
జస్టిస్ ఏకే సిక్రి
న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్‌వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్(సీశాట్) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే అన్న సంగతి తెలిసిందే. వర్మపై వేటుకు సిక్రి మద్దతుపలకడం, ఆ తరువాత వచ్చిన విమర్శలతో ఆయన కలతచెందినట్లు తెలుస్తోంది. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు. సీశాట్ పదవికి జస్టిస్ సిక్రి పేరును కేంద్రం గత నెలలోనే నామినేట్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సీశాట్‌కు వర్తమానం పంపింది. మార్చి 6న రిటైర్ అయిన తరువాత ఆయన ఈ పదవి చేపట్టాల్సి ఉంది.
తొలుత ఈ ఆఫర్‌కు అంగీకరించిన జస్టిస్ సిక్రి..సీబీఐ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్‌వెల్త్ పదవిని ఆఫర్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే జస్టిస్ సిక్రిని సంప్రదించింది. దీనికి ఆయన అంగీకరించారు. ఎలాంటి జీతభత్యాలు లేని ఈ పదవిలో భాగంగా ఏడాదికి రెండు, మూడు విచారణలకు హాజరుకావాల్సి ఉంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ సిక్రిని సీశాట్ పదవికి నామినేట్ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భయంతోనే ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. న్యాయ ప్రక్రియలో ఇతరులు వేలుపెడితే, అరాచకం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. కామన్‌వెల్త్ కూటమిలోని 53 దేశాల మధ్య తలెత్తే వివాదాల్ని పరిష్కరించే అత్యున్నత మధ్యవర్తి సంస్థే సీశాట్. 1965లో ఈ సంస్థ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment