Central Vigilance Commission
-
సీబీఐ దర్యాప్తు పూర్తయినా 6,900 కేసులు కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది. సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది. దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది. సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలిపింది. -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
దేశ ద్రోహులకు విదేశాల్లో..
కేవాడియా: మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయి తలదాచుకొనే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ‘దేశానికి ద్రోహం చేసిన వారికి, ఇక్కడ నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో నిలువ నీడ లేకుండా చేయాలి’ అని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవాడియాలో బుధవారం సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి బలవంతులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి.. పేదల హక్కులను హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా సాగిస్తున్న నిరి్వరామ కృషితో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, అవినీతిని అడ్డుకోవడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల బెడద లేకుండా ప్రభుత్వ పథకాలతో నుంచి తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. అవినీతి.. అది చిన్నదైనా, పెద్దదైనా పేద ప్రజల హక్కులను హరిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి నిరోధిస్తుందని చెప్పారు. మన సమ్మిళిత శక్తిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అవినీతిని నియంత్రించే దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ సంకల్పం, పాలనాపరమైన సంస్కరణలతో అవినీతికి చెక్ పెడుతున్నామని మోదీ తెలియజేశారు. ప్రజలపై నియంత్రణ చర్యలను తగ్గిస్తున్నామని, తద్వారా వారి జీవితాలను సరళతరం చేస్తున్నామని చెప్పారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే విధానాన్ని తాము విశ్వసిస్తున్నాని వెల్లడించారు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్‌కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
సీబీఐ చీఫ్‌గా మళ్లీ అలోక్ వర్మ
సంస్థ డైరెక్టర్‌గా ఆయననుతిరిగి నియమించిన సుప్రీంకోర్టు తొలగించే, బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టీకరణ ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అధికారాలకు కోత రఫేల్ దర్యాప్తు నుంచి మోదీ తప్పించుకోలేరు: రాహుల్ సమతూకం ఉన్న తీర్పు ఇది: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: సీబీఐ అంతఃకలహం కేసులో కేంద్రా నికి మంగళవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను పునఃనియమిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అలోక్‌వర్మ ఎలాంటి ప్రధాన విధానప రమైన నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలు వరించింది. సీబీఐ చీఫ్‌ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృ త్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డైరెక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంది. ఈ నెలాఖరుతో అలోక్ వర్మ పదవీకాలం ముగియనుండటంతో మరో వారంలోపు కేసుపై నిర్ణయం తీసుకోవాలని కమిటీని కోర్టు ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవ డం, ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసుల ఆధా రంగా గతేడాది అక్టోబర్ 23 అర్ధరాత్రి కేంద్రం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. ప్రభుత్వం తనను అక్ర మంగా పదవి నుంచి తప్పించిందంటూ అలోక్ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అలోక్ వర్మకు మళ్లీ డైరెక్టర్ పదవిని ఇచ్చినప్పటికీ అధికారాలను కోర్టు కత్తిరించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తొలగించలేరు, బదిలీ చేయలేరు.. సీబీఐ డైరెక్టర్‌ను ఒకసారి నియమించాక ప్రభు త్వం రెండేళ్లలోపు తొలగించడం కుదరదనీ, ఒకవేళ తొలగించాలంటే నియామకం చేపట్టిన అత్యున్నత స్థాయి కమిటీనే ఆ పని చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సంస్థ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆమోదం లేకుండా సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేయడానికీ వీల్లేదని కోర్టు పేర్కొంది. అలోక్‌వర్మపై సీవీసీ ఇంకా విచారణ జరుపు తున్నందున, వారంలోపు సమావేశమై ఈ కేసు ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీని కోర్టు ఆదే శించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిం ది. అయితే తీర్పును జస్టిస్ గొగోయ్ రాసి నప్ప టికీ ఆయన మంగళవారం కోర్టుకు హాజరుకా లేదు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించే అధికారం సీవీసీకి, కేంద్రానికి ఉందా లేదా అన్న దానిపైనే ఈ కేసులో వాద నలు జరిగాయి. పదవి నుంచి అలోక్, అస్థానా.. ఇద్దరినీ కేంద్రం తప్పించినా అలోక్ మాత్రమే కేంద్రంపై కోర్టులో కేసు వేశారు. సీబీఐ డైరెక్టర్‌పై మధ్యంతర చర్యలు తీసుకునే అధికారాన్నీ ప్రభుత్వానికి చట్టం ఇవ్వలేదనీ, సీబీఐని బయటి ప్రలోభాలు, ప్రభావాలకు దూరంగా ఉంచి స్వేచ్ఛ ఇవ్వగలిగితేనే ఆ సంస్థ ఏ భయం, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయగలదని కోర్టు పేర్కొంది. కాబట్టి సీబీఐ డైరెక్టర్ విధుల్లో ఏ అధికారీ, సంస్థా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగ్గ తీవ్ర కారణం, ప్రజాప్రయోజనం ఉండాలనీ, ఈ విషయాన్ని పరిశీలించే అధికారం కూడా ఎంపిక కమిటీకే ఉంటుందంది. ప్రభుత్వానికి గుణపాఠం: ఖర్గే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ గుణపాఠమనీ, చెంపదెబ్బ లాంటిదన్నారు. రఫేల్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించను న్నారనే కారణంతోనే అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో కొంత న్యాయం జరిగిందనీ, రఫేల్‌పై విచారణ నుంచి మోదీ తప్పించుకోలేరని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రధాని, ఆయన కార్యాలయంపై నేరారోపణ చేసినట్లుగా ఉందనీ సీపీఎం, ఆర్జేడీ, పీడీపీ, ఆప్ తదితర పార్టీలు పేర్కొన్నాయి. కాబట్టి మోదీ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అలోక్ వర్మకు తిరిగి పదవి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆయన అధికారా లను తగ్గించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను కాపాడేం దుకు తాము అలోక్, అస్థానాలను సీవీసీ సిఫారసుల ఆధారంగానే సెలవుపై పంపా మనీ, తమ నిర్ణయం పూర్తిగా సదుద్దేశంతో కూడుకున్నదేనని జైట్లీ సమర్థించుకున్నారు. ఇద్దరు అధికారులు గొడవ పడినందున తమ ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేననీ జైట్లీ చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి దురదృష్టకరం అలోక్‌పై అవినీతి ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీ సీవీసీకి పంపడం, ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి అలోక్‌ను తప్పించాలంటూ సీవీసీ ఆదేశించేలా పరిస్థితులు రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘సీవీసీ చెబుతున్న దాని ప్రకారం.. అలోక్‌పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. అయితే అలోక్ సీవీసీకి సహకరించడంపోయి, ఈ ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీకి ఎవరు చేశారో చెప్పాలని కోరా రు. అస్థానాపై ఆరోపణలు చేసేవరకు ఆయన వెళ్లారు. అస్థానాపై అవినీతి ఆరోపణలున్న అనేక కేసులను అలోక్ సీవీసీకి అందించారు. అలాగే అలోక్ వర్మపై అస్థానా ఆరోపణలు చేశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లోనే అలోక్, అస్థానా ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించడం సరైన చర్య అని సీవీసీ భావించి, సీవీసీ చట్టంలోని సెక్షన్–8, 11ల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. సీబీఐ ‘ఫైట్’లైన్! ►2017 అక్టోబర్: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించడంపై సీవీసీ ముందు అలోక్ వర్మ అభ్యంతరం. ►2018 జూలై 12: సీబీఐలో ప్రమోషన్లపై జరిగిన సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా అస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ►ఆగస్టు 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి అలోక్ వర్మ, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్ సానా 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రటరీకి అస్థానా లేఖ. ►అక్టోబర్ 4: సానాను సీబీఐ అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు సానా ఆరోపించారు. ►అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై అస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. ►అక్టోబర్ 23: రాకేశ్ అస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడు రోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న అస్థానాపై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్‌లో కుమార్ పేరు కూడా చేర్చారు. ►అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో అలోక్, అస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. ►అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు. ►నవంబర్ 12: సుప్రీంకోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. -
అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య
న్యూఢిల్లీ: అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ చర్యలు అవసరమవుతాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) పేర్కొంది. తనను సెలవులో పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పెట్టుకున్న పిటిషన్‌పై గురువారం వాదనలు ముగియగా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నట్లు చెబుతూనే రాత్రికి రాత్రే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీని సంప్రదించకుండా డైరెక్టర్ అధికారాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యా ఉత్తమ ఫలితం సాధించేదిగా, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేసేదిగా ఉండాలి’ అని పేర్కొంది. సీబీఐలో విభేదాలకు జూలైలోనే బీజాలు పడ్డాయన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. సీవీసీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సీబీఐలో సంభవించిన ఆశ్చర్యకర, అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు సీవీసీ విచారణ చేపట్టిందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలు కేసుల విచారణ మానేసి, ఒకరిపై మరొకరు దర్యాప్తు చేసుకోవడం మొదలుపెట్టినందునే కేంద్రం జోక్యం చేసుకుంది. వారిపై దర్యాప్తు చేపట్టే అధికారం సీవీసీకి ఉంది. అలోక్ ఆరోపణలపై విచారణ చేపట్టనట్లయితే, సీవీసీ విధులను నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. దీనిపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు సీవీసీ సమాధానం చెప్పుకోవాల్సి ఉండేది. దర్యాప్తునకు అవసరమైన పత్రాలను సీవీసీకి చాలా రోజుల దాకా అలోక్ వర్మ అందివ్వలేదు’ అని తుషార్ మెహతా అన్నారు. అలోక్ వర్మపై సీవీసీ దర్యాప్తునకు కేంద్రం న్యాయబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆస్తానా తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల పదవీకాలానికి అర్థం అధికారాలు లేని హోదా, విజిటింగ్ కార్డు కాదని అలోక్ వర్మ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ వ్యాఖ్యానించారు. నిర్ణీత పదవీ కాలమైన ఆ రెండేళ్లలో సీబీఐ డైరెక్టర్ ఏం చేసినా కేంద్రం, సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఎక్కడైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం, సీవీసీలకు లేదంటూ లాయర్ ఫాలి ఎస్.నారిమన్తోపాటు కామన్‌కాజ్ అనే ఎన్జీవో తరఫున వాదించిన దుష్యంత్ దవే పేర్కొనడంపై స్పందించిన ధర్మాసనం.. ‘రెండేళ్ల పదవీ కాలం ఉన్నంత మాత్రాన సీబీఐ డైరెక్టర్ అతీతుడా? ఆయనకు నిబంధనలు వర్తించవా? పార్లమెంట్ ఉద్దేశం ఇదేనా అని నిలదీసింది. సీబీఐ అధికారులను బాధ్యతల నుంచి తప్పించడం/సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వరాదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉండాలన్నారు. అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్ 23న సెలవుపై పంపిన విషయం తెలిసిందే. -
రెండేళ్లకు ముందే తొలగించలేరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా తనను రెండేళ్ల నిర్దిష్ట కాలానికి నియమించారనీ, అంతకుముందే విధుల నుంచి తప్పించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని ఆ సంస్థ చీఫ్ అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత నెలలో డైరెక్టర్ అలోక్ వర్మను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు గురువారం కొనసాగించింది. అలోక్‌వర్మ తరపున ఆయన న్యాయవాది ఫాలీ నారిమన్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ తదితరులు వాదనలు వినిపించారు. సీబీఐ డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేదని నారిమన్ అన్నారు. ‘1997లోనే వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది’ అని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం – 1946 ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలంటే ఆ అధికారం ఆయనను ఆ పదవికి ఎంపిక చేసిన ప్యానెల్ (ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ)కే ఉంటుందనీ, సీవీసీ ఆదేశాలపై అలోక్ వర్మను తొలగించడం చట్ట విరుద్ధమని నారిమన్ కోర్టుకు తెలిపారు. కేంద్రం చేసిన పనితో వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయిందన్నారు. బదిలీ చేయలేదు, వర్మనే డైరెక్టర్: ఏజీ నారిమన్ వ్యాఖ్యలతో ఏజీ వేణుగోపాల్ విభేదించారు. అలోక్ వర్మ తన అధికారిక బంగ్లాలోనే నివసిస్తున్నారనీ, కాబట్టి ఆయనను కేంద్రం బదిలీ చేసిందని అనుకోవడానికి వీల్లేదన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ కలగజేసుకుని.. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. డీఎస్పీఈ చట్టంలోని నిబంధనలను సీవీసీ, ప్రభుత్వం ఉల్లంఘించజాలవనీ, సీబీఐ డైరెక్టర్‌ను పదవీకాలం మధ్యలో బదిలీ చేయాలన్నా, తీసేయాలన్నా ఆయనను నియమించిన కమిటీకే ఆ అధికారం ఉంటుందని వివరించారు. విజిలెన్స్ చట్టం కింద అధికారాల్లేకుండానే, నిబంధనలను ఉల్లంఘించి వర్మను విధుల నుంచి కేంద్రం తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈరోజు సీబీఐ డైరెక్టర్‌కు జరిగినట్లుగానే రేపు కాగ్‌కు, సీవీసీకి జరగదని భరోసా ఏంటనీ, ఈ ప్రభుత్వానికి చట్టాలపై ఏం గౌరవం ఉందనీ, చట్టబద్ధ సంస్థల స్వతంత్రత ఏమవుతుందని సిబల్ ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తులు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ తాము ఈ కేసులో అలోక్, అస్థానా వర్గాల ఆరోపణల జోలికి పోమనీ, ముందుగా కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించిందా, లేదా అన్న దానిపైనే విచారిస్తామని స్పష్టం చేశారు. సీబీఐలో ఓఎస్డీ నియామకం? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో ప్రస్తుతం డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేడీ నాగేశ్వరరావు ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలువరించడం తెలిసిందే. ఈ కారణంగా సీబీఐలో పాలన సరిగా సాగడం లేదనీ, కాబట్టి సీబీఐలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌లో ఓఎస్డీ (ప్రత్యేక విధులపై నియమితులైన అధికారి)ని నియమించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. ఓఎస్డీ నియామకానికి అయితే∙ప్యానెల్ అనుమతి అవసరం లేదనీ, కాబట్టి ఓఎస్డీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీవీసీ నివేదికపై సుప్రీంకు వర్మ వివరణ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ప్రాథమిక నివేదికలోని అంశాలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సోమవారం సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. దీనిపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ మధ్యాహ్నం ఒంటిగంటకు సీల్డు కవర్లో సమాధానం అందజేశారు. అంతకుముందు ఆయన.. సమాధానం ఇచ్చేందుకు మరికాస్త సమయం కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ద్వారా కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. ‘విచారణ తేదీని మేం మార్చట్లేదు. సాధ్యమైనంత తొందరగా మీరు సమాధానమిస్తే, రేపు చేపట్టే విచారణ కోసం దానిని చదవాల్సింది ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వర్మ లాయర్‌కు తెలిపింది. దీంతో వర్మ..సరిగ్గా ఒంటి గంట సమయానికి తనపై ఆరోపణలకు సంబంధించి వివరణలున్న సీల్డు కవర్‌ను కోర్టుకు అందజేశారు. -
అసమగ్రంగా సీవీసీ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అలోక్ వర్మకు సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ పట్నాయక్‌కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని అలోక్‌వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్‌కాజ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్ బైండింగ్ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు సీల్డ్కవర్లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్ పట్నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్రావ్కు వ్యతిరేకంగా ఎన్జీవో దాఖలు చేసిన కామన్‌కాజ్ అనే పిల్‌ను సుప్రీం కొట్టేసింది. -
నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి
న్యూఢిల్లీ: సీబీఐ, ఆర్బీఐ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆయా సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నీతిమంతమైన నాయకుల్లా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హితవు పలికారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) ఏర్పాటు చేసిన సమావేశంలో కోవింద్ బుధవారం మాట్లాడారు. ‘ఇక్కడ ఉన్న వాళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు చెందిన అత్యున్నతాధికారులు, ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు. చిత్తశుద్ధి, పారదర్శకత, నిజాయితీ అనే పదాలకు లోతైన అర్థాలను మీరంతా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ ప్రవర్తన మీ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులకు స్ఫూర్తినివ్వాలి. మీ పని, నైతిక విలువలు కోట్లాది మంది పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నిజానికి మీరంతా నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి’ అని కోవింద్ కోరారు. అలోక్, అస్థానాలకు త్వరలో సమన్లు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలకు త్వరలోనే సమన్లు జారీచేసే అవకాశముందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి బుధవారం తెలిపారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో ముడిపుల స్వీకరణకు సంబంధించి వీరి వాంగ్మూలాలు నమోదుచేయొచ్చని వెల్లడించారు. -
ఇదెక్కడి న్యాయమో ‘సుప్రీం’కే తెలియాలి!
సాక్షి, న్యూఢిల్లీ : న్యాయం కోసం వెళితే న్యాయమే వెంటాడిందంటే ఇదేనేమో! ‘అయ్యా ! కేంద్రం అనవసరంగా అర్ధంతరంగా నన్ను సెలవుపై పంపించిందీ, ఇది అన్యాయం’ అంటూ సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనపై కేంద్రం చర్య తీసుకోవడం సబబా, కాదా? అన్న అంశాన్ని తేల్చాల్సిన సుప్రీం కోర్టు, ఆ విషయాన్ని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలకు సంబంధించి వర్మపై రెండు వారాల్లోగా ప్రాథమిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. విచారణను సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని, అంతవరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు రోజువారి కార్యకలాపాలను చూడాలే తప్ప ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా దాఖలైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం, ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను బలవంతంగా సెలవుపై పంపిస్తూ అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. హవాలా కేసులో నిందితుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై అస్థానాపై వర్మ ఎఫ్ఐఆర్ నమోదు చేశాకనే, వర్మ కూడా అవినీతికి పాల్పడ్డారంటూ అస్థానా ఆరోపణలు చేయడం తెల్సిందే. అవి కేవలం కౌంటర్ ఆరోపణలు మాత్రమే. వర్మపై ఎలాంటి అవినీతి ఆరోపణలు మరెక్కడి నుంచి రాలేదు. సీబీఐ డెరెక్టర్‌ను రెండేళ్ల కాలపరిమితి తీరేవరకు తొలగించడానికి వీల్లేదంటూ 1997 నాటి వినీత్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తొలగించాల్సిన అత్యవసర పరిస్థితులు తలెత్తుతే నియామక కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ స్పష్టం చేస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ను నియమించే కమిటీ అంటే, ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడా కమిటీ అన్నది తెల్సిందే. ఈ కమిటీ అనుమతి లేకుండానే సీబీఐ డైరెక్టర్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఈ చర్యను తప్పు పట్టాల్సిన సుప్రీం కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా వర్మపైనే విచారణకు ఆదేశించడం అసాధారణం. అస్థానపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులందరిని తాత్కాలిక నియామకంపై వచ్చిన నాగేశ్వరరావు అర్ధంతరంగా బదిలీ చేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరం. సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖకు మాత్రం సీబీఐ డైరెక్టర్‌పై దర్యాప్తునకు ఆదేశించామంటూ సుప్రీం కోర్టు మొక్కుబడిగా ఓ నోటీసును పంపించింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. -
సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావుపై ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారంది. అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. డైరెక్టర్ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వంపై పైచేయి కాదు.. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్ పిటిషన్‌పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది. సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌నూ ఇదే బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్, అలోక్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది. సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి అలోక్ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్‌ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు. సానుకూల పరిణామం: జైట్లీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు. నిజం నిలిచింది: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు. ‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అనంగ కుమార్ పట్నాయక్ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్ అన్సారీ, జములుద్దీన్ నజీర్లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్‌లో పట్నాయక్ సభ్యుడు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి శ్రీనివాసన్ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్ సభ్యుడే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ వివాదం పూర్వాపరాలు.. 2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకం. అక్టోబర్ 22: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం. నవంబర్ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్ ప్రశాంత్ భూషణ్. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు. 2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ. ఆగస్టు 24: అలోక్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం. సెప్టెంబర్ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ. అక్టోబర్ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అక్టోబర్ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్ అరెస్ట్. అక్టోబర్ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించిన కేంద్రం. అక్టోబర్ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్. అక్టోబర్ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన -
సీబీఐ ప్రతిష్టను దిగజార్చడం కాదా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకే ఇరువురు సిబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఐ సంస్థాగత రుజువర్తన, విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య తీసుకోక తప్పడం లేదు’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు నాటకీయంగా సీబీఐ కార్యాలయంపై దాడిచేసి, తనిఖీలు నిర్వహించడం, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ డిప్యూటీ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపించే ఉత్తర్వులను సర్వ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రస్థావనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ తీసుకరావడానికి సందర్భం ఉంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ రాజకీయ సానుకూలత చూపించడమే కాకుండా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ అస్థానా గత ఆగస్టు 24వ తేదీన కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకొనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇరువురిని సెలవుపై పంపించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసినట్లు అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. 1988 అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ డైరెక్టర్‌పై కేసు నమోదైన పక్షంలోనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. లేనట్లయితే జోక్యం చేసుకోకూడదు. అలోక్ వర్మపై ఎలాంటి అవినీతి కేసు దాఖలు కాలే దు. అలాంటప్పుడు విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు జోక్యం చేసుకొంది? అసలు జోక్యం చేసుకుందా? ప్రభుత్వమే విజిలెన్స్ కమిషన్‌ను ఓ సాకుగా వాడుకుందా? ఇక సీబీఐ డైరెక్టర్ పదవి రెండేళ్లు ఉంటుంది. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ఆయన్ని విధుల నుంచి తప్పించడానికి వీల్లేదు. అయినా చర్య తీసుకోవాల్సినంత తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం అయితే 2013 నాటి లోక్‌పాల్ చట్టం ప్రకారం ‘సెలక్షన్ కమిటీ’ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన సుప్రీం కోర్టు జడ్జీ సభ్యులుగా ఉంటారన్న విషయం తెల్సిందే. ‘సెలక్షక్ కమిటీ’ అనుమతి లేకుండానే సీబీఐ అధికారులపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ స్పష్టం అవుతుంది. కేంద్రం ఆదేశాల మేరకు అర్ధరాత్రి సీబీఐ కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టడం, డైరెక్టర్ ఆఫీసును తనిఖీ చేయడం, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ వస్తూ రాగానే పాత డైరెక్టర్ అనుచరులుగా భావించిన 13 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం తదితర పరిణామాలు సీబీఐ ప్రతిష్టను నిలబెట్టేవా, మరింత దిగజార్చేవా? -
సీబీఐ వివాదంపై స్పందించిన జీవీఎల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో నెలకొన్న వివాదంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ట్విటర్ వేదికగా స్పందించారు. సీబీఐలో నెలకొన్న సంక్షోభం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తమ పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించటానికి సంస్థని టార్గెట చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ అదే తరహా వంచన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సీవీసీ(సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) సలహా మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని ప్రక్షాళన చేయటం జరుగుతోందని అన్నారు. సీవీసీ సూచనల ప్రకారమే సీబీఐలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. సీబీఐ తాత్కాతిక డైరక్టర్ మన్నెం నాగేశ్వర్రావు తెలుగువారేనని తెలిపారు. టీడీపీ చేసే విమర్శలు కాంగ్రెస్‌తో పొత్తు కోసం టీడీపీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు ఉందని అన్నారు. దీని ద్వారా ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అభిప్రాయపడ్డారు. -
సింగిల్ టెండర్ల జాతర జీవోలకు పాతర
‘‘కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఏకీకృత నిబంధనలు రూపొందించి టెండర్లు నిర్వహించాలి. అప్పుడే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. అంచనా వ్యయం కంటే తక్కువ ధరలకే పనులు చేసేందుకు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుంది. సింగిల్ షెడ్యూలు దాఖలైతే ఆ టెండర్లను రద్దు చేయాలి’’ – టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలు ఇవి. సాక్షి, అమరావతి: కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. జీవో 94, 174లను వక్రీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. సింగిల్ షెడ్యూల్ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. రూ.944.29 కోట్ల విలువైన మూడు పనులకు నిర్వహించిన టెండర్లను ఖరారు చేసి..అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని హుకుం జారీ చేశారు. ఈ మూడు పనుల్లో సింగిల్ షెడ్యూళ్లపై ఆమోదముద్ర వేస్తే ఖజానాకు భారీగా నష్టం తప్పదు. మూడు టెండర్లు.. టెండర్లలో ఒకే సంస్థ షెడ్యూల్ దాఖలు చేస్తే.. టెక్నికల్(సాంకేతిక) బిడ్ స్థాయిలోనే వాటిని రద్దు చేసి, కొత్తగా టెండర్లు నిర్వహించాలని జీవో 94, 174లు తేల్చిచెబుతున్నాయి. కానీ, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ♦ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీలో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, కాలువ తవ్వకం, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల(పిల్ల కాలువ) పనులకు రూ.603.87 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచారు. హెచ్‌ఈఎస్(జాయింట్ వెంచర్) సంస్థ ఒక్కటే 4.57 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ♦ కర్నూలు జిల్లాలో పశ్చిమ మండలాలకు నీళ్లందించే ఎత్తిపోతల పథకానికి రూ.177.93 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో కోయా ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే 4.52 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ♦ తోటపల్లి పాత రెగ్యులేటర్ నుంచి నాగావళి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ.162.49 కోట్లతో ఇటీవల సర్కార్ టెండర్లు నిర్వహించింది. సాయిలక్ష్మి ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే 4.29 శాతం అధిక ధరలు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఈ మూడు టెండర్లను టెక్నికల్ బిడ్ స్థాయిలోనే రద్దు చేయాలి. పైనాన్స్(ఆర్థిక) బిడ్ తెరవకూడదు. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయా ప్రాజెక్టుల అధికారులు వాటి ఫైనాన్స్ బిడ్ సైతం తెరిచి, ఆ సంస్థలకే పనులు అప్పగించేందుకు అనుమతి కోరుతూ సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. ఈ టెండర్లను రద్దు చేసి.. మళ్లీ పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే కనీసం 5 శాతం తక్కువ ధరలకే పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు కోట్లాది రూపాయల సొమ్ము ఆదా అవుతుంది. కానీ, ముఖ్యనేత మాత్రం తన ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నారు. ఖజానాకు నష్టం వాటిల్లినా సరే తన జేబులు నిండితే చాలనుకుంటున్నారు. ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. ఆయా పనులు వారికే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.95 శాతం అదనపు ధరలకు(ఎక్సెస్) వారికే పనులు కట్టబెట్టి భారీ ఎత్తున కమీషన్లు దండుకోవడం ‘ముఖ్య’నేతకు పరిపాటిగా మారింది. కమీషన్లకు కక్కుర్తి పడి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించడంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల మేరకు 2003 జూలై 1న ప్రభుత్వం జీవో 94ను జారీ చేసింది. ఆ జీవో మేరకే టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలి. ఇంజనీరింగ్–ప్రొక్యూర్మెంట్–కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో నిర్వహించే టెండర్లను ఖరారు చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని హైపవర్ కమిటీ(హెచ్పీసీ)కి ప్రభుత్వం కట్టబెట్టింది. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అదనపు ధరలకు షెడ్యూళ్లను కోట్ చేస్తే వాటిని హెచ్పీసీ గుర్తించి, చర్య తీసుకుంటుంది. కానీ, గత నాలుగేళ్లుగా జీవో 94ను టీడీపీ సర్కార్ లెక్కచేయడం లేదు. పైగా మంత్రివర్గ ఉపసంఘాన్ని సంప్రదించకుండానే గతేడాది నవంబర్ 16న హెచ్‌పీసీని రద్దు చేస్తూ ముఖ్యనేత ఉత్తర్వులు జారీ చేయించారు. కాంట్రాక్టర్ మనోడైతే చాలు అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఒకలా.. దక్కే అవకాశం లేనప్పుడు మరోలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తుండడం చూసి జలవనరుల శాఖ అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే పథకానికి రూ.565.28 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. చంద్రబాబుకు బాగా కావాల్సిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ ఒక్కటే 4.65 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే ఆ పనులు దక్కడంతో సింగిల్ షెడ్యూల్‌ను ఆమోదించేలా సీవోటీపై ఒత్తిడి తెచ్చారు. ఆ సంస్థకు పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్లో మిగిలిపోయిన పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చిలో టెండర్ నోటిఫికేషన్ చేశారు. ఈ పనులను టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ముందుగానే నిర్ణయించారు. కానీ, ఆ పనులు సీఎం రమేష్‌కు దక్కే అవకాశం లేకపోవడంతో సింగిల్ షెడ్యూల్ దాఖలైందనే సాకు చూపి.. జీవో 94, 174లను ప్రస్తావిస్తూ ఆ టెండర్లను రద్దు చేయించారు. ఆ పనులకు మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించి.. 4.65 శాతం ఎక్సెస్‌కు సీఎం రమేష్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. -
అంబానీ జేబులోకి పేదల సొమ్ము
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదల డబ్బు దోచుకుని పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ధారపోస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘దేశానికి కాపలా దారుగా (చౌకీదార్) ఉన్న వ్యక్తి పేద ప్రజలు, అమరవీరులు, జవాన్ల జేబుల్లో నుంచి రూ. 20 వేల కోట్లు తీసుకుని.. వాటిని అంబానీ జేబులో పెట్టారు. ప్రధాని అవ్వగానే ‘చౌకీదార్‌జీ’ నేరుగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశాధ్య క్షుడితో ఒప్పందం చేసుకున్నారు. హెచ్ఏఎల్ను కాదని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వమని కోరారు’ అని ఆరోపించారు. అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం విలువను ఎందుకు బయటపెట్టడం లేదని, అంబానీకి కాంట్రాక్టు ఎలా దక్కిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రలో పాకిస్తాన్ పాత్ర: బీజేపీ రాఫెల్ ఒప్పందం రద్దుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలండ్ అందులో భాగమని బీజేపీ ఆరోపించింది. బావ రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి సాయం చేసేందుకు ఒప్పందం రద్దును రాహుల్ కోరుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. వాద్రాకు సంబంధమున్న కంపెనీని రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తిగా తీసుకోకపోవడంతో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుందన్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్ పాత్ర ఉందని కూడా షెకావత్ చెప్పారు. తదుపరి భారత ప్రధాని రాహుల్ అంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ట్వీట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. తనపై ఆరోపణల్ని వాద్రా తోసిపుచ్చారు. నిజాలు నిగ్గుతేల్చండి: రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సీవీసీ కేవీ చౌదరీకి పూర్తి వివరాలతో మెమొరాండం సమర్పించింది. ఖజానాకు ప్రభుత్వం నష్టం చేకూర్చిందని, కొందరు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ బృందం అందులో ఆరోపించింది. ‘రాఫెల్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణం. రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ అవినీతి జాడలు బయటపడుతున్నా.. రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాఫెల్ ఒప్పందంలోని అవినీతి, ఆశ్రిత పక్షపాత దుర్గంధం రోత పుట్టిస్తోంది. ఇందులో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి’ అని కాంగ్రెస్ కోరింది. -
ఒకేసారి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది. -
రైల్వే, బ్యాంకులపైనే ఎక్కువ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వేల మీదనే అవినీతికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2016తో పోలిస్తే 2017లో తమకు అందిన అవినీతి ఫిర్యాదుల సంఖ్య 52 శాతం తగ్గిందని పేర్కొంది. 2017కి సంబంధించిన వార్షిక నివేదికను ఇటీవల పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నివేదిక ప్రకారం.. గత ఏడాది మొత్తం 23,609 ఫిర్యాదులు అందాయి. 2016లో ఫిర్యాదుల సంఖ్య 49,847గా ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి చీఫ్ విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదుల సంఖ్య 60 వేలకుపైనే ఉంది. వీటిలో అధికంగా రైల్వే ఉద్యోగులపై 12,089 ఫిర్యాదులు అందాయి. ఇందులో 9,575 ఫిర్యాదులను పరిష్కరించారు. రైల్వే ఉద్యోగులపై వచ్చిన 1,037 ఫిర్యాదులు 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ బ్యాంకుల అధికారులకు వ్యతిరేకంగా 8,018 ఫిర్యాదులు అందాయి. -
ఆధార్‌తో అవినీతిని గుర్తిస్తాం: సీవీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారుల అవినీతిని గుర్తించడానికి ఆధార్‌ను వినియోగించుకోవాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) యోచిస్తోంది. పాన్, ఆధార్ సమాచారంతో వ్యక్తులు జరిపే ఆర్థిక లావాదేవీలు సక్రమమో కాదో తేల్చడం సులభమవుతుందని భావిస్తోంది. పలు ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల క్రయవిక్రయాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలోనే సీవీసీ ఈ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్ సాయంతో ఇతర ప్రభుత్వ విభాగాలతో కలసి ప్రభుత్వ అధికారుల అవినీతిని గుర్తించి, విచారించేలా ప్రత్యేక సాఫ్ట్వేర్, విధివిధానాలను రూపొందిస్తున్నామని సీవీసీ కేవీ చౌదరి తెలిపారు. పౌరుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఐటీ, రిజిస్ట్రేషన్ విభాగాలు, ఆర్థిక నిఘా సంస్థల వద్ద ఉందని వెల్లడించారు. -
వారికి వ్యతిరేకంగా 26వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా భారీగా అవినీతి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారికి వ్యతిరేకంగా దాదాపు 26వేలకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం నేడు లోక్‌సభకు వెల్లడించింది. ఫిర్యాదులు నమోదైన వారిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా 2017లో 26,052 ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నేడు లోక్‌సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిలో 22,386 ఫిర్యాదులు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. కాగ, 2016లో 51,207 ఫిర్యాదులు, 2015లో 32,149 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో 2016లోని 48,764 ఫిర్యాదులను, 2015లోని 30,789 ఫిర్యాదులను తిరస్కరించినట్టు చెప్పారు. -
సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్‌తో పంచుకోనున్నారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్ తెలిపింది. -
అవినీతి పెండింగ్ కేసుల్లో ‘రైల్వే’ టాప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) శుక్రవారం తెలిపింది. రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో వరుసగా 128, 82 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘అవినీతి నిర్మూలన, సమైక్యతా భావన పెంపులో ప్రజల భాగస్వామ్యం’అన్న అంశంపై అవగాహన సదస్సులు, పలు కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ ఎన్.పటేల్ బ్యాంక్ అధికారులు, ఉద్యోగులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ వారం పాటు గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
అవినీతి ఫిర్యాదులు సగానికి పైగా తగ్గాయి: సీవీసీ
న్యూఢిల్లీ: అవినీతి ఫిర్యాదులు 50 శాతానికి పైగా తగ్గాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పేర్కొంది. ‘2015లో 29,838 ఫిర్యాదులు సీవీసీకి అందాయి. ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్టం. 2014లో వచ్చిన 62,362 ఫిర్యాదుల కన్నా 52 శాతం తక్కువ’ అని ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన సీవీసీ వార్షిక నివేదిక చెప్తోంది. అలాగే.. అవినీతి ఆరోపణలతో 2013లో 31,432 ఫిర్యాదులు, 2012లో 37,039 ఫిర్యాదులు, 2011లో 16,929 ఫిర్యాదులు అందాయని తెలిపింది. 2014లో కొందరు ఫిర్యాదుదారులు అనేక ఫిర్యాదులు చేయటం వల్ల సంఖ్య ఎక్కువగా ఉందని.. దానివల్ల ఆ ఏడాదితో పోలిస్తే 2015లో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య తగ్గిపోయినట్లు కనిపిస్తోందని వివరించింది. గత ఏడాది వచ్చిన ఫిర్యాదుల్లో 12,650 ఫిర్యాదులు అస్పష్టంగా, తనిఖీ చేయలేని విధమైనవని చెప్పింది.