటైర్డ్ ) ఒక మైల్స్టోన్ నగరానికి మంథన్ ఒక మైల్స్టోన్ లాంటిది. తొమ్మిదేళ్లుగా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 150 మంది వరకు వ్యక్తలు పాల్గొన్నారు. వివిధ రకాల సభలు, సదస్సులు నిర్వహించాం. దేశంలోని సమస్యల గురించి విపులంగా, సూక్ష్మంగా విశ్లేషించేందుకు మంథన్ ఫౌండేషన్ సదస్సులు దోహదం చేస్తున్నాయి. - అజయ్ గాంధీ - కోన సుధాకర్‌రెడ్డి