పేదలకు న్యాయం అందడం లేదు
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
- లాయర్‌ను నియమించుకునే స్తోమత లేకపోవడమే కారణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో 80 శాతం మంది నిరుపేదలకు న్యాయం అందడం లేదని, కోర్టుల్లో తమ తరఫున వాదనలు వినిపించేలా న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత వారికి లేకపోవడమే దీనికి కారణమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘న్యాయవ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కోట్ల మందికి ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, న్యాయవ్యవస్థలో ప్రస్తుత సంక్లిష్టమైన విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. 20 శాతం మంది న్యాయవాదిని నియమించుకుని కోర్టుల్లో పోరాడుతున్నా తీవ్రమైన జాప్యం వల్ల వారికీ సత్వర న్యాయం అందడం లేదన్నారు.
కోట్లలో పెండింగ్ కేసులు, సంక్లిష్టమైన విధానంతో ప్రజలకు దూరంగా న్యాయవ్యవస్థ ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల నమ్మకం కోల్పోయి న్యాయవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందన్నారు. గ్రామీణ న్యాయాలయాలను విసృ్తతంగా ఏర్పాటు చేసి న్యాయవాది అవసరం లేని సరళమైన విధానాన్ని అమలు చేయాలని, తద్వారా కక్షిదారులే తమ సమస్యలపై నేరుగా వాదనలు వినిపించుకునే పరిస్థితులు కల్పించాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతిపోవాలంటే సమూలమైన సంస్కరణలు రావాలని బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, రఘునాథ్, భూపాల్‌రాజ్, లక్ష్మణ్‌సింగ్, సంపూర్ణ, తిరుపతివర్మ, గోవర్థన్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.