నిందితుడు నాగేశ్వరరావు
పెదగంట్యాడ (గాజువాక): పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున పరారయ్యాడు. ఇటీవల గంజాయి కేసులో అరెస్టయిన నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం సంచలనంగా మారింది. సోమవారం వరకూ ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడికి చెందిన మిర్తిపాటి నాగేశ్వరరావు పెదగంట్యాడ మండలంలోని గాంధీనగర్‌లో 486 కిలోల గంజాయి
అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడైన మిర్తిపాటి నాగేశ్వరరావును అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో ఉంచారు. రిమాండ్‌కు తరలించే ముందు కోవిడ్ – 19 పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించాలనే నిబంధనల మేరకు స్టేషన్‌లోనే అతన్ని ఉంచారు. అయితే ఆదివారం తెల్లవారుజామున నాగేశ్వరరావు మరుగుదొడ్డికి వెళ్తానని చెప్పడంతో ఓ కానిస్టేబుల్‌తో కలిసి హోంగార్డు అతన్ని బాత్రూమ్‌కు తీసుకెళ్లారు. బాత్రూమ్ తలుపు రాకపోవడంతో అది తీసేందుకు ఒకరు ప్రయత్నించే సమయంలో మరొకరి చేతిని విడిపించుకుని నిందితుడు పారిపోయాడు. పోలీసులు పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. నాగేశ్వరరావు కోసం ఆదివారం, సోమవారం పోలీసు బృందాలు గాలించినా ఉపయోగం లేకపోయింది. ఈ సంఘటనపై న్యూపోర్టు పోలీసులను వివరణ కోరగా బిజీగా ఉన్నామంటూ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment