Justice AK Sikri
-
సీజేఐ బాటలో జస్టిస్ ఏకే సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ గురువారం ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌ను శుక్రవారం ఈ మరో బెంచ్ విచారించనుంది. ‘ఈ పిటిషన్‌ను విచారించలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాల’ని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్ దవేతో జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. (‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ) సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించాలని జనవరి 10న నిర్ణయం తీసుకున్న ఉన్నతస్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. బెంచ్ నుంచి జస్టిస్ సిక్రీ తప్పుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఇప్పటికే బెంచ్ నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జస్టిస్ సిక్రీ కూడా వైదొలగడంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా లేదన్న భావన ప్రజల్లో కలిగే అవకాశముందన్నారు. -
‘కామన్వెల్త్’ పదవికి జస్టిస్ సిక్రి నో
న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్(సీశాట్) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే అన్న సంగతి తెలిసిందే. వర్మపై వేటుకు సిక్రి మద్దతుపలకడం, ఆ తరువాత వచ్చిన విమర్శలతో ఆయన కలతచెందినట్లు తెలుస్తోంది. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు. సీశాట్ పదవికి జస్టిస్ సిక్రి పేరును కేంద్రం గత నెలలోనే నామినేట్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సీశాట్‌కు వర్తమానం పంపింది. మార్చి 6న రిటైర్ అయిన తరువాత ఆయన ఈ పదవి చేపట్టాల్సి ఉంది. తొలుత ఈ ఆఫర్‌కు అంగీకరించిన జస్టిస్ సిక్రి..సీబీఐ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్వెల్త్ పదవిని ఆఫర్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే జస్టిస్ సిక్రిని సంప్రదించింది. దీనికి ఆయన అంగీకరించారు. ఎలాంటి జీతభత్యాలు లేని ఈ పదవిలో భాగంగా ఏడాదికి రెండు, మూడు విచారణలకు హాజరుకావాల్సి ఉంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ సిక్రిని సీశాట్ పదవికి నామినేట్ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భయంతోనే ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. న్యాయ ప్రక్రియలో ఇతరులు వేలుపెడితే, అరాచకం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. కామన్వెల్త్ కూటమిలోని 53 దేశాల మధ్య తలెత్తే వివాదాల్ని పరిష్కరించే అత్యున్నత మధ్యవర్తి సంస్థే సీశాట్. 1965లో ఈ సంస్థ ప్రారంభమైంది. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
జస్టిస్ ఏకే సిక్రీ (సుప్రీంకోర్టు) రాయని డైరీ
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నుంచి యడ్యూరప్ప రాజీనామా వరకు గత రెండు రోజులుగా రాజకీయాలపై క్షణక్షణానికీ నాకు ఉత్కంఠభరితంగా గౌరవభావం పెరిగిపోతోంది! పాలిటిక్స్‌లోని గొప్పదనం ఇదేనేమో. బలం లేనివాళ్లు బలం చూపిస్తామంటారు. బలం అసలే లేనివాళ్లు ‘చూస్తాం. ఎలా చూపిస్తారో’ అంటారు! ఆ రోజు.. బాబ్డే, భూషణ్, నేను.. బెంచి మీద ఉన్నాం. ముకుల్ రొహత్గీ మా ఎదురుగా ఉన్నాడు. యడ్యూరప్ప లాయర్ అతను. ‘‘మిస్టర్ రొహత్గీ.. మీ క్లయింట్ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారు?’’ అని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు. అదే ప్రశ్న నన్నూ తొలుస్తోంది. బహుశా బాబ్డేని కూడా తొలుస్తూ ఉండాలి. రొహత్గీ అనాసక్తిగా చూశాడు. ప్రశ్న అడగడంలో మాకున్న కుతూహలం.. సమాధానం చెప్పడంలో అతడికి కొంచెం కూడా లేనట్లుంది! ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా? లేక, ఎలా బలాన్ని నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా మిస్టర్ జస్టిస్’’ అన్నాడు రొహత్గీ. ‘‘ఏమిటి మీరనుకుంటున్న తేడా ఆ రెండింటికీ మిస్టర్ రొహత్గీ?!’’ అని భ్రుకుటి ముడిచారు జస్టిస్ బాబ్డే. ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారు? అంటే.. నిరూపణకు మీకేం అర్హత ఉందని ప్రశ్నించినట్లు. ‘ఎలా బలాన్ని నిరూపించుకుంటారు?’ అంటే నిరూపణకు అంత బలం మీకుందా అని ప్రశ్నించినట్లు’’ అన్నాడు రొహత్గీ. రాజకీయాల మీద మళ్లీ నాకు గౌరవం పెరిగిపోయింది.రొహత్గీ లాంటి లాయర్ని యడ్యూరప్ప పెట్టుకున్నందుకు! ‘‘నిరూపణకు.. అంత బలం మీకుందా అని అడగడమే నా ఉద్దేశం మిస్టర్ రొహత్గీ. ఎక్కడి నుంచి వస్తారు మీ క్లయింటుకు ఆ పదీ పరకా ఎమ్మెల్యేలు!’’ అన్నారు జస్టిస్ భూషణ్. రొహత్గీ నవ్వుతూ చూశాడు. కాన్ఫిడెన్స్ పీక్స్‌లోకి వెళ్లిపోతే కనిపించే నవ్వు అది. ‘‘ఎక్కడి నుంచైనా వస్తారు మిస్టర్ జస్టిస్. గాలిలోంచి నేరుగా ఫ్లోర్లోకే వచ్చేస్తారు’’ అన్నాడు రొహత్గీ! అంతే తప్ప, కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి అనలేదు!! మళ్లీ నాకు పాలిటిక్స్ మీద ఉత్కంఠభరితంగా గౌరవం పెరిగిపోయింది. ఆ రెండు పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు ‘గాలి’కి కొట్టుకొచ్చేస్తారని ఎంత భావయుక్తంగా చెప్పాడు! రొహత్గీ తర్వాత సింఘ్వీ టర్న్ వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్‌ల లాయర్ అతను. ‘‘మీ వాదన ఏమిటి మిస్టర్ సింఘ్వీ?’’ అని అడిగారు జస్టిస్ బాబ్డే. ‘‘గవర్నర్ గాల్లోంచి చూసి భూమ్మీద బీజేపీ ఎమ్మెల్నేల్ని లెక్కేస్తున్నారు మిస్టర్ జస్టిస్. ఆయన్ని ఎవరైనా కిందికి దింపగలిగితే బాగుంటుంది’’ అన్నాడు సింఘ్వీ! అతడు కూడా రాజకీయాలపై నాకు ఏర్పడుతున్న గౌరవ భావాన్ని విపరీతంగా పెంచేశాడు. -మాధవ్ శింగరాజు -
నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన ప్రతీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేపు సాయంత్రం ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కన్నడ రాజకీయాలకు జోకులు కూడా పేలుతున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లు, మెమెలతో కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అలా చక్కర్లు కొడుతున్న ఓ జోకును ప్రస్తావించటం విశేషం. ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పిటిషన్లపై సీరియస్‌గా వాదనలు కొనసాగుతున్న సమయంలో జడ్జి సిక్రీ జోక్యం చేసుకుంటూ... ఇందాకే వాట్సాప్‌లో మాకు ఓ మెసేజ్ వచ్చింది‘‘ అయ్యా... నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి నన్ను సీఎంను చెయ్యండి’’ అంటూ గవర్నర్ కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి కోరతాడు. ఇంతకీ మీరు ఎవరయ్యా అని సిబ్బంది అడిగితే... ఎమ్మెల్యేలు తలదాచుకున్న హోటల్ యాజమానిని అని అవతలి వ్యక్తి సమాధానమిస్తాడు... అంటూ ఆ జోకును న్యాయమూర్తి సిక్రీ చదివి వినిపించారు. దీంతో కోర్టు హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. బెంగళూరులోని ఇగల్‌టన్ రిసార్ట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తలదాచుకోవటంపై ఈ జోకు నిన్నంతా వైరల్ అయ్యింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని హోటల్లలో బస చేసిన విషయం తెలిసిందే. కాగా, గవర్నర్ వాజుభాయ్ వాలా విధించిన 15 రోజుల గడువును తోసిపుచ్చిన కోర్టు శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణకు సిద్ధం కావాలని కర్ణాటక సీఎం యెడ్యూరప్పను ఆదేశించింది. -
సహకరిస్తే.. అరెస్ట్ అక్కర్లేదు!
సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: నిందితులు దర్యాప్తునకు సహకరిస్తున్న సందర్భాల్లో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘అరెస్ట్ అంటే సమాజంలో అప్రతిష్ట, అవమానం, అగౌరవమనే అభిప్రాయం ఉంది. దర్యాప్తు సంస్థకు నిందితుడు పూర్తిగా సహకరిస్తున్నాడని, పారిపోయే అవకాశం లేదని, మళ్లీ నేరాలకు పాల్పడబోడని కోర్టు విశ్వసిస్తున్న సందర్భాల్లో అరెస్ట్‌ను నివారించవచ్చు’ అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం పేర్కొంది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘అరెస్ట్ వల్ల ఆ వ్యక్తే కాకుండా, అతడి కుటుంబం, కొన్నిసార్లు మొత్తం సమాజం ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిందితుడిగా ఉండగా చేసే అరెస్ట్‌కు, దోషిగా నిర్ధారణ అయ్యాక చేసే అరెస్ట్‌కు స్పష్టమైన తేడా ఉంది. చాలామంది ఆ తేడాను గుర్తించలేరు’ అని పేర్కొంది. అరెస్ట్‌కు ముందు నేర తీవ్రత, అందులో నిందితుడి పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలని, అరెస్ట్‌కు ముందే అందుకు కారణాలను సంబంధిత అధికారి కేస్‌డైరీలో పొందుపర్చాలని ఆదేశించింది. నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చాక, అతడిని విచారణ కోర్టు ముందు లొంగిపోయి, సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి తేకూడదని పేర్కొంది. బెయిల్ ఇవ్వడం వల్ల నిష్పాక్షిక దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందా? అనే విషయాన్ని.. బెయిల్ ఇవ్వకపోతే పోలీసుల వేధింపులకు ఆస్కారం ఉందా? అనే విషయాన్ని ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు పరిగణనలోకి తీసుకోవాలంది. 17 ఏళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి స్థానిక కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. అనంతరం స్థానిక కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 2001లో నమోదైన కేసులో, 13 ఏళ్ల తర్వాత 2014లో రేప్ ఆరోపణలకు సంబంధించిన ఐపీసీ 376 సెక్షన్‌ను చేర్చి, నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదనడం సరికాదని పేర్కొంది.