సాక్షి, న్యూఢిల్లీ : న్యాయం కోసం వెళితే న్యాయమే వెంటాడిందంటే ఇదేనేమో! ‘అయ్యా ! కేంద్రం అనవసరంగా అర్ధంతరంగా నన్ను సెలవుపై పంపించిందీ, ఇది అన్యాయం’ అంటూ సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనపై కేంద్రం చర్య తీసుకోవడం సబబా, కాదా? అన్న అంశాన్ని తేల్చాల్సిన సుప్రీం కోర్టు, ఆ విషయాన్ని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలకు సంబంధించి వర్మపై రెండు వారాల్లోగా ప్రాథమిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. విచారణను సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని, అంతవరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు రోజువారి కార్యకలాపాలను చూడాలే తప్ప ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది.
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం, ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను బలవంతంగా సెలవుపై పంపిస్తూ అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. హవాలా కేసులో నిందితుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై అస్థానాపై వర్మ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాకనే, వర్మ కూడా అవినీతికి పాల్పడ్డారంటూ అస్థానా ఆరోపణలు చేయడం తెల్సిందే. అవి కేవలం కౌంటర్ ఆరోపణలు మాత్రమే. వర్మపై ఎలాంటి అవినీతి ఆరోపణలు మరెక్కడి నుంచి రాలేదు. సీబీఐ డెరెక్టర్‌ను రెండేళ్ల కాలపరిమితి తీరేవరకు తొలగించడానికి వీల్లేదంటూ 1997 నాటి వినీత్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తొలగించాల్సిన అత్యవసర పరిస్థితులు తలెత్తుతే నియామక కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’ స్పష్టం చేస్తోంది.
సీబీఐ డైరెక్టర్‌ను నియమించే కమిటీ అంటే, ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడా కమిటీ అన్నది తెల్సిందే. ఈ కమిటీ అనుమతి లేకుండానే సీబీఐ డైరెక్టర్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఈ చర్యను తప్పు పట్టాల్సిన సుప్రీం కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా వర్మపైనే విచారణకు ఆదేశించడం అసాధారణం. అస్థానపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులందరిని తాత్కాలిక నియామకంపై వచ్చిన నాగేశ్వరరావు అర్ధంతరంగా బదిలీ చేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరం. సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖకు మాత్రం సీబీఐ డైరెక్టర్‌పై దర్యాప్తునకు ఆదేశించామంటూ సుప్రీం కోర్టు మొక్కుబడిగా ఓ నోటీసును పంపించింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment