అలోక్ వర్మ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా తనను రెండేళ్ల నిర్దిష్ట కాలానికి నియమించారనీ, అంతకుముందే విధుల నుంచి తప్పించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని ఆ సంస్థ చీఫ్ అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత నెలలో డైరెక్టర్ అలోక్ వర్మను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు గురువారం కొనసాగించింది. అలోక్‌వర్మ తరపున ఆయన న్యాయవాది ఫాలీ నారిమన్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ తదితరులు వాదనలు వినిపించారు.
సీబీఐ డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేదని నారిమన్ అన్నారు. ‘1997లోనే వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది’ అని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్‌పీఈ) చట్టం – 1946 ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలంటే ఆ అధికారం ఆయనను ఆ పదవికి ఎంపిక చేసిన ప్యానెల్ (ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ)కే ఉంటుందనీ, సీవీసీ ఆదేశాలపై అలోక్ వర్మను తొలగించడం చట్ట విరుద్ధమని నారిమన్ కోర్టుకు తెలిపారు. కేంద్రం చేసిన పనితో వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయిందన్నారు.
బదిలీ చేయలేదు, వర్మనే డైరెక్టర్: ఏజీ
నారిమన్ వ్యాఖ్యలతో ఏజీ వేణుగోపాల్ విభేదించారు. అలోక్ వర్మ తన అధికారిక బంగ్లాలోనే నివసిస్తున్నారనీ, కాబట్టి ఆయనను కేంద్రం బదిలీ చేసిందని అనుకోవడానికి వీల్లేదన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ కలగజేసుకుని.. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. డీఎస్‌పీఈ చట్టంలోని నిబంధనలను సీవీసీ, ప్రభుత్వం ఉల్లంఘించజాలవనీ, సీబీఐ డైరెక్టర్‌ను పదవీకాలం మధ్యలో బదిలీ చేయాలన్నా, తీసేయాలన్నా ఆయనను నియమించిన కమిటీకే ఆ అధికారం ఉంటుందని వివరించారు.
విజిలెన్స్ చట్టం కింద అధికారాల్లేకుండానే, నిబంధనలను ఉల్లంఘించి వర్మను విధుల నుంచి కేంద్రం తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈరోజు సీబీఐ డైరెక్టర్‌కు జరిగినట్లుగానే రేపు కాగ్‌కు, సీవీసీకి జరగదని భరోసా ఏంటనీ, ఈ ప్రభుత్వానికి చట్టాలపై ఏం గౌరవం ఉందనీ, చట్టబద్ధ సంస్థల స్వతంత్రత ఏమవుతుందని సిబల్ ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తులు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ తాము ఈ కేసులో అలోక్, అస్థానా వర్గాల ఆరోపణల జోలికి పోమనీ, ముందుగా కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించిందా, లేదా అన్న దానిపైనే విచారిస్తామని స్పష్టం చేశారు.
సీబీఐలో ఓఎస్డీ నియామకం?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో ప్రస్తుతం డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేడీ నాగేశ్వరరావు ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలువరించడం తెలిసిందే. ఈ కారణంగా సీబీఐలో పాలన సరిగా సాగడం లేదనీ, కాబట్టి సీబీఐలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌లో ఓఎస్డీ (ప్రత్యేక విధులపై నియమితులైన అధికారి)ని నియమించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. ఓఎస్డీ నియామకానికి అయితే∙ప్యానెల్ అనుమతి అవసరం లేదనీ, కాబట్టి ఓఎస్డీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment