సహకరిస్తే.. అరెస్ట్ అక్కర్లేదు!
సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: నిందితులు దర్యాప్తునకు సహకరిస్తున్న సందర్భాల్లో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘అరెస్ట్ అంటే సమాజంలో అప్రతిష్ట, అవమానం, అగౌరవమనే అభిప్రాయం ఉంది. దర్యాప్తు సంస్థకు నిందితుడు పూర్తిగా సహకరిస్తున్నాడని, పారిపోయే అవకాశం లేదని, మళ్లీ నేరాలకు పాల్పడబోడని కోర్టు విశ్వసిస్తున్న సందర్భాల్లో అరెస్ట్‌ను నివారించవచ్చు’ అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం పేర్కొంది.
ముందస్తు బెయిల్‌కు సంబంధించిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘అరెస్ట్ వల్ల ఆ వ్యక్తే కాకుండా, అతడి కుటుంబం, కొన్నిసార్లు మొత్తం సమాజం ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిందితుడిగా ఉండగా చేసే అరెస్ట్‌కు, దోషిగా నిర్ధారణ అయ్యాక చేసే అరెస్ట్‌కు స్పష్టమైన తేడా ఉంది. చాలామంది ఆ తేడాను గుర్తించలేరు’ అని పేర్కొంది. అరెస్ట్‌కు ముందు నేర తీవ్రత, అందులో నిందితుడి పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలని, అరెస్ట్‌కు ముందే అందుకు కారణాలను సంబంధిత అధికారి కేస్‌డైరీలో పొందుపర్చాలని ఆదేశించింది.
నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చాక, అతడిని విచారణ కోర్టు ముందు లొంగిపోయి, సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి తేకూడదని పేర్కొంది. బెయిల్ ఇవ్వడం వల్ల నిష్పాక్షిక దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందా? అనే విషయాన్ని.. బెయిల్ ఇవ్వకపోతే పోలీసుల వేధింపులకు ఆస్కారం ఉందా? అనే విషయాన్ని ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు పరిగణనలోకి తీసుకోవాలంది.
17 ఏళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి స్థానిక కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. అనంతరం స్థానిక కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 2001లో నమోదైన కేసులో, 13 ఏళ్ల తర్వాత 2014లో రేప్ ఆరోపణలకు సంబంధించిన ఐపీసీ 376 సెక్షన్‌ను చేర్చి, నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదనడం సరికాదని పేర్కొంది.