జస్టిస్ మార్కండేయ కట్జూ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు.
వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు.
అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment