సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపించడం చెల్లదని, ఆయన్ని ఆ పదవిలో పునర్నియమిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మరునాడే అంటే, గురువారం సాయంత్రం ఆయన్ని ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్ వర్మను ఆ పదవిలో కొనసాగించడం సీబీఐ ప్రతిష్టకే భంగకరం కనుక ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక సర్వీసుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయంతో సీబీఐ ప్రతిష్ట మరింత మసకబారింది.
ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ రహస్య నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఎంపిక కమిటీ వర్మపై వేటు వేసింది. ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ మోదీ, జస్టిస్ సిక్రీలు నిర్ణయం తీసుకోగా ఖర్గే వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయం కనుక ఆలోక్ వర్మను బదిలీ చేశారు. సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోదీ ప్రభుత్వం అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? ఆయన అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చుగదా! అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?
రాకేశ్ అస్థాన నియమకం నుంచే అనుమానాలు
1984, గుజరాత్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాకేశ్ అస్థానను 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోదీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా ‘సూపర్‌కాప్’గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోదీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది.
హవాలా కేసులో ముడుపులు
ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులు జరపడం తెల్సిందే. అదే రోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై కేంద్రం పంపించింది. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
అన్ని సమాధానం లేని ప్రశ్నలే
అప్పటి నుంచి అన్ని ప్రశ్నలు, అనుమానాలు తప్ప, ఏ ఒక్కదానికి సరైన జవాబు దొరకడం లేదు. ఎంపిక కమిటీ నిర్ణయం లేకుండా వర్మపై చర్య చెల్లదని అప్పుడే తేల్చి చెప్పాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నాయకత్వంలోని బెంచీ అలా చేయకుండా వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది ? ఎందుకు రహస్య నివేదిక అడిగింది ? అస్థానపై అదే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు? సీవీసీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తప్పని ఎందుకు పేర్కొంది? మళ్లీ మోదీ నాయకత్వంలోని ఎంపిక సమీక్షించే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వర్మను సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది? తాను తెప్పించుకున్న సీవీసీ రహస్య నివేదికను మోదీకి ఎందుకు పంపించింది? అలోక్ వర్మపై చర్య తీసుకున్న మోదీ కమిటీ రాకేశ్ అస్థానపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు ఇప్పుడు స్వచ్ఛంద సెలవుపై వెళ్లారు? హిందూత్వ వాదిగా ముద్రపడిన నాగేశ్వర రావునే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం ఎందుకు జరుగుతోంది? ‘సీబీఐ యజమాని మాటలు పలికే పంజరంలో రామ చిలక’గా అభివర్ణించిన సుప్రీం కోర్టే ఎందుకు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిస్తోంది?
ఈ ప్రశ్నలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. అప్పుడే ప్రభుత్వం సచ్చీలతగానీ, సీబీఐ ప్రతిష్టగానీ తేలేది.
Comments
Please login to add a commentAdd a comment