వీటిలో 361 కేసులు 20 ఏళ్లుగా విచారణకు ఎదురుచూపు
సీవీసీ వార్షిక నివేదికలో దిగ్భ్రాంతికర వాస్తవాలు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది.
సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది.
దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది.
సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment